నను బ్రోవమని.. | lence and life | Sakshi
Sakshi News home page

నను బ్రోవమని..

Published Sun, Nov 30 2014 1:01 AM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

నను బ్రోవమని.. - Sakshi

నను బ్రోవమని..

రామ వీరేశ్‌బాబు
cel: 98496 89896
email: Veeresh_blue@yahoo.com


లేన్స్ & లైఫ్
జనజాతరలో ప్రతి నిమిషం భక్తజయధ్వానాలు వినిపిస్తాయి. జాతరలోని జానపదాన్ని కెమెరాలో బంధిస్తే ఆ ఫ్రేమ్ నిర్మలమైన భక్తికి నిర్వచనంలా నిలుస్తుంది. ఈ సత్యం తెలిసిన ఫొటోగ్రాఫర్ రామ వీరేశ్‌బాబు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై ఉన్న ఆయన ఆసక్తి పెద్దయ్యేసరికి లెన్స్ వైపు మళ్లింది. డాక్యుమెంటరీల కోసం ఆయన పట్టిన కెమెరా తెలంగాణకు తలమానికమైన మేడారం, ఐనవోలు జాతరలను అన్ని కోణాల్లో స్పృశించింది. తపాలా శాఖలో ఉద్యోగం వచ్చినా ఆ హాబీని మాత్రం వీడలేదు. ఐనవోలు జాతరలో సంతానం కోసం జంగమదేవుడికి ఓ భక్తురాలు వరం పడుతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఆ ఛాయా చిత్రం గురించే ఈవారం లెన్స్ అండ్ లైఫ్. పుట్టి పెరిగింది వరంగల్. ప్రాథమిక, ఉన్నత, ఇంటర్, డిగ్రీ చదువు అంతా అక్కడే.

చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడమంటే ఆసక్తి. అలా ఎన్నో గ్రామీణ చిత్రాలు, జాతర దృశ్యాలను కాన్వాస్‌పై ప్రతిష్ఠించాను. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్‌భూషణ్‌తో పరిచయం నన్ను కెమెరా వైపు మళ్లించింది. 1977 నుంచే ఫొటోలు తీస్తున్నా. 1980లో వరంగల్‌లోనే తపాలా శాఖలో ఉద్యోగం వచ్చింది. అయినా నా ప్రవృత్తిని విడిచిపెట్టలేదు. 1987 నుంచి ఫొటోగ్రఫీని సీరియస్‌గా తీసుకున్నాను. డాక్యుమెంటరీల కోసం ఎన్నో జాతరలకు వెళ్లి ఫొటోలు తీశాను. లంబాడాల జీవన విధానాన్ని కెమెరా నేత్రంతో చూశాను.

ఉద్యోగం పనిపై తరచూ హైదరాబాద్ వస్తుండేవాణ్ని. సిటీలో పాత గడియారాలు, చెట్లను పూజించే విధానం, వాటిని పెంచే తీరుపై లెక్కలేనన్ని ఫొటోలు తీశా. ఇదే సమయంలో ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డెరైక్టర్ సి.పటేల్‌తో పరిచయం నా జీవితంలో గొప్ప మలుపు. ఒక్కో సబ్జెక్ట్‌ను ఎంచుకుని ఫొటోలు తీయమని ఆయన సూచించారు. 2003లో మధురైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో మేడారం జాతర ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. మంచి స్పందన వచ్చింది. వివిధ నగరాల్లో పలు షోలు నిర్వహించాను. హైదరాబాద్ గడియారాల ఫొటోలకు ఇంగ్లండ్‌లోని అసోసియేషన్‌షిప్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల గుర్తింపు లభించింది.
 
ఇవీ బెస్ట్...
సుమారు 25 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలోని ఐనవోలు జాతరకు వెళ్లా. ఎటు చూసినా జనమే. ఈ జాతరలో పిల్లల కోసం వరం పట్టడం సంప్రదాయంగా కనబడుతుంది. ఓ మహిళ స్నానం చేసి తడిదుస్తులతోనే పరమశివుడి పటం దగ్గరకు వచ్చి వరం పడుతున్న దృశ్యాన్ని వెంటనే లెన్స్‌లో బంధించా. ఆ ఫొటోకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నేను తీసిన ఎన్నో మంచి ఫొటోల్లో ఇదీ ఒకటి.
 
టెక్నికల్ యాంగిల్...
నేను కెనాన్ ఏవన్ కెమెరా వాడా. నా లెన్స్‌లో క్లిక్ అయిన దాదాపు 80 శాతం ఫొటోలకు ఈ కెమెరానే వాడా. గతంలో జరిగిన జాతరలకు, ఇప్పుడు జరుగుతున్న జాతరలకు చాలా తేడాలు వస్తున్నాయి. అప్పుడు నేను తీసిన డాక్యుమెంటరీలు భవిష్యత్ వాళ్లు గతంలో జాతర ఇలా జరిగేదే అని తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయని నా అభిప్రాయం.
ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement