
నేటితోసరి
క్రమబద్ధీకరణ గడువు పూర్తి
ఎల్‌ఆర్‌ఎస్...బీఆర్‌ఎస్‌కూ అంతే..
హెచ్‌ఎండీఏకు 1.58 లక్షలు..జీహెచ్‌ఎంసీకి 2 లక్షల దరఖాస్తులు
జీహెచ్‌ఎంసీలో ఎల్‌ఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌కు.... హెచ్‌ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు మంగళవారంతో గడువు ముగుస్తోంది. ఇకపై ఇలాంటి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. నిర్ణీత సమయం మించితే దరఖాస్తులు తీసుకోబోమని అంటున్నారు. బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకూ 2 లక్షలు... క్రమబద్ధీకరణకు హెచ్‌ఎండీఏకు 1.58 లక్షల దరఖాస్తులు అందాయి. వీటి ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.157 కోట్లు... హెచ్‌ఎండీఏకు రూ.150 కోట్ల ఆదాయం సమకూరింది.
సిటీబ్యూరో: క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీక రణకు ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్ ఎస్ గడువు కూడా మంగళవారంతో ముగుస్తుండటంతో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తి పలకాలని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్ణయించింది. మంగళవారం రాత్రి 12గంటలకే హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిర్ణీత గడువు ముగిశాక దరఖాస్తులను, ఫీజులను ఆన్‌లైన్‌లో స్వీకరించకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్రమబద్ధీకరణకు ఈసారి అనూహ్య స్పందన లభించింది. 2007-08లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంతగా స్పందన కనిపించలేదు. అప్పట్లో కేవలం 63వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటి లో 40వేలు పరిష్కరించడం వల్ల రూ.200 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి సోమవారం సాయంత్రం వరకు హెచ్‌ఎండీఏకు 1.58 లక్షల దరఖాస్తులు అందాయి. ఎల్‌ఆర్‌ఎస్ కింద అత్యధికంగా 1,22,850... బీఆర్‌ఎస్ కింద 35,150 దరఖాస్తులు వచ్చాయి.ప్రాథమిక రుసుంగా ఇప్పటి వరకు రూ.138.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో మరో రూ.21 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి హెచ్‌ఎండీఏకు రావాల్సి ఉంది. ఈ లెక్కన సుమారు రూ.159 కోట్ల ఆదాయం వస్తోంది. మొత్తం లక్షన్నరకు పైగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరిస్తే రూ.500కోట్లకు పైగా సమకూరుతుందని అధికారుల అంచనా. డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో రిటైరైనసిబ్బందిని తాత్కాలికంగా నియమించుకొని వచ్చే 6-8 నెలల్లోగా దరఖాస్తులను పరిష్కరించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ భావిస్తున్నారు.
పరిష్కారం ఎలా?
హెచ్‌ఎండీఏకు పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిష్కరించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. కీలకమైన ప్లానింగ్ విభాగంలో తగినంత సిబ్బంది లేరు. గతంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకొని 63 వేల దరఖాస్తుల్లో 40వేలు పరిష్కరించ గలిగారు. మిగిలిన 20వేల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తప్పించారు. ఈ పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారన్నది ప్రశ్న. సకాలంలో పరిష్కరించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. టైటిల్ వెరిఫికేషన్‌కు కనీసం 20 మంది రెవెన్యూ సిబ్బంది అవసరం. వీరు రోజుకు 10 దరఖాస్తుల వంతున పరిశీలించినా 200 మాత్రమే పూర్తి చేయగలరు. ఈ లెక్కన వారానికి 5 రోజులు (సెలవులు పోను) పనిచేస్తే 1000 మాత్రమే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 1.60 లక్షల దరఖాస్తులకు 160 పని దినాలు పడతాయి. పండుగలు, ఇతర సెలవులు తీసేస్తే సుమారు 6 నెలలు పడుతుంది. నిజానికి ఒక డిప్యూటీ తహశీల్దార్ రోజుకు 10 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించడం అసాధ్యం. రోజుకు 5 దరఖాస్తులు తేల్చినా... మొత్తం 1.60 లక్షల దరఖాస్తులకు ఏడాది పడుతుంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో డీటీలు, సర్వేయర్లు, ప్లానింగ్ అధికారులు తగినంత మంది లేరు. ఈపరిస్థితుల్లో 6-8 నెల ల్లో ఎలా పరిష్కరించి క్రమబద్ధీకరణ ధ్రువీకరణ పత్రాలు అందిస్తారన్నది ప్రశ్నార్థకం.
జీహెచ్‌ఎంసీకి 2 లక్షల దరఖాస్తులు
సిటీబ్యూరో: బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జీహెచ్‌ంఎసీకి దాదాపు రెండు లక్షల దరఖాస్తులు అందాయి. నేడు (మంగళవారం) ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వేగిర పడుతున్నారు. జీహెచ్‌ఎంసీకి సోమవారం సాయంత్రం వరకు బీఆర్‌ఎస్‌కు 1,31,095... ఎల్‌ఆర్‌ఎస్‌కు 68,722.... మొత్తం 1,99,817 దరఖాస్తులు అందాయి. ప్రాథమిక ఫీజుగా బీఆర్‌ఎస్‌కు దాదాపు రూ.102 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.55 కోట్లు... మొత్తం రూ. 157 కోట్లు జీహెచ్‌ంఎసీ ఖజానాకు జమయ్యాయి. బీఆర్‌ఎస్ దరఖాస్తులను స్వీకరించడం తప్ప, ఎలాంటి ప్రాసెస్ చేయరాదని హైకోర్టు ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు అనంతరమే వీటిని పరిశీలించాలని భావిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మాత్రం గడువు ముగియగానే పరిశీలించనున్నారు. వంద రోజుల్లో పదివేల దరఖాస్తులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రకటించారు.
ఆర్థిక పరిపుష్టికి...
హెచ్‌ఎండీఏను ఆర్థికంగా పటిష్టపర్చాలన్నదే నా లక్ష్యం. 1.60 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తే రూ.500 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సిబ్బంది కొరతతో పరిష్కారంలో కొంత ఇబ్బంది ఎదురైంది. అందుకే రిటైర్డ్ ప్లానింగ్ అధికారులను తీసుకోవాలని నిర్ణయించాను. డీటీసీపీ నుంచి 30 మంది, రెవెన్యూ నుంచి 20 మంది సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశాను. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ప్లానింగ్ వింగ్ నుంచి 24 మందిని తీసుకొని ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం.
- టి.చిరంజీవులు, కమిషనర్, హెచ్‌ఎండీఏ