‘మార్కెట్ కమిటీ’ వేతనాలు పదింతలు
‘మార్కెట్ కమిటీ’ వేతనాలు పదింతలు
Published Wed, Jun 28 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
గ్రేడ్–1 మార్కెట్ చైర్మన్ల వేతనం వెయ్యి నుంచి 10 వేలకు పెంపు
- రూ.2 వేలున్న వారి వేతనం రూ.20 వేలకు పెంపు
- పెంపునకు మంత్రి హరీశ్‌రావు ఆమోదం..10 రోజుల్లో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత వేతనాలను ఏకంగా పదింతలు చేయనుంది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం రూ.2 వేల వేతనం ఇస్తుండగా దాన్ని రూ.20 వేలకు పెంచనున్నారు. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.15 వేలకు, గ్రేడ్–1 మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.10 వేలకు, ఇతర గ్రేడ్ మార్కెట్ల చైర్మన్ల వేతనాన్ని రూ.500 నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. వేతనాల పెంపుపై మార్కెటింగ్‌శాఖ కసరత్తు చేసి మంత్రి హరీశ్‌రావుకు ఫైలు పంపగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచా రం. ఇందుకు సంబంధించి వారం, పది రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
సరైన వేతనాలు లేక ఇబ్బందులు...
రాష్ట్రంలోని 180 మార్కెట్ కమిటీల్లో 16 సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లు, 29 స్పెషల్ గ్రేడ్ మార్కెట్లు, 26 గ్రేడ్–1 మార్కెట్లు, 109 ఇతర మార్కెట్లు ఉన్నా యి. కొందరు మార్కెట్ కమిటీల చైర్మన్ల వేతనాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న పింఛన్లకన్నా తక్కువగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ భావించింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన అనేక మంది మార్కెట్ కమిటీ చైర్మన్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటం, తక్కువ వేతనాల కారణంగా వారు వివిధ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారి వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. వేతనాల పెంపు నిర్ణయం వాస్తవమేనని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.
కాల పరిమితి పొడిగింపు
అనేక మార్కెట్ కమిటీ చైర్మన్ల కాలపరిమితి ముగుస్తుండటంతో ప్రభుత్వం వాటిని 6 నెలలకు పొడిగిస్తోంది. 70 మార్కె ట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలు పొడిగింపు ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలకు ఏడాది కాలపరిమితి ఉండగా దాన్ని రెండుసార్లు వరకు 6 నెలల చొప్పున పొడిగించే వీలుంది. మార్కెట్ కమిటీలను బలో పేతం చేయాలనుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో మిర్చి, కంది సహా ఇతర ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించామన్నారు.
Advertisement
Advertisement