భూ మాయ!
► కబ్జాలో ఉన్న సర్కార్ భూముల విలువ.. 10 వేల కోట్లు
► షేక్‌పేటలో అన్యాక్రాంతమైన భూములు
► వంద ఎకరాలకు పైమాటే
హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్యాక్రాంతమయ్యేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూముల విలువ అక్షరాల పదివేల కోట్ల రూపాయలు. యంత్రాంగం పట్టించుకోకపోతే ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లే భూ విస్తీర్ణం 831.62 ఎకరాలు. ఇందులో అత్యధికంగా అతి ఖరీదైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నందగిరిగిరి హిల్స్ తదితర ప్రాంతాల్లోని భూములే ఉండటం విశేషం. ఒక్క షేక్‌పేట మండలంలోనే ప్రభుత్వ భూములను తమవిగా పేర్కొంటూ కోర్టులకు ఎక్కిన భూముల విలువ ప్రస్తుతం రెండువేల కోట్ల రూపాయల పైమాటే.
ఆ తర్వాత మారేడుపల్లి, తిరుమలగిరి, బండ్లగూడ, ఆసిఫ్‌నగర్ మండలాల్లోనూ ఆ స్థాయిలో భూ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈనేపథ్యంలో సర్కారు భూములను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికీ కార్యాచరణ రూపొందిస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో .
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ అవసరాలు, ఇతర వినియోగాల కోసం ఎంత భూమి అందుబాటులో ఉంది, ఎంత ఆక్రమణలకు గురైంది, కోర్టు వివాదాల్లో ఎంత ఉంది, ఏఏ కోర్టుల్లో విచారణ సాగుతోంది..తదితర వివరాలను ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో సేకరించిన జిల్లా యంత్రాంగం ఇటీవలే సవివరణమైన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించింది. నగరంలో ఖరీదైన భూముల వివాదాలు సుప్రీం, హైకోర్టులు మొదలుకుని క్రింది స్థాయి కోర్టుల్లోనూ ఏళ్ల తరబడి నానుతున్నాయి. ప్రభుత్వ పరంగా సకాలంలో పేషీలకు హాజరుకాకపోవటం, సరైన పత్రాలు, ఆధారాలు కోర్టు ముందుంచటంలో విఫలమవుతుండటంతో ప్రభుత్వ భూముల ఖాతా నుండి ప్రైవేటు ఖాతాల్లోకి వెళుతున్న భూముల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఆ భూములూ వివాదాస్పదమే...
సంక్షేమ శాఖల అవసరాల నిమిత్తం పలు భవనాల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూములూ వివాదంలోనే ఉన్నాయి. కేటాయించిన స్థలాన్ని పరిరక్షించుకోవటంలో సంక్షేమ శాఖలు నిర్లక్ష్యం చేస్తుండగా..భూ కేటాయింపులు చేసిన రెవెన్యూ శాఖ పట్టించకోకపోవటం కబ్జాదారులకు వరంగా మారింది. జిల్లాలో ఎస్సీ, బీసీ, వికలాంగుల సం క్షేమ శాఖలు తమకు కేటాయించిన స్థలా ల్లో భవనాలు, దోబీఘాట్ల నిర్మాణాలు చేపట్టకపోగా...స్థలాలకు కనీసం ఫెన్సిం గ్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రభు త్వ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపాలను సానుకూలంగా మలచుకున్న భూ కబ్జాదారులు నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సష్టించి కోర్టుకు వెళ్తున్నారు.
మచ్చుకు కొన్ని....
మారేడుపల్లి మండలం లీలా గార్డెన్ సమీపంలోని సర్వేనంబర్ 207లోని 2730.64 చ.మీ.స్థలాన్ని ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణం కోసం కేటాయించగా, నిర్మాణం చేపట్టలేదు. స్థానికులు ఈ భూమిని కబ్జా చేయటంతోపాటు నకిలీ ధవీకరణ పత్రాలతో కోర్టుకు వెళ్లారు. తిరుమలగిరి మండలంలోని సర్వే నంబరు 112లో 508 చదరపు గజాలు ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి కేటాయించగా ఆక్రమణకు గురైంది. బండ్లగూడ మండలంలోని కందికల్‌లో సర్వేనంబరు 84,85లలోని 700 చదరపు గజాల స్థలం కబ్జాకు గురైంది. కాచిగూడ ఎస్సీ హాస్టల్ భవనం కోసం హయత్‌నగర్ మండలంలోని లింగంపల్లిలో 12,036 చదరపు గజాల భూమిని కేటాయించగా, ఈ స్థలం కూడా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.
బంజారా, క్రిస్టియన్ భవన్ స్థలాలు సైతం...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించి శంకుస్థాపనలు చేసిన బంజారాభవన్, క్రిస్టియన్ భవన్‌లకు సంబంధించిన స్థలాలు సైతం కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ భవన్‌లకు నిధులు మంజూరైనా కోర్టు వివాదాల కారణంగా నిర్మాణాలు చేపట్టడం లేదు.
అంగుళం భూమినీ వదులుకోం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నాం. కోర్టు వివాదంలో ఉన్న భూముల విషయంలో ఆయా విభాగాలతో మరింత సమన్వయంతో వ్యవహరించనున్నాయి. ప్రభుత్వానికి చెందాల్సిన అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదు. - రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్