Palagummi sainath
-
సంక్షేమంపై ఖర్చు.. భవిష్యత్తు నిర్మాణమే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : పరిచయం అక్కర్లేని విఖ్యాత జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్! గ్రామీణ అంశాలపై ఎన్నో విస్తృత కథనాలు రాసిన అనుభవం ఆయనది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం నిర్మాణం, పేదలకు మెరుగైన ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ, మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేశారు. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇక ఆయనకు లభించిన గౌరవ డాక్టరేట్లకు కొదవే లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన పాలగుమ్మి సాయినాథ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సంక్షేమాన్ని అపహాస్యం చేసే వాళ్లు చరిత్రంతా కనపడతారు.. సంక్షేమంపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను అనుకూలం. సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన రాగానే ఒక వర్గం ఎగతాళిగా చూడటం, మాట్లాడటాన్ని చరిత్రలో చాలాసార్లు చూశాం. మీకొక ఉదాహరణ చెబుతా.. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీడియా కూడా అపహాస్యం చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇంకా చాలా పత్రికలు ఎంతో అపహాస్యం చేస్తూ వార్తలు ప్రచురించడం నాకు గుర్తుంది. టీచర్లను వంట మనుషులుగా చిత్రీకరించి కార్టూన్లు వేశాయి. తర్వాత ఏమైంది? నాలుగేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి తమిళనాడు గ్లోబల్ రోల్ మోడల్ అని యూనిసెఫ్ ప్రశంసించింది. దశాబ్దం తిరగక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే మేం మెరుగ్గా అమలు చేస్తున్నామని చాలా రాష్ట్రాలు ప్రకటించుకోవటాన్ని చూశాం. మన పిల్లలే అనే భావన పాలకులకు ఉండాలి.. సమాజంలో అసమానతలను కోవిడ్ సంక్షోభం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ద్రవ్యోల్బణం నమ్మశక్యం కాని రీతిలో పెరిగిపోతోంది. దేశంలో పేదల ఆకలిని మరింత పెంచే ప్రమాద కారకాలు ఇవి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయత్నం జరగడం సంతోషం. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. భోజనం చేసే పిల్లలంతా మన పిల్లలనే భావన పాలకులకు ఉండాలి. రోజుకొక గుడ్డు ఇస్తే పిల్లలకు పోషకాహారం అందడంతో పాటు పౌల్ట్రీ రంగం కూడా బాగుపడుతుంది. స్కూళ్లలో ఉదయాన్నే రాగి జావ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు.. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంలో ఎలా అపహాస్యానికి గురైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాపోతున్న వారికి కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రం.. ‘హ్యూమన్ డెవలప్మెంట్’లో రోల్ మోడల్‌గా నిలిచాక అర్థమవుతుంది. ‘అభివృద్ధి’ని ఎలా అర్థం చేసుకున్నారనే అంశం మీద మనం చేస్తున్న ఖర్చును నిర్వచించాల్సి ఉంటుంది. జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన సమయంలో ప్రజలు ఆకలి బాధతో అల్లాడిపోతే దాన్ని అభివృద్ధి అందామా? అది సంపన్నుల అభివృద్ధి మాత్రమే అవుతుంది. మన దృష్టి అంతా ప్రజలకు ఏది మంచి అనే విషయం మీదే ఉండాలి. అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు అభివృద్ధికి అర్థం ఉండదు. వర్క్‌ఫోర్స్ ఆరోగ్యంగా, గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలిగినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం. ఆకలిని రూపుమాపి.. ఆరోగ్యకరమైన జనాభా ఆకలిని రూపుమాపి ఆరోగ్యకరమైన జనాభాను నిర్మించడమే అభివృద్ధి. అది మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్మెంట్). ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనతో ఉండాలని భావించలేం. అభివృద్ధిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దృష్టి కోణం ఉంటుంది. నేను మానవాభివృద్ధినే చూస్తా. హ్యూమన్ క్యాపిటల్ మీద దృష్టి లేకుండా ఏ సమాజమూ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రగతి కనపరుస్తుందో 5 సంవత్సరాల తర్వాత చూడాలి. ఏపీ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం స్పందించాలి.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నదాతలకు అనుకూలమైన చాలా కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పుల దుష్ప్రభావం. మనం తక్షణం స్పందించి వినూత్న విధానాలను రూపొందించి అమలు చేయడం అత్యావశ్యకం. ఆంధ్రప్రదేశ్ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే అంశంపై అధ్యయన బాధ్యతను యూనివర్సిటీలకు అప్పజెప్పాలి. ఆయా ఆగ్రో ఎకోలాజికల్ జోన్స్‌లో పరిశోధనలు చేయాలని స్థానిక యూనివర్సిటీలను ప్రభుత్వం అడగాలి. శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకొని ‘క్లైమేట్ యాక్షన్ ప్లాన్’కు ప్రభుత్వం రూపకల్పన చేయాలి. బ్యూరోక్రసీ కంటే యూనివర్సిటీలే అధ్యయనం చేయగలవని నా నమ్మకం. విద్య, వైద్యం, సాగు.. బాగున్నాయి ♦ ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది. గ్రామాల్లో అవసరం ఉన్న ప్రతి కుంటుంబాన్ని వైద్యుడు సందర్శించడం బేసిక్ హ్యూమన్ రైట్ (మానవ హక్కుల) పరిరక్షణ కిందకే వస్తుంది. ప్రతి మనిషికి వైద్యం అందించడం మానవ హక్కుల పరిరక్షణే. ఈ కార్యక్రమం అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ♦ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేదలకు నేరుగా ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయడం సాధ్యమవుతుంది. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడినట్లే. ♦ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రైతులకు ఉపయోగపడతాయి. వాటి నిర్వహణను బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) కాకుండా రైతులకు అప్పగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ♦ సామాన్యులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ కార్యక్రమాలు వినూత్నం.. ముందడుగు వేసిన సీఎం జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జయతి ఘోష్ కమిటీని నియమించారు. రైతన్నలను ఆదుకునేందుకు వినూత్న, విభిన్న కార్యాచరణకు డాక్టర్ వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ వారసత్వాన్ని అందుకొని ముందడుగు వేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయట పడేయటానికి చాలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఆర్బీకేల ఏర్పాటు మొదలు రైతు భరోసా వరకు అన్ని కార్యక్రమాలు, çపథకాలు రైతులకు అనుకూలమైనవే. వాటిని మరింత కన్సాలిడేట్ చేయడం ప్రభుత్వం ముందున్న సవాల్. -
నేడు వ్యవసాయ మిషన్ సమావేశం
సాక్షి, అమరావతి/వెంకటాచలం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం వ్యవసాయ మిషన్ సమావేశం జరగనుంది. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కింద రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించడం, రబీ పంటల సాగు కార్యాచరణ, ధరల స్థిరీకరణపై సోమవారం వ్యవసాయ మిషన్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వ్యవసాయ మిషన్‌లోని నిపుణులు పాలగుమ్మి సాయినాథ్, స్వామినాథన్, రైతు సంఘాల నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, నేతలు విక్రమసింహపురి వర్సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. -
పాలకుల విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు: పాలగుమ్మి
హైదరాబాద్: పాలకుల విధానాల వల్లే దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ 3వ రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘‘వ్యవసాయ సంక్షోభం–శాస్త్రీయ పరిశీలన–రైతుల కోసం సైన్స్’’అనే అంశంపై జరిగిన సదస్సులో సాయినాథ్ పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు ఈ పదేళ్లలో 3.10 లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పార్లమెంట్లో వీటిపై ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అశాస్త్రీయ ఆలోచనలు పెంచే విధంగా ప్రధాని మోదీతో సహా కేంద్రంలోని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై అనేకసార్లు చర్చలు ప్రభుత్వాలు జరిపాయని, వ్యవసాయరంగంలోని కీలక సంస్కరణలకు సంబంధించి ఎమ్మెస్ స్వామినాథన్ అందజేసిన రెండు నివేదికలపై కనీస చర్చ జరపలేదని విమర్శించారు. మానవాభివృద్ది సూచికలో భారత్ 136వ స్థానంలో ఉండగా, శత కోటీశ్వరులున్న దేశాల సంఖ్యలో మాత్రం మన దేశం నాల్గవస్థానంలో నిలిచిందన్నారు. రైతుల్ని కూలీలుగా మార్చిన బహుళ జాతి కంపెనీలు దేశంలో వ్యవసాయ రంగం బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో చిక్కుకుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బడా కంపెనీలు హస్తగతం చేసుకోవటంతో రైతులే కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభంతో మిగతా రంగాలు కూడా దివాలా తీస్తాయన్నారు. వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ‘రైతుల కోసం దేశం’నినాదంతో వచ్చేనెల 23 నుంచి 30 వరకూ ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, కె.నాగేశ్వర్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మెహతాబ్ ఎస్ బామ్జీ, ఏఐపీఎస్ఎన్ ప్రధాన కార్యదర్శి పి.రాజమాణిక్యం, జేవీవీ ఏపీ అధ్యక్షుడు కె.త్రిమూర్తులు, తెలంగాణ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వార్తలకు చోటేదీ..?
► మీడియా రంగంలోకి కార్పొరేట్ల రాకతో రాబడి వార్తలకే ప్రాధాన్యం ►రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ ►హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వి.హనుమంతరావు స్మారకోపన్యాసం హైదరాబాద్: మీడియా రంగంలోకి కార్పొ రేట్ల ప్రవేశంతో ప్రధాన దినపత్రికలు, టెలివిజన్ చానళ్లలో గ్రామీణ, వ్యవసాయ వార్తలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గ్రామీణ భారతంపై మీడియా దృష్టి’ అంశంపై వి.హను మంతరావు స్మారక ఉపన్యాసం ఇచ్చారు. సాయి నాథ్ మాట్లాడుతూ, 2012–16 మధ్య కాలంలో ప్రధాన దినపత్రికల మొదటి పేజీలు, టీవీ చానళ్ల ప్రైమ్టైమ్లలో వ్యవసాయంపై కేవలం 0.18 శాతం, గ్రామాలకు సంబంధించి 0.61 శాతం మాత్రమే కవరేజీ లభించిందని చెప్పారు. కార్పొరేట్ మీడియా ప్రధానంగా రెవెన్యూ రాబడి ఉన్న వార్తలనే ప్రచురిస్తోందని ఆరోపించారు. ధ్వంసమవుతున్న ప్రజల జీవనం ఆధ్యాత్మిక పర్యాటకం పేరుతో సహజ నదుల ప్రవాహాలకు పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారని, ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారని సాయినా థ్ మండిపడ్డారు. గోదావరి నదీ పరివాహకం లోని సహజ వాగులు, వంకలు, చెరువులకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన నిర్మాణాల కారణంగా తొలిసారిగా మహరాష్ట్రలోని రామకుం డ పూర్తిగా ఎండి పోయిందన్నారు. ‘నాసిక్‌లో ద్రాక్ష తోటల పెంపకం బాగుంటుంది. ద్రాక్ష తోటలతో అక్కడి కూలీలకు ఏటా సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల పనిదినాలు దొరుకుతా యి. కాని జాతీయ కుంభమేళా కోసం ఆ ప్రాం తం నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడంతో ద్రాక్ష తోటల పెంపకంపై ప్రభావం పడి రైతులు, కూలీలు ఇబ్బందుల పాలయ్యారు’ అని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు (నగదు లేక) ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. నగదు లావాదేవీలను ఆపడం సాధ్యం కాదని గుర్తించిన కేంద్రం తిరిగి కొత్తనోట్లను మార్కెట్ లోకి విడుదల చేసిందని చెప్పారు. స్మారకో పన్యాసం అనంతరం సాయినాథ్‌ను ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాజంలో పెరిగిన అసమానతలు గత 20 ఏళ్లలో సమాజంలో అసమాన తలు బాగా పెరిగాయని సాయినాథ్ చెప్పారు. 1995 నుంచి ఇప్పటి వరకు 3.10 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకు న్నారని, ఆ సంఖ్యను తక్కువ చేసి చూపేం దుకు రైతు కాలమ్‌ను కౌలు రైతులు, వ్యవ సాయ కూలీలు, ఇతరులుగా నేషనల్ క్రైమ్ బ్యూరో విభజించిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా పశువుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతోందని, ఆవుల సంరక్షణ పేరుతో అల్ప సంఖ్యాక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం తెచ్చిన నూతన నిబంధనలు దళితు లకు పెనుభారంగా మారగా, ఇతర వెనుక బడిన తరగతులు, మహారాష్ట్రలో మరాఠాల జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసేవిగా ఉన్నా యని ఆరోపించారు. -
సాయినాథ్ తో స్పెషల్ ఇంటర్య్వూ
-
పాలకులను పల్లె ప్రజలు క్షమించరు
♦ ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ♦ అంగన్వాడీ వర్కర్స్ సదస్సులో పల్లె ప్రజల పరిస్థితిపై ఆవేదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గత ఏడాది జరిగిన రైతు ఆత్మహత్యల వెనకున్న కారణాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నించడం లేదని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. గడచిన 30 ఏళ్లలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయితే ఆ సంఖ్యను తక్కువగా చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రైతు కూలీలుగా చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ అఖిల భారత అంగన్వాడీ వర్కర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. కొందరు అధిక పెట్టుబడులు పెట్టి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుండగా, మరికొందరు హమాలీలుగా మారుతున్నారని సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను ఒకసారి ముంబై నుంచి కొల్లాపూర్ వెళ్తుంటే మార్గమధ్యంలో ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. 37 అంతస్తుల మల్టీస్టోరీడ్బిల్డింగ్.. ప్రతీ ఒక్క ఫ్లోర్‌కి ప్రత్యేకంగా స్విమ్మింగ్‌పూల్ సౌకర్యం ఉంది అని పెద్ద పెద్ద అక్షరాలతో చక్కని బొమ్మలతో ఆకర్షణీయంగా ఉంది. ఆ హోర్డింగ్‌ను ఆనుకుని కొందరు పేదలు పెద్ద లైన్లలో బారులు తీరారు. దేనికోసం అంటే బకెటెడు నీళ్లకోసం.. ఎక్కడి నుంచో ట్యాంకర్లతో వస్తున్న నీళ్లను మనిషికి ఒక బకెట్ చొప్పున ఇస్తున్నారక్కడ. దానికోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు మహిళలు. అక్కడికి అడుగుల దూరంలో ఒక్కో అంతస్తుకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉండడం ఏమిటి? ఇక్కడ బక్కెట్ నీటి కోసం కటకటలాడడం ఏమిటి? సరే ఆ బిల్డింగ్ కట్టుబడి చూద్దామని అక్కడి వెళితే అక్కడ కూలీలుగా పనిచేస్తున్న వారిలో అరవై శాతం మంది రైతులే అవడం మరో దౌర్భాగ్యం. ఈ పరిస్థితి ఒక్క ముంబై పరిసరాల్లోనే కాదు దేశంలో చాలాచోట్ల ఉంది. పట్టెడు అన్నంపెట్టే రైతు పరిస్థితి ఇలా ఉంటే.. పల్లెల ప్రగతికి అవకాశం ఎక్కడుంది’ అని ఆయన ప్రశ్నించారు. పల్లె ప్రజల్ని చిన్నచూపు చూసే ప్రభుత్వాలు ఉన్నంతవరకూ మన దేశంలో మార్పు అసాధ్యమని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్కలు మార్చేసి సరిపెట్టుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్, అంగన్వాడీ వర్కర్స్ ఆల్ ఇండియా అధ్యక్షురాలు నీలిమ, తెలంగా ణ అంగన్వాడీ వర్కర్ అధ్యక్షురాలు లక్ష్మి, జాయింట్ సెక్రటరీ భారతి, కోర్డినేటర్ సింధు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతే.. రాజు
* తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసిన బాబు * రైతాంగాన్ని గాలికి వదిలి... ప్రచారం కోసమే పాకులాట * వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలన్నీ కుదేలు * వైఎస్ అధికారంలోకి వచ్చాకే రైతు అనుకూల విధానాలు * అప్పట్నుంచే గాడిన పడిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు * ఆ ఐదేళ్లూ జాతీయ సగటు కన్నా అధిక వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం * గణాంకాల సాక్షిగా బాబు, వైఎస్, ఆ తర్వాతి పాలన తీరుతెన్నులివిగో... రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య.. 1.31 కోట్లు కౌలు రైతులు.. దాదాపు 50 లక్షలు రైతు కుటుంబాల మొత్తం ఓట్లు.. 4 కోట్ల పై చిలుకు ..వీరంతా ఇప్పుడు తమ ఓటు ఆయుధానికి పదును పెట్టుకుంటున్నారు ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి: ఆయనొస్తేనే బాగుంటుందండీ...అంటూ తమ అధినేత చంద్రబాబు గురించి ప్రకటనలు గుప్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. నిజంగా ఆయనొస్తే ఎలా ఉంటుంది? ఇది చెప్పటం కష్టమేమీ కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా ముందు తొమ్మిదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయనే కాబట్టి... ఆయనొస్తే ఆ పాలనే రిపీట్ అవుతుం దని తేలిగ్గా చెప్పొచ్చు. నాటి పరిస్థితి తెలిసిన వారికైతే బాబు గురించి బాగా తెలుసు. మరి తెలియని వారో..? ఇదిగో... ఆయన పాలనలో సాధించిన ‘వృద్ధి’ని, ‘ప్రగతి’ని లెక్కలతో సహా చూస్తే చాలు!! అమ్మో... ఆయనా? అని కళ్లు తేలవేయటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అంటే... అన్నపూర్ణ: ఇదెప్పుడంటే... రైతు చల్లగా ఉంటేనే. మరి రైతు చల్లగా ఉండాలంటే...? పంటలు బాగా పండి మంచి దిగుబడులు రావాలి. ఆ దిగుబడులకు కూడా మంచి రేటు రావాలి. రైతుకు గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు కావాలంటే... ముఖ్యంగా రైతు పంటపై పెట్టే వ్యయం తక్కువగా ఉండాలి. మరి అరకొర విత్తనాలు, ఒకవేళ దొరికినా నాసిరకం విత్తనాలు... అన్నీ కుదిరినా అధిక ధర. వీటికితోడు ఆకాశానికి ఎగసిన ఎరువుల ధరలు. ఇన్ని వ్యయప్రయాసల కోర్చి సేద్యం చేసినా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేదు. పంట చేతికొచ్చినా గిట్టుబాటు అవుతుందన్న నమ్మకం అసలే లేదు. ఇదంతా ఈ రాష్ట్రాన్ని కనీసం మూడు దశాబ్దాల పాటు వెనక్కు తీసుకెళ్లిపోయిన చంద్రబాబు హయాంలో రైతుల దుస్థితి. జలయజ్ఞం చేపట్టినా, బహుళజాతి సంస్థలతో పోరాడి మరీ విత్తనాల ధరలను నియంత్రించినా, రుణాలు మాఫీ చేసినా అదంతా వైఎస్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాకే. మళ్లీ 2009లో ఆయన మరణించాక పరిస్థితి యథాపూర్వంగా తయారయింది. రైతుల్ని పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఇవన్నీ ఎవరెవరో చెప్పినవి కావు. అంకెలు చెబుతున్న వాస్తవాలు. గణాంకాలు వెల్లడిస్తున్న పచ్చి నిజాలు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి దీనిపై వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి గణాంకాలను తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. ఆ తొమ్మిదేళ్లు... అంటే 1996-97 నుంచి 2003-04 వరకు బాబు జమానా. తర్వాత 2004 నుంచి 2008-09 వరకు ఐదేళ్లు వైఎస్సార్ హయాం. తర్వాత రోశయ్య, కిరణ్ పాలన... అంటే వైఎస్సార్ తర్వాతి కాలం. ఈ మూడు పాలనా కాలాల తులనాత్మక అధ్యయన వివరాలు... గుజరాత్‌కు దీటుగా జీడీపీ... బాబు హయాంలో రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 5.72 శాతం. కానీ వైఎస్సార్ హయాంలో అది ఏకంగా 9.56 శాతానికి ఎగబాకింది (2004-05 నిలకడ ధరల ఆధారంగా). తర్వాత 6.82 శాతానికి దిగజారింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఐదేళ్లు తీసుకున్నా అత్యధిక వృద్ధి రేటు నమోదైంది వైఎస్సార్ హయాంలోనే. ఈ సమయంలో దేశవ్యాప్త జాతీయ సగటు వృద్ధి 8.43 శాతమే. అందరూ ఆహా, ఓహో అనే మోడీ హయాంలోని గుజరాత్‌తో కూడా ఈ విషయంలో రాష్ట్రం సమానంగా పోటీ పడింది. - ఇక వస్తు సేవల ఉత్పత్తి ద్వారా బాబు హయాం మొత్తం మీదా కలిపి రూ.66,207 కోట్ల స్థూల ఆదాయం రాగా వైఎస్ ఐదేళ్ల పాలనలో అది ఏకంగా రూ.1,03,017 కోట్లుగా నమోదైంది (2004-05 నిలకడ ధరల ఆధారంగా). పంటలైనా... ఉద్యాన పంటలైనా వైఎస్సార్ హయాంలో పంటలే కాదు, ఉద్యాన పంటలూ గణనీయ పురోగతి సాధించాయి. వరి, జొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి ఆయన హయాంలో 10.51 శాతం వృద్ధిని నమోదు చేయగా, బాబు హయాంలో 0.09 శాతం, వైఎస్సార్ తరువాతి కాలంలో 1.74 శాతం వృద్ధి ఉండటం గమనార్హం. ఈ పెరుగుదలతో 2004-05లో కనీస ఉత్పత్తి 1.34 కోట్ల టన్నులు కాగా... 2008-09లో గరిష్ట ఉత్పత్తి 2.04 కోట్ల టన్నులకు చేరింది. బాబు హయాంలో గరిష్ట ఉత్పత్తి 1.6 కోట్ల టన్నులే. పోనీ ఒక్కో హెక్టారుకు ఉత్పత్తిని తీసుకున్నా 2008-09లో 2,744 కిలోలు. బాబు హయాంలో హెక్టారుకు 2,088 కిలోలు. వైఎస్సార్ అనంతరం 2,575 కిలోలే. ఉద్యాన పంటలకు వైఎస్సార్ చాలా ప్రాధాన్యమిచ్చారు. జలయజ్ఞం ఫలాలు ఈ పంటల్లో స్పష్టంగా కనిపించాయి. వైఎస్ హయాంలో ఐదేళ్లలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఏటా 77.2 వేల హెక్టార్లు. బాబు హయాంలో 66.14 వేల హెక్టార్లే. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో మొత్తం పంటల్లో ఉద్యాన పంటల శాతం 2003-04లో 12.91 శాతం నుంచి 2008-09 నాటికి 14.38 శాతానికి చేరింది. వాటి ఎగుమతులు ఏకంగా అరవై రెట్లు పెరిగాయి! 2002-03లో 6,098 మిలియన్ టన్నులుండగా 2008-09 నాటికి 3.81 లక్షల మిలియన్ టన్నులకు చేరాయి. హెక్టారుకు మామిడి- 7,088 కిలోలు, జీడి - 423 కిలోలు, అరటి 29,002 కిలోలు, టమాటా 14,045 కిలోల చొప్పున ఉత్పత్త్తి సాధ్యమైంది. భూ వనరుల వినియోగమూ 2001-03 మధ్య 122.23 లక్షల హెక్టార్ల నుం చి 100.44 లక్షల హెక్టార్లకు తగ్గితే 2006-09 మధ్య 105.9 లక్షల హెక్టార్ల నుంచి 134.03 ల క్షల హెక్టార్లకు పెరిగింది. ప్రధాన రంగాలన్నింటా ప్రగతి పరుగులే మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు 2004-2009 మధ్య అద్భుత పనితీరు కనబరిచాయి. వ్యవసాయ, సంబంధిత రంగాలు 6.14 శాతం; పరిశ్రమలు, సేవల రంగాలు 10.91, 10.61 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. బాబు హయాంలో ఈ మూడు రంగాలూ 3.84, 6.17, 7.14 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందగా... వైఎస్సార్ తరువాతి కాలంలో సైతం 2.56, 4.75, 9.41 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. ఇది వైఎస్ విధానాల వల్లేనని చెప్పటానికి ఇంకా ఏం కావాలి? తలసరి ఆదాయమూ పెరిగింది... స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రకారం తలసరి ఆదాయం చూసుకున్నా వైఎస్ హయాంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఇది 2003-04లో రూ.39,770 ఉండగా తర్వాతి ఐదేళ్లలో రూ.13,200 వరకూ పెరిగింది. బాబు పాలనలో (ఏడేళ్లలో) ఈ పెరుగుదల రూ.6,810 ఉండగా వైఎస్సార్ తరవాత ఇప్పటి వరకూ అది రూ.9,870 ఉంది. గ్రామాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వైఎస్సార్ ముందు గానీ, తరువాత గానీ 2 శాతం వరకూ ఉండగా వైఎస్సార్ కాలంలో 7 శాతం ఉండటం గణాంకాల సాక్షిగా వాస్తవం. సాగు లాభసాటేనని నిరూపించిన వైఎస్ వ్యవసాయ రంగం లాభసాటిగా లేదు గనుకే ఇతర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నానని బాబు తన హయాంలో బహిరంగంగానే ప్రకటించారు. కానీ సాగు లాభదాయమైనదేనని వైఎస్ తన విధానాల ద్వారా నిరూపించి చూపించారు. వ్యవసాయ రంగ తలసరి ఆదాయ సూచికే దీనికి నిదర్శనం. అది 2003-04లో రూ.7,890 ఉంటే 2008-09లో ఏకంగా రూ.10,683కి పెరిగింది. అంటే తలసరి ఆదాయం దాదాపు రూ.2,760 పెరిగింది. బాబు పాలన మొదట్లో, అంటే 1996-97లో రూ.7,194 ఉన్న వ్యవసాయ రంగ తలసరి ఆదాయం కాస్తా 2002-03 నాటికి రూ.6,687కు పడిపోయింది. అంటే రూ.507 క్షీణించిందన్నమాట! పైగా బాబు హయాంలో వ్యవసాయ తలసరి ఆదాయం నిలకడగా లేదు. కానీ వైఎస్ పాలనలో ఏటా క్రమం తప్పకుండా పెరుగుతూ వెళ్లింది. బాబు ‘ఐటీ’ గొప్పలు నేతి బీరే ప్రత్యేకించి వ్యవసాయ పంటల్లో వృద్ధి వైఎస్ కాలంలో 6.57 శాతం ఉండగా... అంతకుముందు అది 3.42, తరువాత కాలంలో 1.39 శాతం మాత్రమే నమోదైంది. ఈ మూడూ కూడా... ఆయా కాలాల్లో నమోదైన అత్యధిక వృద్ధి రేట్లు కావటం గమనార్హం. పోనీ ఆంధ్రప్రదేశ్ ఐటీ అంబాసిడర్‌గా, సీఈఓగా చెప్పుకున్న బాబు హయాంలో ఐటీ రంగమైనా బాగుందా అంటే... అది జాతీయ సగటు వృద్ధిరేటు కన్నా 0.81 శాతం తక్కువ నమోదు కావటం గమనార్హం. అంటే ఆ సమయంలో మనకన్నా ఇతర రాష్ట్రాలే ఐటీలో చక్కని వృద్ధి కనబరచినట్లు కాదా? మరి బాబు గొప్పేంటి? చాలామంది చెప్పేదేంటంటే బాబు హయాంలో కరవు తాండవించిందని... వైఎస్ హయాంలో మాత్రం చక్కని వర్షాలు పడ్డాయని. అందుకే వ్యవసాయ రంగంలో ఆ వృద్ధి సాధ్యమైందని చెబుతుంటారు. పోనీ... ఇది కొంతవరకు నిజమే అనుకుందాం. మరి అప్పుడు దేశమంతటా వర్షాలు బాగా పడ్డాయి. ఆ లెక్కన అప్పట్లో దేశమంతా వృద్ధి బాగుండాలి కదా!! అలాంటిది జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో 3.41 శాతం ఎక్కువ వృద్ధి నమోదైందంటే ఏమిటర్థం? వైఎస్ మరణానంతరం జాతీయ సగటు కన్నా ఈ వృద్ధి 2.32 శాతం తక్కువ నమోదైందంటే ఏమిటర్థం? వైఎస్ అనుసరించిన రైతు అనుకూల విధానాల వల్లే ఇది సాధ్యమైందని తెలియటం లేదా? మరోరకంగా చెప్పాలంటే వ్యవసాయ వృద్ధి వల్లే రాష్ట్రం మిగిలిన రంగాల్లోనూ జాతీయ సగటును దాటింది. ఎందుకంటే పేదరికాన్ని తగ్గించాలన్నా కూడా వ్యవసాయ వృద్ధే కీలకం. సమగ్రాభివృద్ధికి ఇది అత్యవసరం. వ్యవసాయ వృద్ధి లేకుండా మిగిలిన రంగాలు పరుగులు పెడితే... అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే ఆహార వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. ఇవీ.. వైఎస్సార్ తీసుకున్న చర్యలు విత్తనానికి వైభవం... 1970ల చివరి నుంచి 2006-07 వరకు రాష్ట్రంలో ప్రధాన విత్తన ఉత్పత్తి సంస్థ ఏపీ సీడ్సే. 95 నుంచి 100 శాతం విత్తనాలు ఇది ఉత్పత్తి చేసేవే. కానీ 2006-07 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ ఆయిల్ ఫెడ్, హాకా వంటివి సర్టిఫైడ్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. 2007-09 మధ్య 4 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేశాయి. 2001-04 మధ్య కేవలం 30 వేల క్వింటాళ్లుగా ఉన్న ఫౌండేషన్ సీడ్... 2008-09 నాటికి 1.7 లక్షల టన్నులకు చేరుకుందంటే ఈ చర్యల ఫలితమే. తరవాత అది లక్ష క్వింటాళ్లకు పడిపోయింది. సీడ్ విలేజ్ కార్యక్రమం కింద 50 శాతానికి పైగా ఫౌండేషన్ సీడ్‌ను 50 శాతం రాయితీతో సరఫరా చేయటం 2004-09 మధ్య గణనీయ ఉత్పత్తికి దారితీసింది. రాయితీపై విత్తన సరఫరా... 1998-99లో విత్తన సబ్సిడీపై వెచ్చించిన మొత్తం కేవలం 3 నుంచి 7 కోట్ల రూపాయలు. 2001-03 మధ్య ఇది 12 నుంచి 42 కోట్లకు పెరిగింది. కానీ 2004-09 మధ్య ఏకంగా రూ.60 కోట్ల నుంచి రూ. 298 కోట్లకు చేరుకుంది. తద్వారా అత్యధిక స్థాయిలో విత్తనాలు వైఎస్సార్ హయాంలో సబ్సిడీపై రైతులకు చేరాయి. గణనీయ స్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ... కరువు, వరదల వంటి సహజ విపత్తుల వల్ల రైతులు పంట నష్టపోతే అలా నష్టపోయిన ప్రాంతంలోని రైతులందరికీ తక్షణం మంజూరు చేసేదే ఇన్పుట్ సబ్సిడీ. గణాంకాలను చూస్తే... కరవు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన 2001-02, 2002-03లో రూ.7 కోట్లు, రూ.95 కోట్లు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. రాష్ట్రంలోని మండలాల్లో 85 నుంచి 90 శాతం వరకూ కరవు పీడిత మండలాలుగా ప్రకటించటం సమయంలో ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇది. వైఎస్ వచ్చాక 2004-09 మధ్య నాలుగైదేళ్ల పాటు కరవు పీడిత మండలాల సంఖ్య అతి స్వల్పంగా ఉన్నప్పటికీ ఇన్పుట్ సబ్సిడీకి మాత్రం రూ.175 కోట్ల నుంచి రూ.235 కోట్లు వెచ్చించారు. ఈ సమయంలో సగటున ప్రతి రైతుకు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,080 నుంచి 1,900 కాగా... 2003-04లో ఇచ్చింది మాత్రం రూ.350 కావటం గమనార్హం. నియంత్రణలో ఎరువుల ధరలు... అధికోత్పత్తి సాధించాలన్న పరుగులో రైతులు పురుగు మందుల వాడకాన్ని విపరీతంగా పెంచారు. దీనికి అధిక ఉత్పత్తినిచ్చే విత్తనాలు తోడయ్యాయి. ఫలితం... 1997-98లో 16.94 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల వాడకం 1999-2000 నాటికి 21.19 లక్ష ల టన్నులకు చేరింది. ధరల పెరుగుదల, కరవు వంటి కారణాలతో 2003-04 నాటికి మాత్రం 18.53 లక్షల టన్నులకు తగ్గింది. ఇదే సమయంలో ఎరువులపై సబ్సిడీని కేంద్రం తగ్గించటంతో వాటి ధరలు మరింత పెరిగి రైతుల కష్టాలు మరింత పెరిగాయి. రైతుల ఇన్పుట్ వ్యయంలో ఎరువులపై పెట్టే ఖర్చే 29 శాతానికి చేరింది. రాష్ట్రంలో యూరియా ధరలు 1996-97 నుంచి 2002-03 మధ్య ఏకంగా 70 శాతం పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు 18 శాతం, డీఏపీ, ఎంఓపీ ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. 2004-09 మధ్య ఎరువుల వినియోగం 30.7 లక్షల టన్నులకు చేరింది. చక్కని వర్షాలు, ప్రభుత్వ అనుకూల విధానాలు దీనికి కారణమయ్యాయి. పెపైచ్చు ఈ సమయంలో ఎరువుల ధరలు పెద్దగా పెరిగింది కూడా లేదు. కానీ 2008-09 తరవాత మళ్లీ ధరలు పెరిగాయి. మరోవంక 2001-02లో 3,850 టన్నులుగా ఉన్న రసాయన పురుగు మందుల వాడకం కూడా 2008-09 నాటికి 1,392 టన్నులకు తగ్గింది. సమగ్ర పెస్ట్ మేనేజిమెంట్ విధానాలు, జన్యుమార్పిడి పత్తికి పెద్ద ఎత్తున మళ్లటం వంటి రెండు అంశాలే ఈ తగ్గుదలకు కారణమయ్యాయని చెప్పవచ్చు. రైతు రాజ్యం.. అధికారంలోకి రాగానే వైఎస్సార్ పలు రైతు అనుకూల విధానాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మహత్యలు మానని గాయంలా మారిన నేపథ్యంలో... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, రూ.50వేల వరకు పంట రుణాల లిక్విడేషన్ ప్రకటించారు. కలెక్టరేట్లలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్, రూ.1,300 కోట్ల మేర విద్యుత్ బకాయిల మాఫీ, పంట రుణాలపై మారటోరియం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా నకిలీ విత్తనాలు, ఎరువుల, పురుగు మందుల స్వాధీనం వంటి చర్యలు రైతు కుటుంబాల్లో అంతులేని విశ్వాసాన్ని నింపాయి. నిజానికి సేద్యానికవుతున్న అత్యధిక వ్యయమే రాష్ట్ర రైతాంగంలోని నిసృ్పహకు ప్రధాన కారణం. విత్తులు, ఎరువులు, పురుగుమందుల వంటి ఇన్పుట్లు అత్యధిక వ్యయానికోర్చి కొనటంతో ఆ డబ్బు రాబట్టుకోవటానికి రైతాంగం ఎక్కువగా ఆహారేతర వాణిజ్య పంటలకే ప్రాధాన్యమిస్తున్నారు. సీఏసీపీ అధ్యయనం ప్రకారం 1990 తొలినాళ్ల నుంచీ విత్తనాల ధరలు పెరుగుతూనే వచ్చాయి. జయంతి కమిషన్‌తో పాటు క్షేత్రస్థాయి అధ్యయనాలు తేల్చిందే మిటంటే... 2000ల తొలినాళ్లలో రైతులు విత్తనాలకు సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొన్నారు. కావలసినంత స్థాయిలో నాణ్యమైన విత్తనాలు సరఫరా కాకపోవటం, ప్రైవేటు రంగంలోని అధిక రేట్లు... ఒక్కోసారి నకిలీ విత్తనాలివ్వటం వంటి చర్యల వల్ల దిగుబడులు తగ్గాయి. పంటలు రాని సందర్భాలూ ఉన్నాయి. 90ల చివర్లో, 2000 మొదట్లో గుంటూరులో 75 వేల ఎకరాలు, వరంగల్‌లో 40వేల ఎకరాల పంటలు ఇలా దెబ్బ తిన్నట్లు పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ దీనిపై నియమించిన నిజ నిర్ధారణ కమిటీ కూడా... నాసిరకం విత్తులే కొంప ముంచినట్లు తేల్చింది. దీనిపై ఎంఎన్‌సీలతో సహా పలు విత్తన కంపెనీలపై ఫిర్యాదులూ దాఖలయ్యాయి. నిజానికి ప్రభుత్వమంటూ ఉంటే క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది ఇప్పుడే. సకాలంలో సరైన ఇన్పుట్లు... అది కూడా అందుబాటు ధరలకే ఇవ్వాల్సిన తరుణమది. కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం విత్తన ఉత్పత్తి, సరఫరాలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలనే ఏకసూత్ర ఎజెండాతో వ్యవసాయ వర్సిటీకి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్‌కు విత్తన పరిశోధన, అభివృద్ధి నిమిత్తం తగు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. ఫలితంగా ఏపీ సీడ్ కార్పొరేషన్, ప్రభుత్వ విత్తన సంస్థలు కలిసి 2002-03లో కేవలం 3 లక్షల టన్నుల విత్తనాల్ని మాత్రమే ఉత్పత్తి చేయగలిగాయి. మొత్తం కావాల్సిన విత్తనాల్లో ఇవి కేవలం 5 నుంచి 6 శాతం. దీంతో పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ప్రభుత్వ రంగం నుంచి రాలేదు. ప్రైవేటు నుంచి కొనుగోలు చేసినా కూడా సర్టిఫైడ్ విత్తనాలు 9 నుంచి 12 శాతాన్ని దాటలేదు. 2001-03 మధ్య డిమాండ్-సరఫరాల మధ్య విపరీతమైన వ్యత్యాసం ఏర్పడింది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. రైతు అనుకూల విధానాల ఫలితంగా 2004-05లో ప్రభుత్వ సర్టిఫైడ్ విత్తనాలు 17 శాతానికి (8.95 లక్షల క్వింటాళ్లు) చేరాయి. 2008-09లో ఇవి రెట్టింపై 34 శాతానికి, 2009-10లో 43 శాతానికి (23.97 లక్షల క్వింటాళ్లు) చేరుకున్నాయి. ‘‘భారత ఎన్నికల చరిత్రలో బహుశా తొలిసారిగా ఒక నాయకునికి వ్యతిరేకంగా రైతులంతా ఒక్కతాటిపై నిలిచి ఓటేసిన సందర్భం ఇదొక్కటే’’ - 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయంపై రాజకీయ విశ్లేషకులు ‘‘ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కన్నా పెద్దదని ఇప్పటికైనా అంగీకరిస్తారనుకుంటా’’ - బాబు హయాంలో హైదరాబాద్ చుట్టూ తారు రోడ్లు, సాఫ్ట్వేర్, బహుళ అంతస్తుల భవనాలనే అభివృద్ధిగా కీర్తించిన మీడియా తీరుపై ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ సునిశిత విమర్శ. బాబును రెండెకరాల చిన్న రైతుగా పిలుచుకునే మీడియాకు... అలాంటి రెండెకరాల రైతుకు, ఆయన భార్యకు కేవలం తొమ్మిదేళ్లలో రూ.21 కోట్ల ఆస్తులెలా సమకూరాయా అన్న అనుమానం కనీసం బాబు అధికారికంగా తన ఆస్తుల అఫిడవిట్ సమర్పించినప్పుడైనా రాకపోవడం విడ్డూరం. -
ఆహార చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రముఖ పాత్రికేయుడు, మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ వ్యాఖ్యానించారు. విద్యాహక్కు చట్టం కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. రాజ్యాగం అందరికీ విద్య, ఆహార హక్కులను కల్పిస్తుండగా.. వాటి అర్థాలు మార్చేలా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ విలువలను తక్కువ చేయడమేనని మండిపడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆహార భద్రతా చట్టం కంటే ఉన్నతమైన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నందున చట్టం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ లేకపోగా, ఇస్తున్న ధాన్యాల్లో కూడా కోత పడుతోందని వివరించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సాయినాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో రైతులు వ్యవసాయ కూలీలు, కార్మికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ వ్యవసాయం, గిట్టుబాటు ధర లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు ఉత్తుత్తి వ్యవహారమని, దాని వల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండబోదన్నారు. దేశంలో బడా పరిశ్రమలు, సంస్థలకు రూ.5,30,000 కోట్లు పన్ను మినయింపు కల్పించిన కేంద్ర ప్రభుత్వం... నిధుల కొరత పేరుతో వ్యవసాయానికి కోత వేస్తోందని తప్పుపట్టారు. ఏటా రూ.90 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న ఆహార భద్రతా చట్టానికి ఈ నిధులు కేటాయిస్తే... ఐదున్నరేళ్ల పాటు దేశం మొత్తానికి ఆహారం అందజేయవచ్చని వివరించారు. వ్యవసాయ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రూ.33, పల్లెల్లో రూ.27 రోజు వారీ ఖర్చు చేయగలిగిన వారంతా పేదవారు కాదని ప్రకటించిన ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా దినసరి ఖర్చు రూ.25,000 అని, ఆయన చేసిన 42 విదేశీ పర్యటనలో 22సార్లు అమెరికా వెళ్లారని చెప్పారు. అసలు ప్రణాళికలే అమలు చేయని అమెరికాకు అన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలన్నారు. దేశంలోని వ్యవసాయ భూములన్నీ ధనిక వర్గాల వద్ద కేంద్రీకృతమవుతున్నాయని, భూ సంస్కరణల అమలు ఎక్కడా లేదని ఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్, ప్రముఖ సామాజికవేత్త ఉత్సా పట్నాయక్ పేర్కొన్నారు. దేశంలో భూ సంస్కరణలపై సామాజిక తనిఖీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సూచించారు. సదస్సులో ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్షుడు పాటూరి రామయ్య, కార్యదర్శి సునీత్ చోప్రా, తమిళనాడు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు లారెన్స్, ఏఐఏడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, త్రిపుర ఆహార, గ్రామీణ శాఖ మంత్రి భానులాల్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి: పాలగుమ్మి సాయినాధ్
సాక్షి, హైదరాబాద్: హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌పై కేసు పెట్టడం అప్రజాస్వామికమని ఆ పత్రిక గ్రామీణ వ్యవహారాల సంపాదకులు పాలగు మ్మి సాయినాధ్ పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. నగేష్‌పై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్న డీజీపీ దినేష్‌రెడ్డి తీరుకు నిరసనగా గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే నిర్వహించిన సత్యాగ్రహ కార్యక్రమంలో సాయినాథ్ మాట్లాడారు. ‘ఇది హిందూ పత్రికపై జరిగిన దాడి కాదు. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద, మీడియా హక్కుల మీద జరిగిన దాడి’ అని ఆయన అభివర్ణించారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఇక చట్టాన్ని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును కాపాడే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. డీజీపీపై చర్యలకు రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ అన్నారు. డీజీపీ దినేష్‌రెడ్డి కొద్దికాలం మాత్రమే పదవిలో ఉంటారని, అదిపోయిన తర్వాత మీడియా అంటే ఏమిటో ఆయనకు తెలిసి వస్తుందని ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. జర్నలిస్టులపై దాడులను ఐకమత్యంతో ఎదిరిద్దామని సాక్షి పొలిటికల్ బ్యూరో చీఫ్ కె.సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు సత్యాగ్రహం చేసుకునే అవకాశం కూడా లేకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్ విమర్శించారు. ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, సీనియర్ పాత్రికేయులు జి.ఎస్.వరదాచారి, ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.