(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : పరిచయం అక్కర్లేని విఖ్యాత జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్! గ్రామీణ అంశాలపై ఎన్నో విస్తృత కథనాలు రాసిన అనుభవం ఆయనది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం నిర్మాణం, పేదలకు మెరుగైన ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ, మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేశారు. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇక ఆయనకు లభించిన గౌరవ డాక్టరేట్లకు కొదవే లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన పాలగుమ్మి సాయినాథ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ..
సంక్షేమాన్ని అపహాస్యం చేసే వాళ్లు చరిత్రంతా కనపడతారు..
సంక్షేమంపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను అనుకూలం. సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన రాగానే ఒక వర్గం ఎగతాళిగా చూడటం, మాట్లాడటాన్ని చరిత్రలో చాలాసార్లు చూశాం. మీకొక ఉదాహరణ చెబుతా.. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీడియా కూడా అపహాస్యం చేసింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇంకా చాలా పత్రికలు ఎంతో అపహాస్యం చేస్తూ వార్తలు ప్రచురించడం నాకు గుర్తుంది. టీచర్లను వంట మనుషులుగా చిత్రీకరించి కార్టూన్లు వేశాయి. తర్వాత ఏమైంది? నాలుగేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి తమిళనాడు గ్లోబల్ రోల్ మోడల్ అని యూనిసెఫ్ ప్రశంసించింది. దశాబ్దం తిరగక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే మేం మెరుగ్గా అమలు చేస్తున్నామని చాలా రాష్ట్రాలు ప్రకటించుకోవటాన్ని చూశాం.
మన పిల్లలే అనే భావన పాలకులకు ఉండాలి..
సమాజంలో అసమానతలను కోవిడ్ సంక్షోభం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ద్రవ్యోల్బణం నమ్మశక్యం కాని రీతిలో పెరిగిపోతోంది. దేశంలో పేదల ఆకలిని మరింత పెంచే ప్రమాద కారకాలు ఇవి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయత్నం జరగడం సంతోషం. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. భోజనం చేసే పిల్లలంతా మన పిల్లలనే భావన పాలకులకు ఉండాలి. రోజుకొక గుడ్డు ఇస్తే పిల్లలకు పోషకాహారం అందడంతో పాటు పౌల్ట్రీ రంగం కూడా బాగుపడుతుంది. స్కూళ్లలో ఉదయాన్నే రాగి జావ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు..
మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంలో ఎలా అపహాస్యానికి గురైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాపోతున్న వారికి కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రం.. ‘హ్యూమన్ డెవలప్‌మెంట్’లో రోల్ మోడల్‌గా నిలిచాక అర్థమవుతుంది. ‘అభివృద్ధి’ని ఎలా అర్థం చేసుకున్నారనే అంశం మీద మనం చేస్తున్న ఖర్చును నిర్వచించాల్సి ఉంటుంది.
జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన సమయంలో ప్రజలు ఆకలి బాధతో అల్లాడిపోతే దాన్ని అభివృద్ధి అందామా? అది సంపన్నుల అభివృద్ధి మాత్రమే అవుతుంది. మన దృష్టి అంతా ప్రజలకు ఏది మంచి అనే విషయం మీదే ఉండాలి. అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు అభివృద్ధికి అర్థం ఉండదు. వర్క్‌ఫోర్స్ ఆరోగ్యంగా, గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలిగినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం.
ఆకలిని రూపుమాపి.. ఆరోగ్యకరమైన జనాభా
ఆకలిని రూపుమాపి ఆరోగ్యకరమైన జనాభాను నిర్మించడమే అభివృద్ధి. అది మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్‌మెంట్). ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనతో ఉండాలని భావించలేం. అభివృద్ధిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దృష్టి కోణం ఉంటుంది. నేను మానవాభివృద్ధినే చూస్తా. హ్యూమన్ క్యాపిటల్ మీద దృష్టి లేకుండా ఏ సమాజమూ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రగతి కనపరుస్తుందో 5 సంవత్సరాల తర్వాత చూడాలి.
ఏపీ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం స్పందించాలి..
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నదాతలకు అనుకూలమైన చాలా కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పుల దుష్ప్రభావం. మనం తక్షణం స్పందించి వినూత్న విధానాలను రూపొందించి అమలు చేయడం అత్యావశ్యకం. ఆంధ్రప్రదేశ్ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే అంశంపై అధ్యయన బాధ్యతను యూనివర్సిటీలకు అప్పజెప్పాలి. ఆయా ఆగ్రో ఎకోలాజికల్ జోన్స్‌లో పరిశోధనలు చేయాలని స్థానిక యూనివర్సిటీలను ప్రభుత్వం అడగాలి. శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకొని ‘క్లైమేట్ యాక్షన్ ప్లాన్’కు ప్రభుత్వం రూపకల్పన చేయాలి. బ్యూరోక్రసీ కంటే యూనివర్సిటీలే అధ్యయనం చేయగలవని
నా నమ్మకం.
విద్య, వైద్యం, సాగు.. బాగున్నాయి
♦ ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది. గ్రామాల్లో అవసరం ఉన్న ప్రతి కుంటుంబాన్ని వైద్యుడు సందర్శించడం బేసిక్ హ్యూమన్ రైట్ (మానవ హక్కుల) పరిరక్షణ కిందకే వస్తుంది. ప్రతి మనిషికి వైద్యం అందించడం మానవ హక్కుల పరిరక్షణే. ఈ కార్యక్రమం అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరం.
♦ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేదలకు నేరుగా ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయడం సాధ్యమవుతుంది. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడినట్లే.
♦ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రైతులకు ఉపయోగపడతాయి. వాటి నిర్వహణను బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) కాకుండా రైతులకు అప్పగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి.
♦ సామాన్యులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
వైఎస్సార్ కార్యక్రమాలు వినూత్నం.. ముందడుగు వేసిన సీఎం జగన్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జయతి ఘోష్ కమిటీని నియమించారు. రైతన్నలను ఆదుకునేందుకు వినూత్న, విభిన్న కార్యాచరణకు డాక్టర్ వైఎస్సార్ శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్ వారసత్వాన్ని అందుకొని ముందడుగు వేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయట పడేయటానికి చాలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఆర్బీకేల ఏర్పాటు మొదలు రైతు భరోసా వరకు అన్ని కార్యక్రమాలు, çపథకాలు రైతులకు అనుకూలమైనవే. వాటిని మరింత కన్సాలిడేట్ చేయడం ప్రభుత్వం ముందున్న సవాల్.
Comments
Please login to add a commentAdd a comment