రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి!
♦ మూడు నాలుగు రోజుల్లో నియామకం!
♦ తెరపైకి డాక్టర్ లక్ష్మణ్ పేరు
♦ ఆశావహుల్లో రామచందర్‌రావు, లక్ష్మీనారాయణ
♦ నేరుగా నియమించనున్న జాతీయ కమిటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర విభాగానికి కొత్త సారథిని నియమించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మూడు నాలుగు రోజుల్లో ఈ నియామకం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21లోగా దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా అధ్యక్షులను నియమించాలని... అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పార్టీకి కూడా కొత్త సారథిని పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. నాలుగు నెలల కిందే బీజేపీ రాష్ట్ర విభాగం సంస్థాగత ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్నా... వివిధ కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా జాతీయ స్థాయిలో పార్టీకి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు కోసం.. పార్టీ అధిష్టానం వెంటనే నేరుగా రాష్ట్ర కమిటీకి సారథిని నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీలో కీలక నేతలు, సీనియర్ల నుంచి అధిష్టానం నేతలు అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మూడు నాలుగు రోజుల్లో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు.
తెరపైకి లక్ష్మణ్ పేరు...
బీజేపీ రాష్ట్ర సారథిగా డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న లక్ష్మణ్.. చాలా సీనియర్, పార్టీకి విధేయుడు కావడంవల్ల జాతీయ నాయకత్వం ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీంతోపాటు రెండు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఇతర అవకాశాలు కల్పించడానికి కూడా ఇదే మార్గమని అధిష్టానం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోం ది. లక్ష్మణ్‌కు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని, కిషన్‌రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిని చేయాలనే ప్రతిపాదనను పరిశీలి స్తున్నట్లు పార్టీ ముఖ్యనేతల ద్వారా తెలిసింది.
అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ... ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతానని, కొత్త బాధ్యతలను నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ ముందు కు రాకుంటే.. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేరును జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయవాదిగా, వివిధ ఉద్యమాల్లో క్రియాశీల నేతగా, జిల్లాల్లోని క్షేత్రస్థాయి నేతలతో సంబంధాలు కలిగిన కొత్త ముఖంగా రామచందర్‌రావు పార్టీకి ఉపయోగపడతారనేది వారి భావన. రాష్ట్ర పార్టీలో రామచందర్‌రావుకు వ్యతిరేకులెవరూ లేకపోవడం అదనపు అర్హత. పార్టీలోని అన్నివర్గాలను సమన్వయం చేసుకుని పనిచేస్తారనే విశ్వాసం కూడా రాష్ట్రపార్టీలో ఉంది.
ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత యెండల లక్ష్మీనారాయణ పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ కూడా యెండల అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్టు కీలకనేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకుడిగా యెండల లక్ష్మీనారాయణకు పేరుంది. దీనితోపాటు హైదరాబాదేతర జిల్లాలకు చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కూడా లక్ష్మీనారాయణకు ప్రయోజనకరం అయ్యే అవకాశముంది. వీరితోపాటు నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావు వంటివారు కూడా రాష్ట్ర పార్టీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు.