సొసైటీ టు సేవ్ రాక్స్ | society to Save Rocks | Sakshi
Sakshi News home page

సొసైటీ టు సేవ్ రాక్స్

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

సొసైటీ టు సేవ్ రాక్స్ - Sakshi

సొసైటీ టు సేవ్ రాక్స్

నౌబత్‌పహాడ్ (బిర్లామందిర్), పహాడీ షరీఫ్, అల్లాహ్ బండా, బండమైసమ్మ, పార్శిగుట్ట... ఈ పేర్లు చూస్తే నగరంలో కొండలూ, గుట్టలూ ఎంతగా భాగమై ఉన్నాయో అర్థమవుతుంది. 2500 మిలియన్ ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ శిలలున్నాయి. ఇది ప్రపంచంలోనే అరుదైన దక్కన్ పీఠభూమి. ఎటు చూసినా రాతి సోయగాలే ఇక్కడ. ఇంతటి అందాలు మరెక్కడా కనిపించవు. ఇతర దేశాల్లో ఇలాంటి సహజసిద్ధ అందాలనువారసత్వ సంపదగా అపురూపంగా చూసుకొంటారు. కానీ మన నగరంలో..! కాంక్రీట్ జంగిల్ మాటున రాళ్ల అందాలు కనుమరుగవుతున్నాయి. ఈ విధ్వంసాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తోంది నగరంలోని ‘సొసైటీ టు సేవ్ రాక్స్’.
 
కొంత మంది ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్స్ కలసి నగరంలోని రాక్స్‌ను రక్షించాలని సంకల్పించారు. అలా వారంతా 1996లో సేవ్ రాక్స్ సొసైటీగా ఏర్పడ్డారు. దీనికి లకా్ష్మగౌడ్ తొలి అధ్యక్షుడు. ప్రస్తుతం నరేంద్ర లూథర్ ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈ కృషిలో భాగంగా 2003లో జాతీయ హెరిటేజ్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకుంది ఈ సంస్థ.
 
గార్డెన్లతో అందం...
‘90 దశకం నుంచి హైదరాబాద్ నగర విస్తరణ వేగవంతమైంది. ఈ క్రమంలో నగరం, చుట్టూ ఉన్న గుట్టలు, కొండలు మాయమవుతూ వస్తున్నాయి. నవ నగర నిర్మాణంలో విలువైన భౌగోళిక సంపదను కోల్పోతున్నాం. ఇలాంటి సంపదను విదేశాల్లో హెరిటేజ్ హోదా కల్పించి పరిరక్షిస్తుంటారు. అలా ఇక్కడి ప్రభుత్వాలు కూడా కొండలు, గుట్టలున్న ప్రాంతాలను రాక్ గార్డెన్లు, పార్క్‌లుగా డెవలప్ చేసి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’ అంటారు ఈ సొసైటీ సెక్రటరీ ఫ్రౌక్ ఖాదర్. ప్రభుత్వం, డెవలపర్స్, భూస్వాములను మెప్పించి ఇక్కడి గ్రానైట్ శిలలను కాపాడాలనేది వీరి లక్ష్యం. ఇళ్లు, గార్డెన్లు, కాలనీల్లో శిలల పరిరక్షణ దిశగా ప్రోత్సహించేందుకు అనేక అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
 
అవగాహన కోసం...
ప్రతి నెలా మూడో ఆదివారం నగరం, శివారు ప్రాంతాల్లో రాక్‌వాక్ నిర్వహిస్తుంటారు. అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో పెయింటింగ్, వ్యాసరచన, పోయెట్రీ పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. తొలి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా 2005లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఎన్విరో మేళాలో పర్యావరణానికి సంబంధించిన అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. 2012 నుంచి రాకథాన్ పేరుతో ఏటా కొండలు, రాళ్లకు అనుబంధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలతో సహా ప్రకృతి ప్రేమికులు ఎందరో వీటిల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 14 నుంచి జరుగనున్న ఈ రాకథాన్‌లో 13 యాక్టివిటీస్ ఉంటాయని, ఆరేళ్ల వయసు వారి నుంచి ఎవరైనా ఈవెంట్‌లో పాల్గొనవచ్చని సొసైటీ చెబుతోంది.
 
బాధాకరం...
'ఎంతో అపురూపమైన ప్రకృతి సంపదని ఒక బిల్డింగ్ మెటీరియల్‌గా వాడేయటం బాధాకరం. చెట్లు నాటితే మళ్లీ పెరుగుతాయి. నిర్మాణాలు వేరే ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. కానీ ఈ రాళ్లను కోల్పోతే మళ్లీ సృష్టించడం మన చేతుల్లో లేని పని. చారిత్రక, భౌగోళిక ప్రాముఖ్యత ఉన్న రాళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యత’ అంటారు ఫ్రౌక్ ఖాదర్. ఇప్పటికీ సిటీలో గుర్తించిన 24 హెరిటేజ్ రాక్స్‌ని ఒక క్యాలెండర్‌గా రూపొందించి... ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ సొసైటీ వారు.
 
‘వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, టవర్స్, ట్రాన్స్‌మీటర్ టవర్స్ కోసం ఈ గుట్టలను ధ్వంసం చేయటం, వాటి అందాన్ని పాడు చేయటం ఎంతో సాధారణంగా జరిగిపోతోంది. గుట్టలు, శిలలను కాపాడటం ఒక్కరితో అయ్యే పని కాదు. టూరిజం, హెరిటేజ్ డిపార్ట్‌మెంట్లు వంటివి పూనుకొంటేనే రాక్స్ అందాలు రక్షించుకోగలం. ఈ కొండలు, గుట్టలను కరిగించకుండా రాక్ పార్కులుగా మార్చితే వాటి పరిరక్షణతో పాటు నగరవాసులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రభుత్వం స్పందించి వీటి పరిరక్షణ బాధ్యత చేపడితే చాలా సంతోషం’ అంటున్నారు సొసైటీ సభ్యులు. 300లకు పైగా సభ్యులున్న  ఈ సొసైటీలో మెంబర్‌గా చేరాలంటే సేవ్‌రాక్స్ వెబ్‌సైట్ saverocks.org చూడవచ్చు.
- ఓ మధు
 
చెట్లు నాటితే మళ్లీ పెరుగుతాయి. నిర్మాణాలు వేరే ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. కానీ ఈ రాళ్లను కోల్పోతే మళ్లీ సృష్టించడం మన చేతుల్లో లేని పని. - ఫ్రౌక్ ఖాదర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement