ప్రజాధనంతో సొంత ప్రచారమా? | Sandeep Pandey criticised chandrababu naidu | Sakshi
Sakshi News home page

ప్రజాధనంతో సొంత ప్రచారమా?

Published Tue, Jul 31 2018 2:55 AM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM

Sandeep Pandey criticised chandrababu naidu - Sakshi

విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే. చిత్రంలో సామాజిక వేత్త బి.రామకృష్ణంరాజు

సాక్షి, అమరావతి: అడ్వర్టయిజ్‌మెంట్ల (ప్రకటనలు)కు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ప్రచారం చేసుకుంటున్నారని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్‌ పాండే విమర్శించారు. పార్టీ ఇమేజ్‌ పెంచుకోవడానికి ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రజాధనాన్ని పబ్లిసిటీ (ప్రచారం) కోసం ఖర్చు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని వెల్లడించారు. ఎన్నికల ఏడాది కావడంతో మరింత ప్రజాధనం దుర్వినియోగం చేసేలా టీడీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీకి చెందిన సామాజికవేత్త బి.రామకృష్ణంరాజుతో కలిసి సందీప్‌పాండే సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు (యాడ్స్‌), ప్రచార హోర్డింగ్‌ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మార్గదర్శకాలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి తన విగ్రహాలు తయారు చేయించుకుని ప్రధాన కూడళ్లలో పెట్టుకోవడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని గుర్తు చేశారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాయవతికి మించి సొంత పార్టీ ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రధానమంత్రి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారే తప్ప మోదీ పేరు పెట్టడం లేదని, ఏపీలో మాత్రం ఎన్టీఆర్, చంద్రన్న పేర్లతో పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో ప్రకటనలు, హోర్డింగ్‌లు, పబ్లిసిటీని ప్రజాధనంతో చేసుకుంటూ పార్టీకి ఇమేజ్‌ వచ్చేలా వ్యవహరిస్తున్న తీరు మారాల్సి ఉందన్నారు. చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఏడాదిలోనైనా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ఇమేజ్‌ పెంచుకునే తరహా ప్రకటనలు, పబ్లిసిటీ మానుకోవాలని హితవు పలికారు.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు ఇచ్చిందని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. 13/2003, 302/2012(సివిల్‌)ల రిట్‌ పిటిషన్లపై 2015 మే 13, ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను వివరించారు.
ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఫొటోలు వాడుకోవడం వరకు ఫర్వాలేదు. ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు వాడకుంటే వారికి బదులు ఆయా ప్రభుత్వ శాఖల మంత్రుల ఫొటోలు వాడుకోవచ్చు.
ప్రజా ప్రయోజనం లేని ప్రకటనలకు ప్రజాధనాన్ని వెచ్చించకూడదు.
ఒక వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ, ప్రభుత్వానికిగానీ ప్రచారం కల్పించే విధంగా ఉండరాదు.
ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వాలు అత్యంత జాగరుకతతో వ్యవహరించాలి.
పౌరులకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజెప్పే విధంగా, ప్రభుత్వ వి«ధానాలు, సేవలు, ప్రభుత్వ చొరవతో తీసుకునే కార్యక్రమాలు, ప్రజారోగ్యం, పరిసరాలు, భద్రత మొదలైన విషయాలపై ప్రకటనలు ఉండాలి.
రాజకీయ పార్టీల చిహ్నాలు, గుర్తులు, జెండాలు ప్రభుత్వ ప్రకటనల్లో ప్రదర్శించకూడదు.
ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకమైనా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతాయి కాబట్టి పథకాలకు అధికార పార్టీ నాయకుల, వ్యక్తుల పేర్లను పెట్టి కొనసాగించడం సబబుకాదు.
ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీలోని అధికార పార్టీ నేతల ప్రచారానికి ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు ఎన్నికల్లో వారి గెలుపుకోసం ఉపయోగించుకునే విధంగా ఉంటున్నాయని సందీప్‌పాండే వివరించారు.

రాష్ట్రంలో 30 పథకాలకు ఇమేజ్‌ పెంచుకునే పేర్లే..
ఏపీలో ఏకంగా 30 పథకాలకు సొంత పార్టీ ఇమేజ్, వ్యక్తుల ఇమేజ్‌ పెంచుకునేలా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. అన్న, చంద్రన్న, ఎన్టీఆర్‌ పేర్లతో పథకాలు, ప్రకటనలు ఇవ్వడం సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో పెన్షన్‌ పథకం, సుజల స్రవంతి, జలసిరి, విద్యోన్నతి, వైద్యసేవ, వైద్య పరీక్ష, ఆశయం, విదేశీ విద్యాదారణ, ఎన్టీఆర్‌ గృహనిర్మాణం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు.

అన్న అమృతహస్తం, అన్న సంజీవిని, అన్న క్యాంటిన్, అన్న దీవెన, అన్న అభయహస్తం పేరుతో ఎన్టీఆర్‌ పేరు గుర్తొచ్చేలా చేసి పార్టీ ఇమేజ్‌ పెంచుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రన్న పేరుతో చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న విదేశీ విద్యాదీవెన, విద్యోన్నతి, స్వయం ఉపాధి, సంచార చికిత్స, ఉన్నత విద్యదీపం, తోఫా, క్రిస్మస్‌ కానుక, సంక్రాంతి కానుక, రైతునేస్తం, భూసార పరీక్షలు, చేయూత, కాపు భవన్‌లు, డ్రైవర్ల ప్రమాద బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పేర్లతో సొంత ఇమేజ్‌ పెంచుకుని పార్టీకి మేలు జరిగేలా ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని వారు తప్పుబట్టారు.

ఇప్పటికైనా ఈ పథకాలకు ముందున్న ఎన్టీఆర్, అన్న, చంద్రన్న పేర్లు మార్పుచేసి ‘ముఖ్యమంత్రి’ పేరు పెట్టుకోవడం మంచిదని, అలా అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ఏళ్లు అయినా ఈ పథకాలు అదే పేరుతో కొనసాగుతాయని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement