హైకోర్టు చెప్పినా వేధింపులా?
Published Mon, Aug 22 2016 10:53 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
పంజగుట్ట: గణేష్ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు హిందువుల హక్కని, ఇందుకు పోలీసుల అనుమతి అవసరం లేదని, కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు.
వినాయక ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, నిమజ్జనం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. నగరంలోని 150 డివిజన్లలోని మండప నిర్వాహకులను సమన్వయం చేస్తూ సమస్యలు పరిష్కరించేలా బీజేపీ ఐటీ సెల్ సభ్యురాలు మాధవి రూపొందించిన ‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్’ యాప్‌ను సోమవారం ఎర్రమంజిల్‌లోని ఎన్‌కెఎం గ్రాండ్‌లో ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు భగవత్‌రావు, శశిధర్, కరోడియల్, రామరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ... మొహంజాహీ మార్కెట్ వద్ద మెట్రోరైల్ వంతెన 27 అడుగుల ఎత్తు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నా పోలీసులు ఎత్తు తగ్గించుకోవాలని వేధిస్తున్నారన్నారు. విద్యుత్ పర్మిషన్లతో పోలీసులకు సంబంధం లేదన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement