డిగ్రీ ఫీజుల పెంపు ఈసారి లేనట్టే!
మే 5న నోటిఫికేషన్..
వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఫీజుల పెంపు లేకుండానే డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఐదేళ్లుగా ఫీజులు పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి ఫీజుల పెంపునకు చర్యలు చేపట్టే అవకాశం ఉందని గతంలో అధికారులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఫీజుల పెంపు ప్రక్రియ చేపడితే ఇప్పట్లో పూర్తి కాదని, తద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలు ఆలస్యమవుతాయన్న అంచనాకు మండలి వచ్చింది.
కాబట్టి ఫీజులను పెంచ కుండానే ఈసారి ప్రవేశాలను చేపట్టాలని మండలి, ఆన్‌లైన్ ప్రవేశాల కమిటీ నిర్ణయానికి వచ్చాయి. మే 5న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, 8 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించాయి. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డిని సోమవారం యాజమాన్యాలు కలసి ఫీజులను పెంచాలని కోరాయి. ఫీజులను పెంచకపోతే ఆన్‌లైన్ ప్రవేశాల నుంచి వైదొలుగుతామని డిమాండ్ చేశాయి.