సంచలనం.. ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’
♦ బాబు అవినీతిని బయటపెట్టిన పుస్తకం
♦ ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
హైదరాబాద్, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి ద్వారా రూ.1.34 లక్షల కోట్లు సంపాందించి, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బహిరంగంగానే కొనుగోలు చేస్తుండడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాధారాలతో సహా వివరించిన వైనాన్ని చూసి ఢిల్లీ రాజకీయ వర్గాలు నివ్వెరపోయాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష పార్టీ నేరుగా ఆరోపణలు చెయ్యడం, ప్రతి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సంఖ్యలతో సహా పుస్తక రూపంలో ప్రచురించి కేంద్ర మంత్రులకు, వివిధ పార్టీల జాతీయ నేతలకు అందించడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రచురించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం చంద్రబాబు అవినీతిపై సంధించిన ఒక బ్రహ్మాస్త్రం. గత 23 నెలల్లో చంద్రబాబు ఏయే ప్రాజెక్టుల్లో ఎంతెంత దోచుక్నునదీ, తన పార్టీ మనుషులకి, బినామీలకు ఎంతెంత దోచిపెట్టిందీ ఈ పుస్తకం పూర్తి సాక్ష్యాధారాలతో సహా వివరించింది. రాజధాని అభివృద్ధి పేరుతో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు, విద్యుత్ టెండర్లు, ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో భారీగా జరిగిన అవకతవకలు, ఆ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును ఈ పుస్తకం బహిర్గతం చేసింది.
రాజధాని ఎక్కడ రాబోతుందో ముందే తెలిసినా ఆ విషయాన్ని చంద్రబాబు తన బినామీలకే చెప్పడం, రాజధాని రాబోయే ప్రాంతం గురించి ‘మీడియా లీకుల’ద్వారా ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం, తద్వారా అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయేటట్లు చేయడాన్ని ఈ పుస్తకం సవివరంగా బయటపెట్టింది. తప్పుడు ప్రచారంతో దళితులను భయభ్రాంతులకు గురిచేసి, వారికి చెందిన అసైన్డ్ భూములు, లంక భూములను తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా తక్కువ ధరలకు కొనుగోలు చేశారో ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం కళ్లకు కట్టినట్లుగా చూపింది. అంతేకాకుండా రాజధానిలో బినామీలు కొనుగోలు చేసిన భూముల ధరలను రెట్టింపు చేసేందుకు జోనింగ్ విధానాన్ని తీసుకురావడం గురించి తెలియజేసింది. జోనింగ్ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వేలాది మంది రైతుల భూముల ధరలు పడిపోయేలా చేసి, వారి బతుకుల మీద ఏ విధంగా దెబ్బకొట్టారో ఈ పుస్తకం వెల్లడించింది.
చంద్రబాబు అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, విద్యుత్ టెండర్లు, ప్రాజెక్టుల ఖర్చును నింబంధనలకు విరుద్దంగా ఎన్నో రెట్లు పెంచి, రాష్ట్ర ఖజానాను ఆయన తనయుడు ఏ విధంగా కొల్లగొట్టారో ఈ పుస్తకం ప్రాజెక్టుల వారీగా వివరించింది. తమ పార్టీకి తగినంత మెజారిటీ ఉన్నా, రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.30 కోట్ల నుంచి 40 కోట్ల అవినీతి సొమ్మును ఆఫర్ చేసి చంద్రబాబు కొనుగోలు చెయ్యడాన్ని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ చర్చించింది. అభివృద్ధికి, నీతి నిజాయతీలకు మారు పేరునని చెప్పుకునే చంద్రబాబు చర్యలను విన్నప్పుడు అధికార బీజేపీ నుంచి, ప్రతిపక్ష సీపీఎం వరకూ అన్ని పార్టీల నేతలూ దిగ్భ్రాంతికి గురయ్యారు.