golf court
-
గోల్ఫ్ కోర్టులో కాల్పులు.. ముగ్గురి దుర్మరణం
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కెన్నెసాలోని పైన్‌ట్రీ కౌంట్రీ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్ సిల్లర్ అనే ఆటగాడితో పాటు మరో రెండు మృతదేహాలను కాబ్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 41 ఏళ్ల సిల్లర్ తలలో బుల్లెట్ దూసుకుపోయిందని.. దీంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి పాల్ పియర్సన్ అనే వ్యక్తితో పాటు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాళ్ల శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దుండగుడి కోసం ప్రస్తుతం తనీఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సిల్లర్ మృతిపట్ల గోల్ఫ్ అసోషియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు గోఫండ్‌మీ పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు. -
చారిత్రక స్థలాలు పరాధీనం?
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ పక్కనే ఉన్న నయాఖిల్లాలో ఉన్న చారిత్రక ప్రాధాన్యమున్న భూములను గోల్ఫ్‌కోర్సుకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గతంలో భారీ విస్తీర్ణంలో మొఘల్ గార్డెన్ తరహా నిర్మాణం ఉండేది. శతాబ్దాల క్రితమే అది భూమిలోకి కూరుకుపోయింది. దాన్ని సరిగ్గా 11 ఏళ్ల క్రితం గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి అద్భుత ఉద్యానవన నిర్మాణ ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని చుట్టూ ఇంకా మరో 16 ఎకరాల స్థలం ఉంది. అందులోనూ భూగర్భంలో నిర్మాణాలున్నాయి. ఇప్పుడు 14 ఎకరాల స్థలం మా త్రమే భారత పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో ఉంచి, మిగతాదాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ స్వాధీనం చేసుకోబోతోందని సమాచారం. ఆ ప్రాంతంలో చుట్టూ గోల్ఫ్ కోర్సు విస్తరించి ఉంది. మధ్య లో ఉన్న ఈ స్థలాన్ని కూడా తమకు అప్పగిస్తే గోల్ఫ్‌కోర్సును విస్తరిస్తామంటూ దాన్ని నిర్వాహక కమిటీ చాలాకాలంగా కోరుతోంది. ఖాళీగా ఉన్న 16 ఎకరాల్లో కొన్ని రోజులుగా శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఏఎస్ ఐ కందకాలు తవ్వుతోంది. భూగర్భంలో ఉన్న నిర్మాణ అవశేషాలను తెలుసుకుని, అంత ప్రాధాన్యమైనవి లేనట్టు తేలితే పరాధీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మీటరు నుంచి రెండు మీటర్ల మేర ఈ కందకాలను ప్రతి 30 అడుగుల నుంచి 60 అడుగులకొకటి చొప్పున తవ్వి చూస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో వెలుగు చూసిన భారీ ఉద్యానవనానికి సంబంధించి నీటి చానళ్లు, ఇతర అనుబంధ నిర్మాణాల అవశేషాలు వాటిల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ చానళ్లు వాడే అవసరం లేనందున, ఇతర నిర్మాణాల్లోనూ ముఖ్యమైనవి పెద్దగా లేవన్న ఉద్దేశంతో ఆ స్థలాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ, దానితో ఏఎస్ఐ ఒప్పందం చేసుకోనుందని విశ్వసనీయంగా తెలిసింది. దీనివల్ల గోల్ఫ్‌కోర్సు విస్తరణకు వీలుకలిగే అవకాశం ఉం టుంది. ఏఎస్ఐ రీజినల్ డైరెక్టర్ మహేశ్వరి ఇటీవలే అక్కడికి వచ్చి సర్వే చేసి వెళ్లారు. త్వరలో ఆమె నివేదిక ఇవ్వనున్నారు. క్రీ.శ.1600 పూర్వమే నిర్మాణం దేశంలో తాజ్‌మహల్, ఔరంగాబాద్‌లోని బీబీకా మఖ్బారా ముందు మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. పచ్చికబయళ్లు, ఫౌంటెన్లతో కూడిన ఆ ఉద్యానవనాలు అద్భుతంగా ఉంటాయి. వాటికంటే ముందే అంతకంటే గొప్పగా నయాఖిల్లా వద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. గోల్కొండ కోటకు అనుబంధంగా నయాఖిల్లా నిర్మాణం సమయంలో క్రీ.శ.1600 పూర్వమే ఈ వనం నిర్మించినట్టు హైదరాబాద్ స్టేట్‌లో పురావస్తు అధికారిగా పనిచేసిన గులాం యాజ్దానీ పరిశోధించి తేల్చారు. దాదాపు పదేళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో ఇవన్నీ వెలుగు చూశాయి. మధ్యలో కొంతకాలం పనులు నిలిపేసినా... గత నాలుగేళ్లుగా మళ్లీ జరుపుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏఎస్ఐ–పర్యాటకశాఖ మధ్య ఈ స్థలం విషయంలో ఒప్పందం జరిగింది. అలనాటి నిర్మాణ జాడలు లేని స్థలాన్ని పర్యాటకశాఖకు అప్పగించాలని, నిర్మాణాలుంటే అక్కడ ఎలాంటి కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయించారు. ఇప్పుడు కందకాలు తవ్వి పరిశీలిస్తుంటే 2 ఎకరాల మేర తప్ప నిర్మాణాలు విస్తరించి ఉన్నట్టు గుర్తించామని ఓ ఏఎస్ఐ అధికారి వ్యాఖ్యానించారు. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
ఫ్లోరిడా : రాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్ చిత్రాల్లో చూసుంటారు. అయితే పరిమాణంలో ఆ సైజులో కాకపోయినా.. కాస్త భయానకంగా ఉన్న మొసలి ఒకటి గోల్ఫ్ కోర్టులో చక్కర్లు కొట్టింది. ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోప్ గోల్ఫ్ మైదానంలో ఈ మధ్య బఫెల్లో క్రీక్ గోల్ఫ్ కోర్స్ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి ఒకతను తన మొబైల్ తో వీడియో తీయటం ఆరంభించాడు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. సుమారు పాతికేళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్’ అని పేరు పెట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటిదాకా అది ఎవరి మీద దాడి చేసిన సందర్భాలు లేవనే వారంటున్నారు. మైదానంలో అది ఠీవిగా వెళ్తుంటే.. పక్షులు దాని వెనకాలే వెళ్లటం ఆసక్తికరంగా ఉంది. ఫ్లోరిడాలో ఈ పరిణామంలో ఉన్న మొసలి ఇదేనని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
-
బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు!
- శివ, మరో ఇద్దరు అరెస్ట్..పరారీలో మరో నిందితుడు - రూ.1.19 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని గోల్ఫ్ కోర్టులో మొదటి పూజ.. రూ.లక్షను రూ.2 లక్షలు చేసేశాడు.. బాబాపై మధుసూదన్‌రెడ్డికి నమ్మకం కుదిరింది.. ఆ నమ్మకాన్నే సొమ్ము చేసుకుందామనుకున్నాడు దొంగబాబా.. ‘డబుల్’ ఆశ చూపి ఏకంగా 1.33 కోట్లతో ఉడాయించాడు.. ఈ ఘరానా మోసానికి పాల్పడిన బురిడీ బాబా శివానందస్వామి అలియాస్ శివ 24 గంటల్లోనే బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. ఈ మోసంలో శివకు సహకరించిన మరో ఇద్దరిని పట్టుకున్నామని, ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి, అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బురిడీ బాబా మోసానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1616 నాటి కాయిన్ ఉందంటూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డికి తన స్నేహితుడు మోహన్‌రెడ్డి ద్వారా శివ పరిచయమయ్యాడు. వరంగల్, కరీంనగర్‌కు చెందిన రియల్టర్లు దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలు కూడా మోహన్ ద్వారా శివకు పరిచయమయ్యారు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను ఏడాదిన్నర క్రితం మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి కలిశారు. అక్కడ ఓ గోల్ఫ్ కోర్ట్‌లో ‘ప్రత్యేక లక్ష్మీ పూజ’ చేసిన శివ... మధుసూదన్‌రెడ్డి తీసుకువచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలుగా చేసి చూపాడు. ఇందుకు దక్షిణ మినహా అదనంగా పైసా కూడా తీసుకోకపోవడంతో మధుసూదన్‌రెడ్డికి బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇటీవల మధుసూదన్‌రెడ్డిని సంప్రదించిన శివ... తన వద్ద 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే ఇరిడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని నమ్మించాడు. ఈ కాయిన్‌తో పాటు డబ్బునూ రెట్టింపు చేయడం కోసం ఇంట్లో పూజ చేద్దామని చెప్పాడు. అందుకు బుధవారం ముహూర్తంగా నిర్ణయించిన శివ మంగళవారమే నగరానికి చేరుకొని ఓహిరీస్ హోటల్లో బస చేశాడు. డబ్బాలో నాణెం ఉందని నమ్మించి.. పూజ సమయంలో రైస్‌పుల్లింగ్ కాయిన్ చూపించమని మధుసూదన్‌రెడ్డి శివను కోరాడు. పకడ్బందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించిన శివ.. కాయిన్ అందులోనే ఉందని నమ్మించి పూజలో పెట్టాడు. దాని విక్రయానికి సంబంధించి ఓ నకిలీ అగ్రిమెంట్ డాక్యుమెంట్‌ను చూపాడు. పూజయ్యే సమయానికీ శివస్వామి చెప్పినట్లు రూ.1.33 కోట్లు రూ.10 కోట్లు కాకపోవడంతో మధుసూదన్‌రెడ్డి కుటుంబంలో ఉత్కంఠ పెరిగింది. దీంతో ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’ పెట్టిన శివ.. కొన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలంటూ భార్యాభర్తల్ని వదిలి వారి కుమారుడిని తీసుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఓహిరీస్ హోటల్‌కు రావడం, నగదు ఉన్న బ్యాగ్‌ను తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చుకోవడం చేసేశాడు. ఆపై మధుసూదన్‌రెడ్డి కుమారుడిని ఏమార్చి తన ట్యాక్సీలో ఉడాయించాడు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలను జీవీకే మాల్ దగ్గరకు పిలిచి రూ.12 లక్షలు ఇచ్చాడు. అక్కడ్నుంచి తన ట్యాక్సీ వదిలి ఆటోలో ఆరామ్‌ఘర్ చౌరస్తాకు వెళ్లిన శివ.. బ్యాగులు కొని డబ్బు వాటిలో సర్దుకుని బస్సులో బెంగళూరు పారిపోయాడు. పూజలో పెట్టింది ఎంత? శివను విచారించిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి రూ.1.19 కోట్లు నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మోహన్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం పూజలో ఉంచింది రూ.1.33 కోట్లు కాగా.. శివ మాత్రం ఆ మొత్తం రూ.1.28 కోట్లని పోలీసులకు చెప్పాడు. తదుపరి విచారణలో పూర్తి నిజాలు తెలుస్తాయని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మధుసూదన్‌రెడ్డి అత్యాశే ఈ మోసానికి కారణంగా కనిపిస్తోందని, ఇతర వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు రూ.1.33 కోట్ల ఈ మోసం వెలుగుచూడగానే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల్ని సంప్రదించారు. ప్రస్తుతం తాము స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టుకు అప్పగిస్తామని, ఐటీ అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటారని కమిషనర్ తెలిపారు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిల నుంచి మరికొంత మొత్తం రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. డబ్బుతో మూడు గుళ్లు తిప్పించాడు మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్రెడ్డి హైదరాబాద్: ఇంట్లో వాస్తుపూజ కోసమే శివానంద బాబాను తన తండ్రి పిలిపించారని లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్రెడ్డి తెలిపారు. అయితే వాస్తుపూజతోపాటు లక్ష్మీపూజ చేస్తే దోష నివారణతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయని బాబా చెప్పడంతో తన తండ్రి అంగీకరించారన్నారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంట్లో ఉన్న నగదు అంతా పూజలో పెడితే రెండింతలవుతుందని నమ్మించాడు. దీంతో డబ్బును బ్యాగులో సర్ది పూజలో దేవుడి ముందుంచారు. పూజ తర్వాత మత్తుమందు కలిపిన చక్కెర పొంగలి ఇచ్చాడు. దీంతో అమ్మానాన్న సృ్పహ కోల్పోయారు. అప్పుడే వచ్చిన నాకు కూడా ప్రసాదం ఇవ్వడంతో ఏం చేస్తున్నానో తెలియలేదు. పూజ తర్వాత డబ్బుతో మూడు ఆలయాలు తిప్పించాడు. హోటల్‌కు వెళ్లిన తర్వాత ధ్యానం చేయమని చెప్పి, అంతలోనే కిందకు వెళ్లి కారు లోంచి నగదు బ్యాగును అతడి కారులోకి పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పి కొద్ది దూరం వరకు నన్ను అనుసరించి ఆ తర్వాత మాయమయ్యాడు’’ అని వెల్లడించారు. తాను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, ఇలాంటివి ఒక్కోసారి నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. హ్యారీపోటర్ పుస్తకాన్నీ వదల్లేదు తొలుత తనకు రూ.1.5 లక్షలు ఇస్తే పూజ తర్వాత ఆ మొత్తానికి మూడు నాలుగు రెట్లు ఇస్తానని దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలకు శివ చెప్పాడు. దీంతో వీరిద్దరూ హోటల్‌కు వెళ్లి ఆ మొత్తం అందించారు. మోహన్‌రెడ్డి కూడా హోటల్‌కు వచ్చి శివకు ఖర్చుల కోసం రూ.70 వేలు ఇచ్చి వెళ్లాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ... ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్ని ఉంచాడు. అదేమంటే మహిమలకు అతడు ప్రతీక అంటూ మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని నమ్మించాడు. పూజలో మధుసూదన్‌రెడ్డి తొలుత రూ.1.5 లక్షలు ఉంచగా.. కొద్దిసేపటికే చాకచక్యంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.1.5 లక్షలు జోడించి ‘రెట్టింపు’ చేశాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి రెండో దశ పూజలో ఏకంగా రూ.1.33 కోట్లు కుమ్మరించాడు. -
కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు
♦ గోల్ఫ్ కోర్టు, రిసార్టులు.. ♦ ద్వీపానికి వెళ్లేందుకు మూడు బ్రిడ్జిలు.. రోడ్డుకు ఇరువైపులా ఐకానిక్ టవర్లు సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీ ద్వీపం సమీపంలో ఉన్న మరో ద్వీపాన్ని అభివృద్ధి చేసి దాన్ని రాజధాని నగరానికి అనుసంధానం చేయనున్నారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలిచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ద్వీపం ఆధారంగా కొత్తగా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సీఆర్డీఏ వ్యూహరచన చేసింది. ఈ నెల 22న రాజధానికి శంకుస్థాపన చేసే ప్రాంగణం కూడా ఈ ద్వీపానికి అనుసంధానమైన రోడ్డుకు పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసే ఉద్ధండ్రాయునిపాలెం గ్రామానికి ఎదురుగా కృష్ణానదిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న ద్వీపం ఉంది. భవానీ ద్వీపానికి ఇది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నదిలో పలుచోట్ల ఉన్న చిన్న, చిన్న ద్వీపాల్లోని మట్టిని తెచ్చి దీన్ని ఇంకా పటిష్టం చేసి దీర్ఘచతురస్రాకారంలోకి మార్చుతారు. అలా ఈ ద్వీపాన్ని తయారు చేసి అందులోని 10-12 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్టు, ఫుడ్‌కోర్టులు, రిసార్టులు, హోటళ్లు నెలకొల్పాలని సంకల్పించారు. విజయవాడ వైపు నుంచి ఈ ద్వీపంలోకి వెళ్లేందుకు బోటు మార్గం, రాజధాని నుంచి బ్రిడ్జిల మీదుగా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్వీపం చుట్టూ ఆకర్షణీయమైన రిటెయినింగ్ వాల్‌ను నిర్మిస్తారు. ద్వీపం నుంచి బ్రిడ్జ్ కమ్ రోడ్డు ఈ ద్వీపం నుంచి రాజధాని వైపు కరకట్ట వరకూ మూడు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూపకల్పన చేశారు. ద్వీపం మధ్య భాగం నుంచి ఉద్ధండ్రాయునిపాలెం వరకూ బ్రిడ్జి, అక్కడి నుంచి రాజధాని డౌన్‌టౌన్ వరకూ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జి కమ్ రోడ్డు నాలుగు వరుసలుగా ఉంటుంది. ఈ బ్రిడ్జి రాజధానిలో ప్రవేశించే చోటే ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శంకుస్థాపన ప్రాంతాన్ని ఈ రోడ్డుకు జంక్షన్‌గా మార్చి దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ జంక్షన్‌కు కొంచెం అవతల రోడ్డుకిరువైపులా 25 నుంచి 40 అంతస్తుల ఐకానిక్ టవర్లు నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. ద్వీపం మధ్యభాగం నుంచి నిర్మించే బ్రిడ్జితోపాటు దానికి రెండువైపులా మరో రెండు బ్రిడ్జిలను కరకట్ట వరకూ నిర్మిస్తారు. అంటే ద్వీపం నుంచి రాజధాని ప్రాంతానికి మూడు బ్రిడ్జిలుంటాయి. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిలను నిర్మించే అవకాశం ఉంది. -
గోల్ఫ్‌కొండ అదిరింది!
ఎప్పుడూ కుక్కపిల్లలతో.. పిల్లికూనలతో.. ఉండే అమల అక్కినేని గోల్ఫ్ స్టిక్‌తో ఉందేంటబ్బా అనుకుంటున్నారా..! ఈ సీన్ వెనుక కూడా పరమార్థం ఆ మూగజీవాల శ్రేయస్సే ఉంది మరి. వన్యప్రాణి సంరక్షణకు పాటుపడుతున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్, గతి సంయుక్తంగా గోల్ఫ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం గోల్కొండ నయాఖిలాలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ప్రెస్‌మీట్‌కు అమల హాజరయ్యారు. అదే టైమ్‌లో ఆమె కాసేపు ఇలా గోల్ఫ్ ప్లేయర్ అవతారమెత్తారు. ఆదివారం జరగనున్న గోల్ఫ్ టోర్నమెంట్లో గోల్ఫర్ల కుటుంబసభ్యులు కూడా పాల్గొనవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛైర్మన్ అనిల్‌కుమార్ వి.ఈపూర్ అన్నారు. గోల్ఫర్ల పిల్లలకు పెయింటింగ్ పోటీలు, బర్డ్ వాచింగ్ సెషన్లు, వైల్డ్ లై ఫ్ ఫొటోగ్రఫి కం వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్‌కు హీరో రామ్‌చరణ్‌తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారన్నారు.