
సమావేశంలో మాట్లాడుతున్న పాలగుమ్మి సాయినాథ్. చిత్రంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, చుక్కా రామయ్య
హైదరాబాద్: పాలకుల విధానాల వల్లే దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ 3వ రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘‘వ్యవసాయ సంక్షోభం–శాస్త్రీయ పరిశీలన–రైతుల కోసం సైన్స్’’అనే అంశంపై జరిగిన సదస్సులో సాయినాథ్ పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు ఈ పదేళ్లలో 3.10 లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పార్లమెంట్‌లో వీటిపై ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అశాస్త్రీయ ఆలోచనలు పెంచే విధంగా ప్రధాని మోదీతో సహా కేంద్రంలోని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై అనేకసార్లు చర్చలు ప్రభుత్వాలు జరిపాయని, వ్యవసాయరంగంలోని కీలక సంస్కరణలకు సంబంధించి ఎమ్మెస్ స్వామినాథన్ అందజేసిన రెండు నివేదికలపై కనీస చర్చ జరపలేదని విమర్శించారు. మానవాభివృద్ది సూచికలో భారత్ 136వ స్థానంలో ఉండగా, శత కోటీశ్వరులున్న దేశాల సంఖ్యలో మాత్రం మన దేశం నాల్గవస్థానంలో నిలిచిందన్నారు.
రైతుల్ని కూలీలుగా మార్చిన బహుళ జాతి కంపెనీలు
దేశంలో వ్యవసాయ రంగం బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో చిక్కుకుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బడా కంపెనీలు హస్తగతం చేసుకోవటంతో రైతులే కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభంతో మిగతా రంగాలు కూడా దివాలా తీస్తాయన్నారు. వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ‘రైతుల కోసం దేశం’నినాదంతో వచ్చేనెల 23 నుంచి 30 వరకూ ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, కె.నాగేశ్వర్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మెహతాబ్ ఎస్ బామ్జీ, ఏఐపీఎస్‌ఎన్ ప్రధాన కార్యదర్శి పి.రాజమాణిక్యం, జేవీవీ ఏపీ అధ్యక్షుడు కె.త్రిమూర్తులు, తెలంగాణ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment