ప్రభుత్వం గ్రేస్ పీరియడ్‌లో ఉంది
మీట్‌ది ప్రెస్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ‘‘గ్రేస్ పీరియడ్’’లో ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఈ మధ్య కాలాన్ని భరించినా వారిలో ఆందోళన పెరుగుతోందని, వారి సమస్యలను పరిష్కరించకపోతే అది పూర్తిస్థాయి అసంతృప్తిగా మారుతుందని చెప్పారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఆకర్షించడం వల్ల అసెంబ్లీలో మెజారిటీ లభిస్తుంది తప్ప దానితో ప్రజల హృదయాలను గెలుచుకోలేరని హితవు పలికారు.
శనివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘‘మీట్‌ది ప్రెస్’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు గతంలో కూడా ఉన్నాయని కొందరు మంత్రులు వాదించడం సరికాదన్నారు. రుణాల మాఫీ విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ తెలంగాణలో ప్రభావం చూపకపోవడంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సురవరం స్పందిస్తూ, ‘మాపార్టీకి ఓట్లు వేయని ప్రజలే చెప్పాలి’ అనడంతో నవ్వులు విరిశాయి.
విలీనం కాదు లెఫ్ట్ పునరైక్యత...
దేశంలోని వామపక్షాలు అన్నీ ఒకటిగా ఏర్పడాల్సి ఉందని, 1964లో కమ్యూనిస్టుపార్టీలో చీలిక ఏర్పడినప్పటి వాదనలు ఇప్పుడు అసంబద్ధమని సురవరం అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని తాము గతంలోనే ప్రతిపాదించినా, చీలిక కారణాలపై చర్చించాలని సీపీఎం నాయకులు ఏడాదిగా అంటున్నారని చెప్పారు.
కార్మిక హక్కులకు కేంద్రం తూట్లు పొడుస్తోంది: దాస్‌గుప్తా
కార్మిక సంఘాల ఏర్పాటును కఠినతరం చేసేలా కేంద్రం సంస్కరణలు తీసుకురాబోతుందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలకు పార్లమెంట్ సమావేశాలలో సవరణలు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉందన్నారు. వీటికి నిరసనగా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏఐటీయూసీ జాతీయసభల్లో పాల్గొన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.