20 లక్షలు ఇస్తానంటే తీసుకోరేమిటి?
ఎయిమ్స్ తీరుపై ఓ వైద్యుడి ఆవేదన
న్యూఢిల్లీ: నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పాలక యంత్రాంగం తలతిక్కగా వ్యవహరిస్తోందనడానికి మాజీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ), ప్రస్తుత ఎయిమ్స్ డిప్యూటీ కార్యదర్శి సంజయ్ చతుర్వేది విషయమే ఉదాహరణ. ఆయన ఉత్తమ వైద్య సేవలను గుర్తించి ఆయనకు రామన్ మెగసెసె అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డు కింద తనకు వచ్చిన దాదాపు రూ. 20 లక్షలను పేదల వైద్యం కోసం ఆయన తాను పనిచేస్తున్న ఎయిమ్స్కే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పాలకవర్గానికి తెలియజేసి, లిఖితపూర్వక అప్పీల్ కూడా చేశారు. ఇప్పటికే ఆయన్ను 12 సార్లు బదిలీచేసి వేధించిన ఉన్నతాధికారులు ఆఖరికి డబ్బులు తీసుకోవడానికి కూడా వేధిస్తున్నారు!
నిబద్ధతతో వ్యవహరిస్తూ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నందుకే ఆయనను ఉన్నతాధికారులు చీఫ్ విజిలెన్స్ అధికారి పదవి తొలగించారు. ఆ తర్వాత అంత ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేశారు. తనకు మెగసెసె అవార్డు కింద వచ్చిన రూ. 20 లక్షల చెక్కును పేదల వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఖాతాలో జమచేయాల్సిందిగా సెప్టెంబర్ 21వ తేదీన ఎయిమ్స్ డైరెక్టర్‌ను సంజయ్ చతుర్వేది కోరారు. ఆస్పత్రి పాలక యంత్రాంగం ఏవో కుంటిసాకులు చెబుతూ ఇప్పటివరకు ఆ చెక్కును డిపాజిట్ చేయలేదు. గత రెండు నెలలుగా ఆ చెక్కు అలా వృధాగానే పడి ఉంది. మరో నెలరోజులు గడిస్తే చెక్కు కాలపరిమితి కూడా ముగిసిపోతుంది.
ఈ విషయంలో తనకు కూడా విసుగు వచ్చిందని, ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి నిధికి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నానని సంజయ్ సోమవారం మీడియాకు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరు విరాళాలు ఇచ్చినా వెంటనే ఎయిమ్స్ ఖాతాలో డిపాజిట్‌చేసే పాలకమండలి ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న తాను ఇచ్చిన చెక్కు విషయంలో ఇలా వ్యవహరిస్తోందని, ఇది కూడా వేధింపులో భాగమేనని భావిస్తున్నానని ఆయన అన్నారు. తాను ఈ పరిస్థితినంతా వివరిస్తూ గత శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశానని, చెక్కును అందజేయడానికి ఆయన అపాయింట్‌మెంట్‌ను కూడా కోరానని తెలిపారు.
ఈ విషయమై ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ వి. శ్రీనివాస్‌ను వివరణ కోరగా, సంజయ్ ప్రతిపాదనను తాము ఆరోగ్య శాఖ పరిశీలనకు పంపించామని, వారు 'రాష్ట్రీయ ఆరోగ్య నిధి' కింద డిపాజిట్ చేయాలని సూచనలు పంపారని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు చెక్కును డిపాజిట్ చేయలేక పోయామని వివరణ ఇచ్చారు. మళ్లీ ఇదే విషయమై సంజయ్‌ని మీడియా ప్రశ్నించగా, అర్థం పర్థం లేని సాకులతో డబ్బు డిపాజిట్‌ను ఆపడమేమిటని, అసలు ఆరోగ్యశాఖ పరిశీలనకు పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.