Hindu News paper
-
మా.. తుఝే సలామ్!
ఒక దృశ్యం వంద మాటలతో సమానం! పి.వి.శివకుమార్ కెమెరా లెన్స్దీ అలాంటి ఎక్స్‌ప్రెషనే ! ఉదాహరణ.. ఇక్కడ కనిపిస్తున్న మదర్ థెరిసా ఫొటో.హిందూ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు పి.వి.శివకుమార్. లెన్స్‌కి లైఫ్ ఇచ్చిన ఈ ఫొటోగ్రాఫ్ స్టోరీ ఆయన మాటల్లోనే.. మాటలకందని భావాలెన్నింటినో ఒక్క ఫొటో రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను తీసిన ఛాయాచిత్రాల్లో నాకు నచ్చిన.. ఎందరో మెచ్చిన వాటిల్లో ఇదీ ఒకటి. అసలు మదర్‌ను ఫొటో తీసే అవకాశం రావడమే గొప్ప అదృష్టం. ఆ రకంగా కూడా దీన్ని నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోగా చెప్పుకోవచ్చు. సందర్భం.. 1990లో క్రిస్టియన్ మిషనరీస్ చారిటీ కోసం మదర్ థెరిసా హైదరాబాద్ వచ్చినప్పుడు తీసిన ఫొటో ఇది. అప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నా. ఆ అసైన్‌మెంట్‌కు నన్ను పంపించారు. దేవుడు ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు. కానీ మదర్ రూపంలో ఉంటాడ నిపించింది.. ఆమెను చూసినప్పుడు! ఆ కళ్లలో కరుణ.. ఆ ముఖంలో ప్రశాంతత.. ఆమె అంతఃకరణలోని స్వచ్ఛతను ప్రతిఫలిస్తుంటాయి. ఆమె సేవాతత్పరతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అక్కడున్న ఓ సిస్టర్ చేతుల్లో నుంచి ఓ చంటిబిడ్డను మదర్ తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఆ సందర్భంలో మదర్ ముఖంలో దైవత్వం కనిపించింది. ఆ బిడ్డ ఆడపిల్ల.. అక్కడున్న ఉయ్యాలలన్నిట్లోనూ ఆడపిల్లలే ఉన్నారు. వీరిలో పెళ్లికాని తల్లుల పిల్లలు కొందరుంటే.. చెత్తకుప్పల్లో దొరికిన శిశువులు ఇంకొందరు.. ఆడపిల్ల అక్కర్లేదనుకున్న తల్లిదండ్రుల బిడ్డలూ కొందరు ఉన్నారు. ఇలా అనాథలైన పిల్లలందరికీ ఈ ప్రపంచంలో చోటుందని తన ఒడిని పట్టిన అమ్మ మదర్ థెరిసా. అలాంటి క్షణంలో ఆమెను నా కెమెరాతో కాదు.. మనసుతో తీసిన ఫొటో ఇది. మదర్ ముఖంలో ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రౌడ్ మూమెంట్.. మదర్ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ సతీసమేతంగా వైట్‌హౌస్ బయటకు వచ్చి మరీ మదర్‌ను సాదరంగా లోనికి ఆహ్వానించారు. ప్రపంచం మదర్కిచ్చిన గౌరవం అలా ఉండేది. ఆమె విశ్వవనిత! అలాంటి మదర్.. నేను ఫొటో తీయడానికి వెళ్లినపుడు ‘పేరేంటి? ఏ పేపర్లో పనిచేస్తారు?’ అని అడిగింది. నాలాంటి ఫొటోగ్రాఫర్లను ఎంతమందినో చూసుంటుంది. కానీ, నన్ను అలా పరిచ యం చేసుకోవడం.. ఫర్ మి.. ఇట్ వజ్ ఎ ప్రౌడ్ మూమెంట్! అదీ ఆమె గొప్పదనం. ఈ ఫొటో తెల్లవారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గ్రూప్ ప్రతికలన్నిటిలోనూ ఫ్రంట్ పేజ్‌లో పబ్లిష్ అయింది. అదే రోజు సాయంకాలం నిజాం కాలేజ్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఈ ఫొటో కాపీలతో సహా వెళ్లాను. వాటి ని మదర్‌కు చూపించాను. నన్ను గుర్తు పట్టింది. ఫొటోలు చూసి మెచ్చుకుంది. ఇంతకన్నా గర్వించదగ్గ విషయం ఇంకేముంటుంది! టెక్నికల్ లెన్స్.. దీన్ని అప్ క్లోజ్‌షాట్ అంటారు. ఈ ఫొటో కోసం వాడిన కెమెరా నికాన్ ఫెమ్ 2. లెన్స్ వచ్చేసి 85 ఎమ్ఎమ్ టెలీఫొటో లెన్స్. ముగింపు.. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఒక్క ఫ్రేమ్‌లో వందల ఫొటోలు తీసేస్తున్నారు. టెక్నాలజీ ఇచ్చిన ఈ వరం శాపం కావద్దు. కళాత్మక దృష్టితో ఒక్క ఫొటో తీస్తే చాలు.. అది స్పష్టమైన భావాన్ని కళ్లముందుంచుతుంది. అంతేకాదు ఫొటోగ్రాఫర్స్.. ఫొటో జర్నలిస్టులు కూడా కావాలని నా కోరిక. ఒక రైటర్ చెప్పలేని ఎక్స్ప్రెషన్ మన ఫ్రేమ్ చెప్తుందని గట్టిగా నమ్ముతాను. ప్రజెంటేషన్: సరస్వతి రమ -
పత్రికా స్వేచ్ఛపై దాడి: పాలగుమ్మి సాయినాధ్
సాక్షి, హైదరాబాద్: హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌పై కేసు పెట్టడం అప్రజాస్వామికమని ఆ పత్రిక గ్రామీణ వ్యవహారాల సంపాదకులు పాలగు మ్మి సాయినాధ్ పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. నగేష్‌పై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్న డీజీపీ దినేష్‌రెడ్డి తీరుకు నిరసనగా గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే నిర్వహించిన సత్యాగ్రహ కార్యక్రమంలో సాయినాథ్ మాట్లాడారు. ‘ఇది హిందూ పత్రికపై జరిగిన దాడి కాదు. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద, మీడియా హక్కుల మీద జరిగిన దాడి’ అని ఆయన అభివర్ణించారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఇక చట్టాన్ని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును కాపాడే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. డీజీపీపై చర్యలకు రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ అన్నారు. డీజీపీ దినేష్‌రెడ్డి కొద్దికాలం మాత్రమే పదవిలో ఉంటారని, అదిపోయిన తర్వాత మీడియా అంటే ఏమిటో ఆయనకు తెలిసి వస్తుందని ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. జర్నలిస్టులపై దాడులను ఐకమత్యంతో ఎదిరిద్దామని సాక్షి పొలిటికల్ బ్యూరో చీఫ్ కె.సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు సత్యాగ్రహం చేసుకునే అవకాశం కూడా లేకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్ విమర్శించారు. ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, సీనియర్ పాత్రికేయులు జి.ఎస్.వరదాచారి, ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.