ఇక ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు
ఆ తర్వాత ఇతర కనెక్షన్లుకు విస్తరించే యోచన
మార్చి 31లోగా బిగించాలని ఆదేశాలు జారీ
ఇంట్లో కరెంటు పోయిందా.. రీచార్జ్ చేసుకోలేదేమో.. కరెంటుకు రీచార్జేంటి అనుకుంటున్నారా.. త్వరలో ఈ విధానం నగరంలో అమలుకాబోతోంది. మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా రీచార్జ్ చేసుకోవాలి భవిష్యత్తులో..
సిటీబ్యూరో: విద్యుత్ దుబారాను అరికట్టడంతో పాటు ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న మెకానికల్ విద్యుత్ మీటర్ల స్థానంలో ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీఓ కూడా జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వీధిలైట్లకు మినహా అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఈ మీటర్లను బిగించాలని సూచించింది. ఇందుకోసం ఇప్పటికే ఐదు వేల మీటర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ తరహా మీ టర్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు అమర్చడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో చోటు చేసుకుంటున్న విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా సంస్థకు వస్తున్న నష్టాలను కూడా నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు.
నగరంలో చాలామంది తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది విద్యుత్ వినియోగంపై ఆంక్ష లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటు యజమానులకు, అటు అద్దెవాసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ‘గ్రేటర్’ పరిధిలోనే సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రెండు వేలకుపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు అరకోటికిపైగా విద్యుత్ బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం తమకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదనే సాకుతో చాలా మంది అధికారులు తమ ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా డిస్కం రూ.కోట్లు నష ్టపోవాల్సి వస్తుంది.
ఇలా పనిచేస్తాయి...
ప్రస్తుతం ఉన్న పాత మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను (సెల్‌ఫోన్ రీచార్జ్ తరహా) అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. విని యోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్ ఫోన్ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జీ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఇందు కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ తరహా సేవలను వ ర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు.