హైదరాబాద్: టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో దొంగలు పడి కారుతో సహా బంగారు ఆభరణాలు చోరీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలోని బాపిరాజు ఇంట్లోకి శనివారం దొంగలు చొరబడ్డారు. మొదటి అంతస్తు బెడ్‌రూమ్‌లోని బీరువాలోంచి బంగారు ఆభరణాలు కాజేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఏపీ 09 బీఏ 0456 నంబర్ ఇన్నోవా కారును తస్కరించారు. శనివారం బాపిరాజు కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉండగా బయట చూస్తే కారు కనిపించలేదు. మరోకారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని నగలు కూడా కనిపించలేదు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఆయన పెద్ద కోడలు చైతన్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.