ప్రాణత్యాగానికైనా సిద్ధం | Sakshi special interview with sandeep pandey | Sakshi
Sakshi News home page

ప్రాణత్యాగానికైనా సిద్ధం

Published Sun, Jul 29 2018 12:50 AM | Last Updated on Sun, Jul 29 2018 12:50 AM

Sakshi special interview with sandeep pandey

సందీప్‌పాండే

సాక్షి, హైదరాబాద్‌: ఆయన్ను తీవ్రవాది అన్నారు.. అయినా పోరాటం ఆపలేదు. దేశద్రోహి అన్నారు.. కానీ న్యాయస్థానం నమ్మలేదు. అనుమానించారు.. అవమానించారు.. అడ్డగించారు.. అయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ఆయన.. సమానత కోసం అహర్నిశలు పోరాడే యోధుడు.. పారదర్శకత కోసం పాటుపడే ధీరుడు.. బెదిరింపులకు భయపడని శూరుడు.. అలాంటి వ్యక్తి ఇపుడు భావితరాల విద్య కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమంటున్నారు. ఆయనే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే..!

దేశంలోని చిన్నారులకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యా హక్కు (ఆర్టీఈ) అమలు కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ తన పోరాటం కొనసాగుతుందని సందీప్‌పాండే స్పష్టంచేశారు. అందుకోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పాండే ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

సాక్షి: ఐఐటీలో చదువుకున్నవారంతా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నారు. మీరు మాత్రం అమెరికా వెళ్లి ఇక్కడికొచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు ఎందుకు?
పాండే: చిన్నప్పటి నుంచి నేను గాంధేయవాదిని. ఆయన బాటలోనే నడవాలన్నది నా ఆశయం. దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు నేను సాగిస్తున్న ఈ పోరాటం గాంధీ స్ఫూర్తితో మొదలుపెట్టిందే.

ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఆలోచన ఎపుడు వచ్చింది?
యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉన్నపుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ సమయంలో గాంధీగారి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. నా మిత్రులు దీపక్‌గుప్తా, శ్రీవాస్తవతో చర్చించి.. ఆశా ఫర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థను అక్కడే రిజిస్టర్‌ చేయించాం. నా మిత్రుల్లో శ్రీవాస్తవ హైదరాబాదీనే!

మీరు ఉద్యమబాట పట్టేటపుడు లక్ష్యం చాలా దూరమని, కష్టమని అనిపించలేదా?
గాంధీజీ స్ఫూర్తితోనే పోరాటం మొదలుపెట్టాను. కష్టమైనా నష్టమైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

సమాచార హక్కు పోరాటం నేపథ్యం ఏంటి?
దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు అవగాహన పెంచేందుకే 2008లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని నిర్వహించాం. మొదట్లో అందరూ అది సాధ్యం కాదన్నారు. కొందరు హేళన చేశారు. మరికొందరు ఇది జరిగే పనేనా అని పెదవి విరిచారు. అయినప్పటికీ అలుపెరుగని పోరాటంతో ముందుకే వెళ్లాం.

2002లో రామన్‌ మెగసెసె అవార్డు వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు?
సంతోషమే, కానీ నేను కేవలం అవార్డు మాత్రమే తీసుకున్నాను. దాంతోపాటు వచ్చిన నగదును వెనక్కి ఇచ్చేశాను. అవార్డు మన కృషికి ఫలితమే అయినప్పటికీ, వాటితోనే సంతృప్తిపడితే అక్కడే ఆగిపోతాం.  

మీరు అమెరికాను ఉగ్రవాద దేశం అని ఎందుకు అనాల్సి వచ్చింది?
నేను మనీలా (ఫిలిప్పీన్స్‌)లో రామన్‌ మెగసెసె అవార్డు తీసుకున్నపుడు ఇరాక్‌పై అమెరికా దాడికి దిగింది. ఈ చర్యను మానవతావాదిగా వ్యతిరేకించాను. అందులో భాగంగానే మనీలాలోని అమెరికా ఎంబసీ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నా. ‘అమెరికా ఈజ్‌ ద బిగ్గెస్ట్‌ టెర్రరిస్ట్‌ కంట్రీ ఇన్‌ ద వరల్డ్‌’అని నేను పలికిన పదాలు మరుసటిరోజు మీడియాలో కలకలం రేపాయి. ఈ భూమి మీద మొదట మానవ హక్కులకు రక్షణ ఉండాలి. మానవ హక్కులకు రక్షణ కల్పించలేని దేశాన్ని ఏమనాలో అప్పుడు నాకు తెలియలేదు.

ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ అధికారులు అంత తేలిగ్గా వదిలారా?
లేదు.. (నవ్వుతూ) నాపై ప్రతి విమర్శలకు దిగారు. రామన్‌ మెగసెసె అవార్డుతోపాటు వచ్చిన 50వేల డాలర్లను వెనక్కి ఇవ్వాలని సవాల్‌ విసిరారు. వెంటనే ఆ చెక్కును అక్కడే ఇచ్చేసి కేవలం అవార్డుతో మాత్రమే ఇండియా వచ్చా.

వాళ్లు అంతటితో వదిలారా?
లేదు, అమెరికా వెళ్లినపుడు నేను ఉగ్రవాదినని, జాతిద్రోహి అంటూ అమెరికా ప్రభుత్వానికి నాపై కొందరు అతివాదులు ఫిర్యాదు చేశారు. దాంతో శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం ఇమిగ్రేషన్‌లో రెండు గంటల పాటు నన్ను ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉండగా నా ట్రాక్‌ రికార్డును పరిశీలించిన తర్వాత వదిలేశారు.  

మీరెప్పుడూ ఖాదీ దుస్తులే ధరిస్తారు.. పైగా ఇస్త్రీ కూడా చేసుకోరు..
నాకు అలాగే ఇష్టం. ఖాదీ బట్టలు వేసుకోవడం వల్ల చేనేతపై ఆధారపడే వారికి ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్న తృప్తి నాకు దక్కుతుంది.

మీరు పాలు తాగరని విన్నాం.. నిజమేనా?
వాస్తవానికి ఏ పశువు పాలు అయినా... వాటి బిడ్డల కోసమే కదా! అందుకే, వాటి బిడ్డల కడుపులోకి పోవాల్సిన పాలు నా కడుపులో పోసుకోలేను. జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ నేను తీసుకోను.

భారత్, పాకిస్తాన్‌ మధ్య శాంతి కోసం ఢిల్లీ నుంచి ముల్తాన్‌ వరకు శాంతియాత్ర చేశారు కదా! భయం వేయలేదా?
నా యాత్ర 2005 మార్చి 23న ఢిల్లీలో మొదలైంది. వాఘా సరిహద్దు వరకు పాదయాత్రగానే సాగింది. కానీ పాకిస్తాన్‌లో పాదయాత్రకు ఆ దేశం అనుమతించలేదు. అందుకే మా యాత్రను వాహనంలోకి మార్చాం. ఆ యాత్రకు పాకిస్తానీలు చూపించిన స్పందనను ఎప్పటికీ మరిచిపోలేను. వారు వీధుల్లోకి వచ్చి స్వాగతం పలికారు. చాలామంది భారత్‌తో పాకిస్తాన్‌ స్నేహం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

మిమ్మల్ని మావోయిస్టు అన్నపుడు ఎలా అనిపించింది?
కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినంత మాత్రాన మావోయిస్టులంటే ఎలా? వాస్తవానికి మన దేశంలో ఇప్పటికీ పేద ప్రజల పక్షాన పోరాడుతోంది కమ్యూనిస్టులే కదా!  

మీపై జాతి వ్యతిరేకి అన్న ముద్ర కూడా పడింది కదా!
ఆ సమయంలో నేను బెనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో నా విద్యార్థులకు నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్‌ డాటర్‌ డాక్యుమెంటరీని ప్రదర్శిద్దామనుకున్నా. అంతలోనే నన్ను జాతి వ్యతిరేకి అని అరెస్టు చేసి కేసులు పెట్టారు. బీహెచ్‌యూలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్ను బలవంతంగా తొలగించారు. కానీ నా మీద మోపిన అభియోగాలను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది!

సాఫ్ట్‌ డ్రింక్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి కారణమేంటి?
సాఫ్ట్‌ డ్రింక్‌ల పేరిట మన దేశంలో జలవనరుల దోపిడీ జరుగుతోంది. కోలా–పెప్సీ కంపెనీల తయారీ ప్లాంట్లు ఉన్నచోట భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారింది. ఎవరికీ ప్రయోజనం లేని డ్రింకుల కోసం దేశానికి అన్నంపెట్టే రైతుకు అన్యాయం చేయడం తగదు కదా! అందుకే, దానిపైనా ఉద్యమించా!

విద్యా హక్కు చట్టం కోసం పోరాటం ఎంతవరకు వచ్చింది?
మనదేశంలో 16 ఏళ్లలోపు ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది 8వ తరగతి వరకే చదువుతున్నారు. వీరిలో 25 శాతం బాల కార్మికులుగా ఉన్నారు. దేశాన్ని నిర్మించే రేపటి పౌరులకు విద్యను అందించడంలో నిర్లక్ష్యం తగదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఉచిత నిర్బంధ విద్యను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కార్పొరేట్‌ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని విస్మరించాయి. ఆ చట్టం అమలు కోసం నిరాహారదీక్షచేయడానికి వెనుకాడను.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ గురించి మీరేమంటారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాహక్కు చట్టం అమలు దారుణంగా ఉంది. ఇక్కడ విద్యావ్యవస్థను కార్పొరేట్‌ కల్చర్‌ శాసిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు నిర్వహించడం దారుణం. వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీలైతే వారికి వివిధ ఎంట్రన్స్‌ టెస్టుల్లో ప్రభుత్వమే కోచింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయా?
ఎందుకు రావు? 2015, జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కార్పొరేట్‌ స్కూలులో పేద విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంతో ఆర్టీఈ అమలు కోసం ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అప్పటి సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ చట్టం అమలుకు అంగీకరించారు. ఆ సమయంలో నా దీక్షకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ–2009 చట్టం అమలుకు, కార్పొరేట్‌ విద్య అంతానికి.. కోచింగ్‌ సెంటర్లు మూయించాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement