raman magsaysay award
-
సంక్షేమంపై ఖర్చు.. భవిష్యత్తు నిర్మాణమే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : పరిచయం అక్కర్లేని విఖ్యాత జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్! గ్రామీణ అంశాలపై ఎన్నో విస్తృత కథనాలు రాసిన అనుభవం ఆయనది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం నిర్మాణం, పేదలకు మెరుగైన ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ, మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేశారు. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇక ఆయనకు లభించిన గౌరవ డాక్టరేట్లకు కొదవే లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన పాలగుమ్మి సాయినాథ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సంక్షేమాన్ని అపహాస్యం చేసే వాళ్లు చరిత్రంతా కనపడతారు.. సంక్షేమంపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను అనుకూలం. సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన రాగానే ఒక వర్గం ఎగతాళిగా చూడటం, మాట్లాడటాన్ని చరిత్రలో చాలాసార్లు చూశాం. మీకొక ఉదాహరణ చెబుతా.. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీడియా కూడా అపహాస్యం చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇంకా చాలా పత్రికలు ఎంతో అపహాస్యం చేస్తూ వార్తలు ప్రచురించడం నాకు గుర్తుంది. టీచర్లను వంట మనుషులుగా చిత్రీకరించి కార్టూన్లు వేశాయి. తర్వాత ఏమైంది? నాలుగేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి తమిళనాడు గ్లోబల్ రోల్ మోడల్ అని యూనిసెఫ్ ప్రశంసించింది. దశాబ్దం తిరగక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే మేం మెరుగ్గా అమలు చేస్తున్నామని చాలా రాష్ట్రాలు ప్రకటించుకోవటాన్ని చూశాం. మన పిల్లలే అనే భావన పాలకులకు ఉండాలి.. సమాజంలో అసమానతలను కోవిడ్ సంక్షోభం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ద్రవ్యోల్బణం నమ్మశక్యం కాని రీతిలో పెరిగిపోతోంది. దేశంలో పేదల ఆకలిని మరింత పెంచే ప్రమాద కారకాలు ఇవి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయత్నం జరగడం సంతోషం. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. భోజనం చేసే పిల్లలంతా మన పిల్లలనే భావన పాలకులకు ఉండాలి. రోజుకొక గుడ్డు ఇస్తే పిల్లలకు పోషకాహారం అందడంతో పాటు పౌల్ట్రీ రంగం కూడా బాగుపడుతుంది. స్కూళ్లలో ఉదయాన్నే రాగి జావ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు.. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంలో ఎలా అపహాస్యానికి గురైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాపోతున్న వారికి కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రం.. ‘హ్యూమన్ డెవలప్మెంట్’లో రోల్ మోడల్‌గా నిలిచాక అర్థమవుతుంది. ‘అభివృద్ధి’ని ఎలా అర్థం చేసుకున్నారనే అంశం మీద మనం చేస్తున్న ఖర్చును నిర్వచించాల్సి ఉంటుంది. జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన సమయంలో ప్రజలు ఆకలి బాధతో అల్లాడిపోతే దాన్ని అభివృద్ధి అందామా? అది సంపన్నుల అభివృద్ధి మాత్రమే అవుతుంది. మన దృష్టి అంతా ప్రజలకు ఏది మంచి అనే విషయం మీదే ఉండాలి. అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు అభివృద్ధికి అర్థం ఉండదు. వర్క్‌ఫోర్స్ ఆరోగ్యంగా, గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలిగినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం. ఆకలిని రూపుమాపి.. ఆరోగ్యకరమైన జనాభా ఆకలిని రూపుమాపి ఆరోగ్యకరమైన జనాభాను నిర్మించడమే అభివృద్ధి. అది మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్మెంట్). ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనతో ఉండాలని భావించలేం. అభివృద్ధిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దృష్టి కోణం ఉంటుంది. నేను మానవాభివృద్ధినే చూస్తా. హ్యూమన్ క్యాపిటల్ మీద దృష్టి లేకుండా ఏ సమాజమూ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రగతి కనపరుస్తుందో 5 సంవత్సరాల తర్వాత చూడాలి. ఏపీ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం స్పందించాలి.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నదాతలకు అనుకూలమైన చాలా కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పుల దుష్ప్రభావం. మనం తక్షణం స్పందించి వినూత్న విధానాలను రూపొందించి అమలు చేయడం అత్యావశ్యకం. ఆంధ్రప్రదేశ్ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే అంశంపై అధ్యయన బాధ్యతను యూనివర్సిటీలకు అప్పజెప్పాలి. ఆయా ఆగ్రో ఎకోలాజికల్ జోన్స్‌లో పరిశోధనలు చేయాలని స్థానిక యూనివర్సిటీలను ప్రభుత్వం అడగాలి. శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకొని ‘క్లైమేట్ యాక్షన్ ప్లాన్’కు ప్రభుత్వం రూపకల్పన చేయాలి. బ్యూరోక్రసీ కంటే యూనివర్సిటీలే అధ్యయనం చేయగలవని నా నమ్మకం. విద్య, వైద్యం, సాగు.. బాగున్నాయి ♦ ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది. గ్రామాల్లో అవసరం ఉన్న ప్రతి కుంటుంబాన్ని వైద్యుడు సందర్శించడం బేసిక్ హ్యూమన్ రైట్ (మానవ హక్కుల) పరిరక్షణ కిందకే వస్తుంది. ప్రతి మనిషికి వైద్యం అందించడం మానవ హక్కుల పరిరక్షణే. ఈ కార్యక్రమం అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ♦ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేదలకు నేరుగా ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయడం సాధ్యమవుతుంది. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడినట్లే. ♦ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రైతులకు ఉపయోగపడతాయి. వాటి నిర్వహణను బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) కాకుండా రైతులకు అప్పగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ♦ సామాన్యులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ కార్యక్రమాలు వినూత్నం.. ముందడుగు వేసిన సీఎం జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జయతి ఘోష్ కమిటీని నియమించారు. రైతన్నలను ఆదుకునేందుకు వినూత్న, విభిన్న కార్యాచరణకు డాక్టర్ వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ వారసత్వాన్ని అందుకొని ముందడుగు వేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయట పడేయటానికి చాలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఆర్బీకేల ఏర్పాటు మొదలు రైతు భరోసా వరకు అన్ని కార్యక్రమాలు, çపథకాలు రైతులకు అనుకూలమైనవే. వాటిని మరింత కన్సాలిడేట్ చేయడం ప్రభుత్వం ముందున్న సవాల్. -
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
మనీలా: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను వరించింది. 2019 ఏడాదికి గాను రవీష్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు రామన్ మెగసెసె ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. అలాగే భారత్దేశ టెలివిజన్ జర్నలిస్టుల్లో అత్యంత ప్రతిభావంతమైన వారిలో రవీశ్ ఒకరని కొనియాడింది. రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె–2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి రామన్ మెగసెసె అవార్డును ఆర్కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారు. రవీష్ ప్రస్థానం.. బిహార్‌లోని జిత్వార్పూర్ గ్రామం లో రవీశ్ జన్మించారు. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా 1996లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారని ఫౌండేషన్ పేర్కొంది. అనేక ఒత్తిడులు ఉండే మీడియా వాతావరణంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపింది. వాస్తవాల ఆధారిత రిపోర్టింగ్ పద్ధతులను ఆచరించేవారని, నైతికతతో తన వృత్తిని నిర్వహించేవారని వెల్లడించింది. -
ప్రాణత్యాగానికైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆయన్ను తీవ్రవాది అన్నారు.. అయినా పోరాటం ఆపలేదు. దేశద్రోహి అన్నారు.. కానీ న్యాయస్థానం నమ్మలేదు. అనుమానించారు.. అవమానించారు.. అడ్డగించారు.. అయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ఆయన.. సమానత కోసం అహర్నిశలు పోరాడే యోధుడు.. పారదర్శకత కోసం పాటుపడే ధీరుడు.. బెదిరింపులకు భయపడని శూరుడు.. అలాంటి వ్యక్తి ఇపుడు భావితరాల విద్య కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమంటున్నారు. ఆయనే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే..! దేశంలోని చిన్నారులకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యా హక్కు (ఆర్టీఈ) అమలు కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ తన పోరాటం కొనసాగుతుందని సందీప్‌పాండే స్పష్టంచేశారు. అందుకోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పాండే ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి: ఐఐటీలో చదువుకున్నవారంతా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నారు. మీరు మాత్రం అమెరికా వెళ్లి ఇక్కడికొచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు ఎందుకు? పాండే: చిన్నప్పటి నుంచి నేను గాంధేయవాదిని. ఆయన బాటలోనే నడవాలన్నది నా ఆశయం. దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు నేను సాగిస్తున్న ఈ పోరాటం గాంధీ స్ఫూర్తితో మొదలుపెట్టిందే. ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఆలోచన ఎపుడు వచ్చింది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉన్నపుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ సమయంలో గాంధీగారి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. నా మిత్రులు దీపక్‌గుప్తా, శ్రీవాస్తవతో చర్చించి.. ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సంస్థను అక్కడే రిజిస్టర్ చేయించాం. నా మిత్రుల్లో శ్రీవాస్తవ హైదరాబాదీనే! మీరు ఉద్యమబాట పట్టేటపుడు లక్ష్యం చాలా దూరమని, కష్టమని అనిపించలేదా? గాంధీజీ స్ఫూర్తితోనే పోరాటం మొదలుపెట్టాను. కష్టమైనా నష్టమైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. సమాచార హక్కు పోరాటం నేపథ్యం ఏంటి? దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు అవగాహన పెంచేందుకే 2008లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని నిర్వహించాం. మొదట్లో అందరూ అది సాధ్యం కాదన్నారు. కొందరు హేళన చేశారు. మరికొందరు ఇది జరిగే పనేనా అని పెదవి విరిచారు. అయినప్పటికీ అలుపెరుగని పోరాటంతో ముందుకే వెళ్లాం. 2002లో రామన్ మెగసెసె అవార్డు వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు? సంతోషమే, కానీ నేను కేవలం అవార్డు మాత్రమే తీసుకున్నాను. దాంతోపాటు వచ్చిన నగదును వెనక్కి ఇచ్చేశాను. అవార్డు మన కృషికి ఫలితమే అయినప్పటికీ, వాటితోనే సంతృప్తిపడితే అక్కడే ఆగిపోతాం. మీరు అమెరికాను ఉగ్రవాద దేశం అని ఎందుకు అనాల్సి వచ్చింది? నేను మనీలా (ఫిలిప్పీన్స్)లో రామన్ మెగసెసె అవార్డు తీసుకున్నపుడు ఇరాక్‌పై అమెరికా దాడికి దిగింది. ఈ చర్యను మానవతావాదిగా వ్యతిరేకించాను. అందులో భాగంగానే మనీలాలోని అమెరికా ఎంబసీ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నా. ‘అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్’అని నేను పలికిన పదాలు మరుసటిరోజు మీడియాలో కలకలం రేపాయి. ఈ భూమి మీద మొదట మానవ హక్కులకు రక్షణ ఉండాలి. మానవ హక్కులకు రక్షణ కల్పించలేని దేశాన్ని ఏమనాలో అప్పుడు నాకు తెలియలేదు. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ అధికారులు అంత తేలిగ్గా వదిలారా? లేదు.. (నవ్వుతూ) నాపై ప్రతి విమర్శలకు దిగారు. రామన్ మెగసెసె అవార్డుతోపాటు వచ్చిన 50వేల డాలర్లను వెనక్కి ఇవ్వాలని సవాల్ విసిరారు. వెంటనే ఆ చెక్కును అక్కడే ఇచ్చేసి కేవలం అవార్డుతో మాత్రమే ఇండియా వచ్చా. వాళ్లు అంతటితో వదిలారా? లేదు, అమెరికా వెళ్లినపుడు నేను ఉగ్రవాదినని, జాతిద్రోహి అంటూ అమెరికా ప్రభుత్వానికి నాపై కొందరు అతివాదులు ఫిర్యాదు చేశారు. దాంతో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం ఇమిగ్రేషన్‌లో రెండు గంటల పాటు నన్ను ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉండగా నా ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత వదిలేశారు. మీరెప్పుడూ ఖాదీ దుస్తులే ధరిస్తారు.. పైగా ఇస్త్రీ కూడా చేసుకోరు.. నాకు అలాగే ఇష్టం. ఖాదీ బట్టలు వేసుకోవడం వల్ల చేనేతపై ఆధారపడే వారికి ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్న తృప్తి నాకు దక్కుతుంది. మీరు పాలు తాగరని విన్నాం.. నిజమేనా? వాస్తవానికి ఏ పశువు పాలు అయినా... వాటి బిడ్డల కోసమే కదా! అందుకే, వాటి బిడ్డల కడుపులోకి పోవాల్సిన పాలు నా కడుపులో పోసుకోలేను. జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ నేను తీసుకోను. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి కోసం ఢిల్లీ నుంచి ముల్తాన్ వరకు శాంతియాత్ర చేశారు కదా! భయం వేయలేదా? నా యాత్ర 2005 మార్చి 23న ఢిల్లీలో మొదలైంది. వాఘా సరిహద్దు వరకు పాదయాత్రగానే సాగింది. కానీ పాకిస్తాన్లో పాదయాత్రకు ఆ దేశం అనుమతించలేదు. అందుకే మా యాత్రను వాహనంలోకి మార్చాం. ఆ యాత్రకు పాకిస్తానీలు చూపించిన స్పందనను ఎప్పటికీ మరిచిపోలేను. వారు వీధుల్లోకి వచ్చి స్వాగతం పలికారు. చాలామంది భారత్‌తో పాకిస్తాన్ స్నేహం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మిమ్మల్ని మావోయిస్టు అన్నపుడు ఎలా అనిపించింది? కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినంత మాత్రాన మావోయిస్టులంటే ఎలా? వాస్తవానికి మన దేశంలో ఇప్పటికీ పేద ప్రజల పక్షాన పోరాడుతోంది కమ్యూనిస్టులే కదా! మీపై జాతి వ్యతిరేకి అన్న ముద్ర కూడా పడింది కదా! ఆ సమయంలో నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో నా విద్యార్థులకు నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రదర్శిద్దామనుకున్నా. అంతలోనే నన్ను జాతి వ్యతిరేకి అని అరెస్టు చేసి కేసులు పెట్టారు. బీహెచ్‌యూలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్ను బలవంతంగా తొలగించారు. కానీ నా మీద మోపిన అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది! సాఫ్ట్ డ్రింక్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి కారణమేంటి? సాఫ్ట్ డ్రింక్‌ల పేరిట మన దేశంలో జలవనరుల దోపిడీ జరుగుతోంది. కోలా–పెప్సీ కంపెనీల తయారీ ప్లాంట్లు ఉన్నచోట భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారింది. ఎవరికీ ప్రయోజనం లేని డ్రింకుల కోసం దేశానికి అన్నంపెట్టే రైతుకు అన్యాయం చేయడం తగదు కదా! అందుకే, దానిపైనా ఉద్యమించా! విద్యా హక్కు చట్టం కోసం పోరాటం ఎంతవరకు వచ్చింది? మనదేశంలో 16 ఏళ్లలోపు ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది 8వ తరగతి వరకే చదువుతున్నారు. వీరిలో 25 శాతం బాల కార్మికులుగా ఉన్నారు. దేశాన్ని నిర్మించే రేపటి పౌరులకు విద్యను అందించడంలో నిర్లక్ష్యం తగదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఉచిత నిర్బంధ విద్యను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని విస్మరించాయి. ఆ చట్టం అమలు కోసం నిరాహారదీక్షచేయడానికి వెనుకాడను. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ గురించి మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాహక్కు చట్టం అమలు దారుణంగా ఉంది. ఇక్కడ విద్యావ్యవస్థను కార్పొరేట్ కల్చర్ శాసిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నిర్వహించడం దారుణం. వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీలైతే వారికి వివిధ ఎంట్రన్స్ టెస్టుల్లో ప్రభుత్వమే కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయా? ఎందుకు రావు? 2015, జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కార్పొరేట్ స్కూలులో పేద విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంతో ఆర్టీఈ అమలు కోసం ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ చట్టం అమలుకు అంగీకరించారు. ఆ సమయంలో నా దీక్షకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ–2009 చట్టం అమలుకు, కార్పొరేట్ విద్య అంతానికి.. కోచింగ్ సెంటర్లు మూయించాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. -
20 లక్షలు ఇస్తానంటే తీసుకోరేమిటి?
ఎయిమ్స్ తీరుపై ఓ వైద్యుడి ఆవేదన న్యూఢిల్లీ: నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పాలక యంత్రాంగం తలతిక్కగా వ్యవహరిస్తోందనడానికి మాజీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ), ప్రస్తుత ఎయిమ్స్ డిప్యూటీ కార్యదర్శి సంజయ్ చతుర్వేది విషయమే ఉదాహరణ. ఆయన ఉత్తమ వైద్య సేవలను గుర్తించి ఆయనకు రామన్ మెగసెసె అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డు కింద తనకు వచ్చిన దాదాపు రూ. 20 లక్షలను పేదల వైద్యం కోసం ఆయన తాను పనిచేస్తున్న ఎయిమ్స్‌కే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పాలకవర్గానికి తెలియజేసి, లిఖితపూర్వక అప్పీల్ కూడా చేశారు. ఇప్పటికే ఆయన్ను 12 సార్లు బదిలీచేసి వేధించిన ఉన్నతాధికారులు ఆఖరికి డబ్బులు తీసుకోవడానికి కూడా వేధిస్తున్నారు! నిబద్ధతతో వ్యవహరిస్తూ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నందుకే ఆయనను ఉన్నతాధికారులు చీఫ్ విజిలెన్స్ అధికారి పదవి తొలగించారు. ఆ తర్వాత అంత ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేశారు. తనకు మెగసెసె అవార్డు కింద వచ్చిన రూ. 20 లక్షల చెక్కును పేదల వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఖాతాలో జమచేయాల్సిందిగా సెప్టెంబర్ 21వ తేదీన ఎయిమ్స్ డైరెక్టర్‌ను సంజయ్ చతుర్వేది కోరారు. ఆస్పత్రి పాలక యంత్రాంగం ఏవో కుంటిసాకులు చెబుతూ ఇప్పటివరకు ఆ చెక్కును డిపాజిట్ చేయలేదు. గత రెండు నెలలుగా ఆ చెక్కు అలా వృధాగానే పడి ఉంది. మరో నెలరోజులు గడిస్తే చెక్కు కాలపరిమితి కూడా ముగిసిపోతుంది. ఈ విషయంలో తనకు కూడా విసుగు వచ్చిందని, ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి నిధికి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నానని సంజయ్ సోమవారం మీడియాకు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరు విరాళాలు ఇచ్చినా వెంటనే ఎయిమ్స్ ఖాతాలో డిపాజిట్‌చేసే పాలకమండలి ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న తాను ఇచ్చిన చెక్కు విషయంలో ఇలా వ్యవహరిస్తోందని, ఇది కూడా వేధింపులో భాగమేనని భావిస్తున్నానని ఆయన అన్నారు. తాను ఈ పరిస్థితినంతా వివరిస్తూ గత శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశానని, చెక్కును అందజేయడానికి ఆయన అపాయింట్మెంట్ను కూడా కోరానని తెలిపారు. ఈ విషయమై ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ వి. శ్రీనివాస్‌ను వివరణ కోరగా, సంజయ్ ప్రతిపాదనను తాము ఆరోగ్య శాఖ పరిశీలనకు పంపించామని, వారు 'రాష్ట్రీయ ఆరోగ్య నిధి' కింద డిపాజిట్ చేయాలని సూచనలు పంపారని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు చెక్కును డిపాజిట్ చేయలేక పోయామని వివరణ ఇచ్చారు. మళ్లీ ఇదే విషయమై సంజయ్‌ని మీడియా ప్రశ్నించగా, అర్థం పర్థం లేని సాకులతో డబ్బు డిపాజిట్‌ను ఆపడమేమిటని, అసలు ఆరోగ్యశాఖ పరిశీలనకు పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.