మా.. తుఝే సలామ్!
ఒక దృశ్యం వంద మాటలతో సమానం!
పి.వి.శివకుమార్
కెమెరా లెన్స్‌దీ అలాంటి ఎక్స్‌ప్రెషనే ! ఉదాహరణ.. ఇక్కడ కనిపిస్తున్న మదర్ థెరిసా ఫొటో.హిందూ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు పి.వి.శివకుమార్. లెన్స్‌కి లైఫ్ ఇచ్చిన ఈ ఫొటోగ్రాఫ్ స్టోరీ ఆయన మాటల్లోనే..
మాటలకందని భావాలెన్నింటినో ఒక్క ఫొటో రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను తీసిన ఛాయాచిత్రాల్లో నాకు నచ్చిన.. ఎందరో మెచ్చిన వాటిల్లో ఇదీ ఒకటి. అసలు మదర్‌ను ఫొటో తీసే అవకాశం రావడమే గొప్ప అదృష్టం. ఆ రకంగా కూడా దీన్ని నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోగా చెప్పుకోవచ్చు.
సందర్భం..
1990లో క్రిస్టియన్ మిషనరీస్ చారిటీ కోసం మదర్ థెరిసా హైదరాబాద్ వచ్చినప్పుడు తీసిన ఫొటో ఇది. అప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నా. ఆ అసైన్‌మెంట్‌కు నన్ను పంపించారు. దేవుడు ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు. కానీ మదర్ రూపంలో ఉంటాడ నిపించింది.. ఆమెను చూసినప్పుడు! ఆ కళ్లలో కరుణ.. ఆ ముఖంలో ప్రశాంతత.. ఆమె అంతఃకరణలోని స్వచ్ఛతను ప్రతిఫలిస్తుంటాయి. ఆమె సేవాతత్పరతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి.
అక్కడున్న ఓ సిస్టర్ చేతుల్లో నుంచి ఓ చంటిబిడ్డను మదర్ తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఆ సందర్భంలో మదర్ ముఖంలో దైవత్వం కనిపించింది. ఆ బిడ్డ ఆడపిల్ల.. అక్కడున్న ఉయ్యాలలన్నిట్లోనూ ఆడపిల్లలే ఉన్నారు. వీరిలో పెళ్లికాని తల్లుల పిల్లలు కొందరుంటే.. చెత్తకుప్పల్లో దొరికిన శిశువులు ఇంకొందరు.. ఆడపిల్ల అక్కర్లేదనుకున్న తల్లిదండ్రుల బిడ్డలూ కొందరు ఉన్నారు. ఇలా అనాథలైన పిల్లలందరికీ ఈ ప్రపంచంలో చోటుందని తన ఒడిని పట్టిన అమ్మ మదర్ థెరిసా. అలాంటి క్షణంలో ఆమెను నా కెమెరాతో కాదు.. మనసుతో తీసిన ఫొటో ఇది. మదర్ ముఖంలో ఆమె హృదయం కనిపిస్తుంది.
ప్రౌడ్ మూమెంట్..
మదర్ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ సతీసమేతంగా వైట్‌హౌస్ బయటకు వచ్చి మరీ
మదర్‌ను సాదరంగా లోనికి ఆహ్వానించారు. ప్రపంచం మదర్‌కిచ్చిన గౌరవం అలా ఉండేది. ఆమె విశ్వవనిత! అలాంటి మదర్.. నేను ఫొటో తీయడానికి వెళ్లినపుడు ‘పేరేంటి? ఏ పేపర్‌లో పనిచేస్తారు?’ అని అడిగింది. నాలాంటి ఫొటోగ్రాఫర్లను ఎంతమందినో చూసుంటుంది. కానీ, నన్ను అలా పరిచ యం చేసుకోవడం..
ఫర్ మి.. ఇట్ వజ్ ఎ ప్రౌడ్ మూమెంట్! అదీ ఆమె గొప్పదనం. ఈ ఫొటో తెల్లవారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గ్రూప్ ప్రతికలన్నిటిలోనూ ఫ్రంట్ పేజ్‌లో పబ్లిష్ అయింది. అదే రోజు సాయంకాలం నిజాం కాలేజ్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఈ ఫొటో కాపీలతో సహా వెళ్లాను. వాటి ని మదర్‌కు చూపించాను. నన్ను గుర్తు పట్టింది. ఫొటోలు చూసి మెచ్చుకుంది. ఇంతకన్నా గర్వించదగ్గ విషయం ఇంకేముంటుంది!
టెక్నికల్ లెన్స్..
దీన్ని అప్ క్లోజ్‌షాట్ అంటారు. ఈ ఫొటో కోసం వాడిన కెమెరా నికాన్ ఫెమ్ 2. లెన్స్ వచ్చేసి 85 ఎమ్‌ఎమ్ టెలీఫొటో లెన్స్.
ముగింపు..
ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఒక్క ఫ్రేమ్‌లో వందల ఫొటోలు తీసేస్తున్నారు. టెక్నాలజీ ఇచ్చిన ఈ వరం శాపం కావద్దు. కళాత్మక దృష్టితో ఒక్క ఫొటో తీస్తే చాలు.. అది స్పష్టమైన భావాన్ని కళ్లముందుంచుతుంది. అంతేకాదు ఫొటోగ్రాఫర్స్.. ఫొటో జర్నలిస్టులు కూడా కావాలని నా కోరిక. ఒక రైటర్ చెప్పలేని ఎక్స్‌ప్రెషన్ మన ఫ్రేమ్ చెప్తుందని గట్టిగా నమ్ముతాను.
ప్రజెంటేషన్: సరస్వతి రమ