అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : అత్యధిక మొత్తాలకు వేలం పాట పాడి అగ్రిగోల్డ్ ఆస్తులు మూడింటిని దక్కించుకున్న వారి పేర్ల మీద ఉమ్మడి హైకోర్టు మంగళవారం వేలాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్ర మణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది.
వేలం పాట అనంతరం కృష్ణా జిల్లా సైదాపురం గ్రామంలోని 23.84 ఎకరాల భూమిని కె.ఎం.ఆర్ కన్‌స్ట్రక్షన్స్ రూ.11.20 కోట్లకు, మరో ఎకరా భూమిని రూ.60 లక్షలకు విశ్వనాథ నాయుడు అనే వ్యక్తి దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా నందలూరు గ్రామంలోని 33.57 ఎకరాల భూమిని నళినీకుమారి రూ.4.25 కోట్లకు సొంతం చేసుకున్నారు. హైకోర్టు ఈ 3 ఆస్తులకు వేలాన్ని సంబంధిత వ్యక్తుల పేర్లు మీద ఖరారు చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, విజయవాడలోని వాణిజ్య సంబంధిత ఆస్తుల వేలం బుధవారం నిర్వహించనున్నారు.