రవీశ్ కుమార్
మనీలా: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను వరించింది. 2019 ఏడాదికి గాను రవీష్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు రామన్ మెగసెసె ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. అలాగే భారత్‌దేశ టెలివిజన్ జర్నలిస్టుల్లో అత్యంత ప్రతిభావంతమైన వారిలో రవీశ్ ఒకరని కొనియాడింది. రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె–2019 పురస్కారానికి ఎంపికయ్యారు.
వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్‌ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి రామన్ మెగసెసె అవార్డును ఆర్‌కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారు.
రవీష్ ప్రస్థానం..
బిహార్‌లోని జిత్వార్‌పూర్ గ్రామం లో రవీశ్ జన్మించారు. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా 1996లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారని ఫౌండేషన్ పేర్కొంది. అనేక ఒత్తిడులు ఉండే మీడియా వాతావరణంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపింది. వాస్తవాల ఆధారిత రిపోర్టింగ్ పద్ధతులను ఆచరించేవారని, నైతికతతో తన వృత్తిని నిర్వహించేవారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment