పాలకులను పల్లె ప్రజలు క్షమించరు
♦ ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్
♦ అంగన్‌వాడీ వర్కర్స్ సదస్సులో పల్లె ప్రజల పరిస్థితిపై ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గత ఏడాది జరిగిన రైతు ఆత్మహత్యల వెనకున్న కారణాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నించడం లేదని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. గడచిన 30 ఏళ్లలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయితే ఆ సంఖ్యను తక్కువగా చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రైతు కూలీలుగా చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. కొందరు అధిక పెట్టుబడులు పెట్టి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుండగా, మరికొందరు హమాలీలుగా మారుతున్నారని సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘నేను ఒకసారి ముంబై నుంచి కొల్లాపూర్ వెళ్తుంటే మార్గమధ్యంలో ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. 37 అంతస్తుల మల్టీస్టోరీడ్‌బిల్డింగ్.. ప్రతీ ఒక్క ఫ్లోర్‌కి ప్రత్యేకంగా స్విమ్మింగ్‌పూల్ సౌకర్యం ఉంది అని పెద్ద పెద్ద అక్షరాలతో చక్కని బొమ్మలతో ఆకర్షణీయంగా ఉంది. ఆ హోర్డింగ్‌ను ఆనుకుని కొందరు పేదలు పెద్ద లైన్లలో బారులు తీరారు. దేనికోసం అంటే బకెటెడు నీళ్లకోసం.. ఎక్కడి నుంచో ట్యాంకర్లతో వస్తున్న నీళ్లను మనిషికి ఒక బకెట్ చొప్పున ఇస్తున్నారక్కడ. దానికోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు మహిళలు.
అక్కడికి అడుగుల దూరంలో ఒక్కో అంతస్తుకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉండడం ఏమిటి? ఇక్కడ బక్కెట్ నీటి కోసం కటకటలాడడం ఏమిటి? సరే ఆ బిల్డింగ్ కట్టుబడి చూద్దామని అక్కడి వెళితే అక్కడ కూలీలుగా పనిచేస్తున్న వారిలో అరవై శాతం మంది రైతులే అవడం మరో దౌర్భాగ్యం. ఈ పరిస్థితి ఒక్క ముంబై పరిసరాల్లోనే కాదు దేశంలో చాలాచోట్ల ఉంది. పట్టెడు అన్నంపెట్టే రైతు పరిస్థితి ఇలా ఉంటే.. పల్లెల ప్రగతికి అవకాశం ఎక్కడుంది’ అని ఆయన ప్రశ్నించారు. పల్లె ప్రజల్ని చిన్నచూపు చూసే ప్రభుత్వాలు ఉన్నంతవరకూ మన దేశంలో మార్పు అసాధ్యమని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్కలు మార్చేసి సరిపెట్టుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్, అంగన్‌వాడీ వర్కర్స్ ఆల్ ఇండియా అధ్యక్షురాలు నీలిమ, తెలంగా ణ అంగన్‌వాడీ వర్కర్ అధ్యక్షురాలు లక్ష్మి, జాయింట్ సెక్రటరీ భారతి, కోర్డినేటర్ సింధు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.