అమీర్‌పేట: అభం... శుభం తెలియని ఐదేళ్ల బాలుడిని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఈఎస్‌ఐ మెట్రోరైలు బ్రిడ్జికింద పాడేసిపోయారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుడి ఒంటిపై పసుపు, కుంకుమ పూసి ఉండటంతో బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ జీవీ రమణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈఎస్‌ఐ ఆసుపత్రి మెట్రోరైలు స్టేషన్ పిల్లర్ వద్ద ఓ మూట ఉండగా స్థానికులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేశారు.
పోలీసులు వచ్చి మూటను విప్పి చూడగా అందులో బాలుడి మృతదేహం కనిపించింది. మృదేహం కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి రెండు రోజుల క్రితం చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాలుడి ఒంటిపై ఎర్రటి లంగా చుట్టి, పసుపూ, కుంకుమ పూసి ఉండటాన్ని బట్టి బలి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దుండగులు బాలుడి గొంతు నులిమి హత్య చేసి ఉంటారని, వయసు సుమారు ఐదేళ్లు ఉంటుందని, అతడికి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు తెలిపారు. డాగ్ స్వ్కాడ్‌ను రప్పించి స్థానికంగా పరిశీలించినా నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం బాలుడి మిస్సింగ్‌కు సంబంధించి ఏవైనా కేసులు నమోదయ్యాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గోనె సంచిలో బాలుడి మృతదేహం
Published Tue, Aug 18 2015 1:24 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement