మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రముఖ పాత్రికేయుడు, మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ వ్యాఖ్యానించారు. విద్యాహక్కు చట్టం కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. రాజ్యాగం అందరికీ విద్య, ఆహార హక్కులను కల్పిస్తుండగా.. వాటి అర్థాలు మార్చేలా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ విలువలను తక్కువ చేయడమేనని మండిపడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆహార భద్రతా చట్టం కంటే ఉన్నతమైన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నందున చట్టం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ లేకపోగా, ఇస్తున్న ధాన్యాల్లో కూడా కోత పడుతోందని వివరించారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సాయినాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో రైతులు వ్యవసాయ కూలీలు, కార్మికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ వ్యవసాయం, గిట్టుబాటు ధర లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు ఉత్తుత్తి వ్యవహారమని, దాని వల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండబోదన్నారు.
దేశంలో బడా పరిశ్రమలు, సంస్థలకు రూ.5,30,000 కోట్లు పన్ను మినయింపు కల్పించిన కేంద్ర ప్రభుత్వం... నిధుల కొరత పేరుతో వ్యవసాయానికి కోత వేస్తోందని తప్పుపట్టారు. ఏటా రూ.90 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న ఆహార భద్రతా చట్టానికి ఈ నిధులు కేటాయిస్తే... ఐదున్నరేళ్ల పాటు దేశం మొత్తానికి ఆహారం అందజేయవచ్చని వివరించారు. వ్యవసాయ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రూ.33, పల్లెల్లో రూ.27 రోజు వారీ ఖర్చు చేయగలిగిన వారంతా పేదవారు కాదని ప్రకటించిన ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా దినసరి ఖర్చు రూ.25,000 అని, ఆయన చేసిన 42 విదేశీ పర్యటనలో 22సార్లు అమెరికా వెళ్లారని చెప్పారు. అసలు ప్రణాళికలే అమలు చేయని అమెరికాకు అన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలన్నారు. దేశంలోని వ్యవసాయ భూములన్నీ ధనిక వర్గాల వద్ద కేంద్రీకృతమవుతున్నాయని, భూ సంస్కరణల అమలు ఎక్కడా లేదని ఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్, ప్రముఖ సామాజికవేత్త ఉత్సా పట్నాయక్ పేర్కొన్నారు. దేశంలో భూ సంస్కరణలపై సామాజిక తనిఖీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సూచించారు. సదస్సులో ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్షుడు పాటూరి రామయ్య, కార్యదర్శి సునీత్ చోప్రా, తమిళనాడు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు లారెన్స్, ఏఐఏడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, త్రిపుర ఆహార, గ్రామీణ శాఖ మంత్రి భానులాల్ సాహూ తదితరులు పాల్గొన్నారు.