పత్రికా స్వేచ్ఛపై దాడి: పాలగుమ్మి సాయినాధ్
సాక్షి, హైదరాబాద్: హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌పై కేసు పెట్టడం అప్రజాస్వామికమని ఆ పత్రిక గ్రామీణ వ్యవహారాల సంపాదకులు పాలగు మ్మి సాయినాధ్ పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. నగేష్‌పై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్న డీజీపీ దినేష్‌రెడ్డి తీరుకు నిరసనగా గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే నిర్వహించిన సత్యాగ్రహ కార్యక్రమంలో సాయినాథ్ మాట్లాడారు. ‘ఇది హిందూ పత్రికపై జరిగిన దాడి కాదు. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద, మీడియా హక్కుల మీద జరిగిన దాడి’ అని ఆయన అభివర్ణించారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఇక చట్టాన్ని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును కాపాడే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. డీజీపీపై చర్యలకు రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ అన్నారు.
డీజీపీ దినేష్‌రెడ్డి కొద్దికాలం మాత్రమే పదవిలో ఉంటారని, అదిపోయిన తర్వాత మీడియా అంటే ఏమిటో ఆయనకు తెలిసి వస్తుందని ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. జర్నలిస్టులపై దాడులను ఐకమత్యంతో ఎదిరిద్దామని సాక్షి పొలిటికల్ బ్యూరో చీఫ్ కె.సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు సత్యాగ్రహం చేసుకునే అవకాశం కూడా లేకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్ విమర్శించారు. ఎన్‌టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, సీనియర్ పాత్రికేయులు జి.ఎస్.వరదాచారి, ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.