
ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం
రాష్ట్రానికి రూ.17,011 కోట్ల
‘కేంద్ర’ ప్రాజెక్టులు: దత్తాత్రేయ
హైదరాబాద్: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణలో నిర్వహించనున్న తొలి పర్యటనలో రాష్ట్రాభివృద్ధి కోసం రూ.17,011 కోట్ల విలువ చేసే వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పనులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం అని, రాష్ట్రాభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.5,250 కోట్ల వ్యయంతో రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. 12.7 మెట్రిక్ టన్నుల వార్షిక యూరియా ఉత్పత్తి చేయనున్న ఈ కర్మాగారం 2018-19లోగా నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. గ్యాస్ ఆధారంగా నడిచే ఈ కర్మాగారం కోసం విజయవాడలోని మల్లవరం నుంచి రామగుండం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని 2018లోగా పూర్తి చేస్తామన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ల నుంచి ఈ పరిశ్రమకు గ్యాస్ కేటాయింపులను కేంద్రం జరిపిందన్నారు.
అదే విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1,600(2‘800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.10,599 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్‌ను కేంద్రం తెలంగాణకు కేటాయించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1,161 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు రైల్వే రవాణా పరంగా అనుసంధానం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1,275 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉందన్నారు. వరంగల్‌కు మంజూరు చేసిన టెక్స్‌టైల్స్ పార్కు పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వం వల్లా జరగని ప్రయోజనం ప్రధాని మోదీ పర్యటన వల్ల రాష్ట్రానికి జరగబోతోందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, తాము మాత్రం ఈ ప్రాజెక్టులన్నింటినీ కట్టి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తికావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భూసేకరణ, కేంద్ర నిధుల వినియోగం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు.
మహా సమ్మేళనంపై మోదీ ఆరా
తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనం వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలసి పర్యటన వివరాలను తెలియజేయగా... పార్టీ కార్యకర్తల సమావేశంపై ప్రధాని ఆసక్తి చూపారన్నారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీకి నూతనోత్సాహం వస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.