అగ్రిగోల్డ్ కేసును ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో విచారిస్తాం
స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఇకపై ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే వారానికి రెండుసార్లు కూడా విచారణ చేపడతామని తెలిపింది. డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తమ ఆస్తులను డెవలప్‌మెంట్‌కు ఇచ్చి తద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు చెల్లిస్తామని అగ్రిగోల్డ్ ప్రతిపాదించిన నేపథ్యంలో.. తాకట్టు రహితంగా ఉన్న ఆస్తుల వివరాలు, వాటి విలువ, కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలు.. కొనుగోలుదారులు కోరుతున్న గడువు తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
దానిని పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన వెనుక అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉద్దేశాలను కూడా చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.