దెబ్బకు ఠా దొంగల ముఠా
సిటీలోని వినోద కేంద్రాలు విచిత్రాలను చూపిస్తున్నాయి. రొటీన్ వర్క్‌కు బై చెప్పి ప్రొటీన్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటున్న కార్పొరేట్ ఉద్యోగులే లక్ష్యంగా ఏర్పాటవుతున్న వినోద కేంద్రాలు.. వైవిధ్య లోతుల్ని తవ్వి తీస్తున్నాయి. పబ్, క్లబ్, కాఫీ షాప్స్, స్పోర్ట్స్ ఎరీనాలు.. ఇవన్నీ బోర్ కొట్టేశాయంటున్న యువత కోసం అరుదైన ఆటల కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయి. రియాలిటీ షోలను తలదన్నే రీతిలో గేమ్‌లను డిజైన్ చేసి యువ సందడికి వేదికలవుతున్నాయి.
ట్రెజర్ గేమ్..
ఒక సంపన్నుడు 1950లో తమ పూర్వీకుల సమాధితో పాటు నేలమట్టం అయిన నిధిని తిరిగి పొందాలని ఆశిస్తాడు. దీని కోసం కొందరిని నియమించుకొని వారిని టైమ్ మెషిన్ మీద కొన్ని దశాబ్దాల వెనుకకు పంపించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మెషిన్ పొరపాటు వల్ల అది వారిని సమాధి నేలమట్టం అవడానికి కేవలం గంట ముందుకు మాత్రమే పంపుతుంది. దీంతో వాళ్లు కేవలం 60 నిమిషాల్లో నిధిని కనిపెట్టడంతో పాటు కుప్పకూలనున్న సమాధి నుంచి బయటపడాల్సి వస్తుంది. అప్పుడు మొదలువుతుంది ఆట.. రంజుగా.
నిజాం ఆభరణాల చోరీకి...
సిటీలోని సాలార్జంగ్ మ్యూజియంలోని నిజాం నగల తాత్కాలిక ప్రదర్శన నుంచి అత్యంత ఆకర్షణీయమైన, విలువైన 250 క్యారట్ల నిజామీ డైమండ్‌ని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తుందో ముఠా. కేవలం గంట వ్యవధిలో దీన్ని దొంగలించి, సెక్యూరిటీ గార్డ్స్‌కి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడానికి ముఠాలోని కొందరు సిద్ధమవుతారు.
అందాల నటికి ఆపదొస్తే..
ఒక టాలీవుడ్ నటి జీవితం చిక్కుల్లో పడుతుంది. నటికి ఆపద కల్పించాలనే ఉద్దేశంతో ఆమె నటిస్తున్న షూటింగ్ సెట్లో సైతం ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. తనకు మరో గంటలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు అంతరాయం కలుగకూడదని అనుకుంటారు నిర్మాత, దర్శకులు. గంట వ్యవధిలో నటికి కీడు తలపెట్టిన వారిని పట్టుకోవాలని సిటీకి చెందిన టాప్ డిటెక్టివ్‌లను పురమాయిస్తారు.
ఈ వినోద క్రీడల్లో నిధిని అన్వేషించే వాళ్లు, ఆభరణాల దొంగలు, డిటెక్టివ్‌లు.. వీరంతా ఆటగాళ్లే. ఇలాంటి ఆటలు ఆడేందుకు వీరికి ‘ది ఎస్కేప్ హంట్ ఎక్స్‌పీరియన్స్ హైదరాబాద్’ లాంటి విచిత్రమైన వినోద వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎస్కేప్ హంట్ దాదాపు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమ్‌కి ఒకటి చొప్పున రూమ్స్ ఉన్నాయి.
వినోదం.. విశేషం
స్నేహితులు, కుటుంబాలతో కలిసి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ఈ గేమ్ సెంటర్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్, క్రిటికల్ థింకింగ్, అబ్జర్వేషన్ వంటి స్కిల్స్ పెరిగేందుకు ఇవి ఉపకరిస్తున్నాయని అంటున్నారు నిర్వాహకులు ఆదిత్య, సనా. ‘బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లలో పెరిగాను. ఆస్ట్రేలియా నుంచి కొన్నేళ్ల క్రితమే నగరానికి తిరిగి వచ్చాను. ఇక్కడ వినోద వేదికలున్నా మరిన్ని విశేషాలకు అవకాశం ఉందని అర్థమైంది. బ్యాంకాక్‌లో ఆడిన అనుభవమే ఇక్కడ ప్రారంభించేందుకు కారణమైంది. సిటీలో ఇదే ఫస్ట్ ఎస్కేప్ రూమ్ గేమ్. దేశంలోనే రెండోది. ఇందులో 60 నిమిషాల ఆట, 30 నిమిషాలు రిలాక్స్ అవడం ఉంటాయి. ఇక్కడ ఫైవ్‌స్టార్ లాంజ్‌లో అవసరమైన రీఫ్రెష్‌మెంట్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించి ఫొటోలు దిగేందుకు వీలుగా ఫొటో వాల్స్ ఉన్నాయ’ని చెప్పారు సనా.