Asian Nobel
-
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
మనీలా: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను వరించింది. 2019 ఏడాదికి గాను రవీష్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు రామన్ మెగసెసె ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. అలాగే భారత్దేశ టెలివిజన్ జర్నలిస్టుల్లో అత్యంత ప్రతిభావంతమైన వారిలో రవీశ్ ఒకరని కొనియాడింది. రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె–2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి రామన్ మెగసెసె అవార్డును ఆర్కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారు. రవీష్ ప్రస్థానం.. బిహార్‌లోని జిత్వార్పూర్ గ్రామం లో రవీశ్ జన్మించారు. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా 1996లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారని ఫౌండేషన్ పేర్కొంది. అనేక ఒత్తిడులు ఉండే మీడియా వాతావరణంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపింది. వాస్తవాల ఆధారిత రిపోర్టింగ్ పద్ధతులను ఆచరించేవారని, నైతికతతో తన వృత్తిని నిర్వహించేవారని వెల్లడించింది. -
భారతీయులకు మెగసెసె
మనీలా: ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వీధుల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తున్న మానసికవైద్యుడు భరత్ వాత్వానీతో పాటు లడఖ్ యువత జీవితాల్లో వెలుగునింపిన ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లను ఈ అవార్డు వరించింది. ముంబైకి చెందిన వాత్వానీ.. వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారనీ మెగసెసె ఫౌండేషన్ ప్రశంసించింది. 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించి వాత్వానీ దంపతులు ఎనలేని సేవచేస్తున్నారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన ఇంజనీర్ వాంగ్ చుక్.. తన విభిన్నమైన, సృజనాత్మక బోధనా పద్ధతులతో ఈశాన్య భారతం,లడఖ్ యువత జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారని ఫౌండేషన్ కితాబిచ్చింది. వీరిద్దరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్లు అవార్డుకు ఎంపికయ్యారు. విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్, రూ.20.6 లక్షల నగదు బహుమతి ప్రదానంచేయనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
దక్షిణాఫ్రికా వీరుడికి ఆసియా నోబెల్ ప్రదానం
తైపీ: దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అల్బీ సాచ్స్, నార్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రధాని గ్రో హాలెమ్ బ్రంట్‌లాండ్ సహా ఐదుగురికి గురువారం ఆసియా నోబెల్‌గా పేరొందిన ‘తాంగ్ ప్రైజ్’ను తైవాన్ అధ్యక్షుడు మా యింగ్ జ్యూ ప్రదానం చేశారు. పర్యావరణం, మానవహక్కులు, వైద్యం, చైనా చరిత్ర.. రంగాల్లో అద్వితీయ సేవలందించిన వారికి ఈ అవార్డ్‌ను ప్రకటించారు. 2012లో తైవాన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సామ్యూల్ యిన్ ప్రసిద్ధ చైనా రాజవంశం ‘తాంగ్’ పేరుమీద ఈ అవార్డ్‌ను నెలకొల్పారు. పురస్కార గ్రహీతలకు 5 కోట్ల తైవాన్ డాలర్లు(రూ.10.33 కోట్లు) అందిస్తారు. ఇది నోబెల్ విజేతలకు లభించే మొత్తంకన్నా ఎక్కువ. 2014 నుంచే ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు.