నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రకటనలు
వైఎస్ భారతి సాక్షి చైర్‌పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు..
ఏబీసీ గణాంకాల ఆధారంగానే సాక్షి, ఈనాడు, ఇతర పత్రికలకు యాడ్స్
మూడున్నరేళ్లలో ఈనాడుకు రూ.243 కోట్ల విలువైన ప్రకటనలు
తమకు యాడ్స్ అక్కర్లేదంటూ ఏడాదిన్నర క్రితం ఈనాడు లేఖ
బకాయిలు ఒక్క ఈనాడుకే కాదు.. సాక్షికి కూడా..
ఈనాడుకు రూ.51 కోట్లు.. సాక్షికి రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు
అన్నీ తెలిసీ దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అరాచకాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశం మాటున అక్కసు వెళ్లగక్కారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనల జారీని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ వేదికగా వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన చంద్రబాబు.. ఈసారి కూడా అవే అవాస్తవాలను వినిపించారు.
నాడు నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసనసభలో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. అయినాసరే చంద్రబాబు పదే పదే సాక్షి పత్రికపై బురదజల్లేందుకు యత్నిస్తుండటం ఆయన దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది.
భారతి చైర్‌పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు
వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికకు అక్రమంగా అధికంగా ప్రకటనలు ఇచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ భారతి సాక్షి పత్రికకు చైర్‌పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు.
ఏబీసీ మార్గదర్శకాల మేరకే ప్రకటనలు
వైఎస్సార్‌సీపీ హయాంలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా రూ.443 కోట్ల ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇతర పత్రికలన్నింటికీ కలిపి కూడా అంత విలువైన ప్రకటనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటంటే నాడు సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతోపాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సాక్షి పత్రికకు ఐదేళ్లలో రూ.443 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు చెప్పింది అవాస్తవం.
సాక్షి పత్రికకు ఆ ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి. ఈనాడు పత్రికకు కూడా మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడున్నరేళ్ల తరువాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఈనాడు యాజమాన్యం సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటలు ఇవ్వలేదు.
ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్టు అయ్యేది. ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈనాడు పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని చంద్రబాబు విమర్శించారు.
వాస్తవమేమిటంటే.. ఈనాడుకే కాదు.. సాక్షి పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటనల బకాయిలు రూ. 51 కోట్లు ఉండగా నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment