బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు! | The police seized Rs .1.19 crore | Sakshi
Sakshi News home page

బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు!

Published Sat, Jun 18 2016 2:24 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు! - Sakshi

బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు!

- శివ, మరో ఇద్దరు అరెస్ట్..పరారీలో మరో నిందితుడు
- రూ.1.19 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
 
 సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని గోల్ఫ్ కోర్టులో మొదటి పూజ.. రూ.లక్షను రూ.2 లక్షలు చేసేశాడు.. బాబాపై మధుసూదన్‌రెడ్డికి నమ్మకం కుదిరింది.. ఆ నమ్మకాన్నే సొమ్ము చేసుకుందామనుకున్నాడు దొంగబాబా.. ‘డబుల్’ ఆశ చూపి ఏకంగా 1.33 కోట్లతో ఉడాయించాడు.. ఈ ఘరానా మోసానికి పాల్పడిన బురిడీ బాబా శివానందస్వామి అలియాస్ శివ 24 గంటల్లోనే బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. ఈ మోసంలో శివకు సహకరించిన మరో ఇద్దరిని పట్టుకున్నామని, ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి, అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బురిడీ బాబా మోసానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 1616 నాటి కాయిన్ ఉందంటూ..
 రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డికి తన స్నేహితుడు మోహన్‌రెడ్డి ద్వారా శివ పరిచయమయ్యాడు. వరంగల్, కరీంనగర్‌కు చెందిన రియల్టర్లు దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలు కూడా మోహన్ ద్వారా శివకు పరిచయమయ్యారు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను ఏడాదిన్నర క్రితం మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి కలిశారు. అక్కడ ఓ గోల్ఫ్ కోర్ట్‌లో ‘ప్రత్యేక లక్ష్మీ పూజ’ చేసిన శివ... మధుసూదన్‌రెడ్డి తీసుకువచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలుగా చేసి చూపాడు. ఇందుకు దక్షిణ మినహా అదనంగా పైసా కూడా తీసుకోకపోవడంతో మధుసూదన్‌రెడ్డికి బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇటీవల మధుసూదన్‌రెడ్డిని సంప్రదించిన శివ... తన వద్ద 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే ఇరిడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని నమ్మించాడు. ఈ కాయిన్‌తో పాటు డబ్బునూ రెట్టింపు చేయడం కోసం ఇంట్లో పూజ చేద్దామని చెప్పాడు. అందుకు బుధవారం ముహూర్తంగా నిర్ణయించిన శివ మంగళవారమే నగరానికి చేరుకొని ఓహిరీస్ హోటల్‌లో బస చేశాడు.

 డబ్బాలో నాణెం ఉందని నమ్మించి..
 పూజ సమయంలో రైస్‌పుల్లింగ్ కాయిన్ చూపించమని మధుసూదన్‌రెడ్డి శివను కోరాడు. పకడ్బందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించిన శివ.. కాయిన్ అందులోనే ఉందని నమ్మించి పూజలో పెట్టాడు. దాని విక్రయానికి సంబంధించి ఓ నకిలీ అగ్రిమెంట్ డాక్యుమెంట్‌ను చూపాడు. పూజయ్యే సమయానికీ శివస్వామి చెప్పినట్లు రూ.1.33 కోట్లు రూ.10 కోట్లు కాకపోవడంతో మధుసూదన్‌రెడ్డి కుటుంబంలో ఉత్కంఠ పెరిగింది. దీంతో ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’ పెట్టిన శివ.. కొన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలంటూ భార్యాభర్తల్ని వదిలి వారి కుమారుడిని తీసుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఓహిరీస్ హోటల్‌కు రావడం, నగదు ఉన్న బ్యాగ్‌ను తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చుకోవడం చేసేశాడు. ఆపై మధుసూదన్‌రెడ్డి కుమారుడిని ఏమార్చి తన ట్యాక్సీలో ఉడాయించాడు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలను జీవీకే మాల్ దగ్గరకు పిలిచి రూ.12 లక్షలు ఇచ్చాడు. అక్కడ్నుంచి తన ట్యాక్సీ వదిలి ఆటోలో ఆరామ్‌ఘర్ చౌరస్తాకు వెళ్లిన శివ.. బ్యాగులు కొని డబ్బు వాటిలో సర్దుకుని బస్సులో బెంగళూరు పారిపోయాడు.

 పూజలో పెట్టింది ఎంత?
 శివను విచారించిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి రూ.1.19 కోట్లు నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మోహన్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం పూజలో ఉంచింది రూ.1.33 కోట్లు కాగా.. శివ మాత్రం ఆ మొత్తం రూ.1.28 కోట్లని పోలీసులకు చెప్పాడు. తదుపరి విచారణలో పూర్తి నిజాలు తెలుస్తాయని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మధుసూదన్‌రెడ్డి అత్యాశే ఈ మోసానికి కారణంగా కనిపిస్తోందని, ఇతర వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు రూ.1.33 కోట్ల ఈ మోసం వెలుగుచూడగానే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల్ని సంప్రదించారు. ప్రస్తుతం తాము స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టుకు అప్పగిస్తామని, ఐటీ అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటారని కమిషనర్ తెలిపారు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిల నుంచి మరికొంత మొత్తం రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు.
 
 డబ్బుతో మూడు గుళ్లు తిప్పించాడు
 మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్‌రెడ్డి
 హైదరాబాద్: ఇంట్లో వాస్తుపూజ కోసమే శివానంద బాబాను తన తండ్రి పిలిపించారని లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్‌రెడ్డి తెలిపారు. అయితే వాస్తుపూజతోపాటు లక్ష్మీపూజ చేస్తే దోష నివారణతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయని బాబా చెప్పడంతో తన తండ్రి అంగీకరించారన్నారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంట్లో ఉన్న నగదు అంతా పూజలో పెడితే రెండింతలవుతుందని నమ్మించాడు. దీంతో డబ్బును బ్యాగులో సర్ది పూజలో దేవుడి ముందుంచారు. పూజ తర్వాత మత్తుమందు కలిపిన చక్కెర పొంగలి ఇచ్చాడు. దీంతో అమ్మానాన్న సృ్పహ కోల్పోయారు. అప్పుడే వచ్చిన నాకు కూడా ప్రసాదం ఇవ్వడంతో ఏం చేస్తున్నానో తెలియలేదు. పూజ తర్వాత డబ్బుతో మూడు ఆలయాలు తిప్పించాడు. హోటల్‌కు వెళ్లిన తర్వాత ధ్యానం చేయమని చెప్పి, అంతలోనే కిందకు వెళ్లి కారు లోంచి నగదు బ్యాగును అతడి కారులోకి పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పి కొద్ది దూరం వరకు నన్ను అనుసరించి ఆ తర్వాత మాయమయ్యాడు’’ అని వెల్లడించారు. తాను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, ఇలాంటివి ఒక్కోసారి నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు.
 
 హ్యారీపోటర్ పుస్తకాన్నీ వదల్లేదు
 తొలుత తనకు రూ.1.5 లక్షలు ఇస్తే పూజ తర్వాత ఆ మొత్తానికి మూడు నాలుగు రెట్లు ఇస్తానని దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలకు శివ చెప్పాడు. దీంతో వీరిద్దరూ హోటల్‌కు వెళ్లి ఆ మొత్తం అందించారు. మోహన్‌రెడ్డి కూడా హోటల్‌కు వచ్చి శివకు ఖర్చుల కోసం రూ.70 వేలు ఇచ్చి వెళ్లాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ... ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్ని ఉంచాడు. అదేమంటే మహిమలకు అతడు ప్రతీక అంటూ మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని నమ్మించాడు. పూజలో మధుసూదన్‌రెడ్డి తొలుత రూ.1.5 లక్షలు ఉంచగా.. కొద్దిసేపటికే చాకచక్యంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.1.5 లక్షలు జోడించి ‘రెట్టింపు’ చేశాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి రెండో దశ పూజలో ఏకంగా రూ.1.33 కోట్లు కుమ్మరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement