
ఎంసెట్ కుంభకోణం జరిగింది ఇలా...
తీగ లాగితే ఏకంగా డొంకే కదిలింది. ఎంసెట్-2 ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు ఎంసెట్-1 ప్రశ్నపత్రం కూడా లీకైందన్న విషయం తెలిసింది. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక పెద్ద ముఠా హస్తమే ఉందని తేలింది. ప్రశ్నపత్రాలను ముద్రణ కేంద్రం నుంచి చాకచక్యంగా తీసుకురావటం మొదలు వాటిని అత్యంత పకడ్బందీగా విద్యార్థులకు చేర్చటం, వారి నుంచి డబ్బు వసూలు చేయటం వరకు జరిగిన ఈ కుంభకోణంలో రాజగోపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ నిర్ధారించింది. కేసు నమోదుచేసిన మూడు రోజుల్లోనే సీఐడీ మొత్తం కుట్రను ఛేదించింది.
2014లో సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీలోనూ చక్రం తిప్పాడు. ముద్రణసంస్థ నుంచి చాకచక్యంగా ప్రశ్నపత్రాలను తప్పించి, ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థులను బెంగళూరు, ముంబై నగరాలకు తరలించి పరీక్షకు సిద్ధం చేశాడు. తొలుత కోచింగ్ కేంద్రాలు, వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పించే దళారులను రాజగోపాల్ ఆకట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా తనకు నెట్‌వర్క్ ఉందని, ప్రశ్నపత్రం తెప్పిస్తానని, విద్యార్థులను చూస్తే మంచి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. వీరు విద్యార్థులను సంప్రదించి రూ.40 - 70 లక్షలు చెల్లిస్తే సీటు గ్యారంటీగా వస్తుందని, పరీక్షకు ముందు రూ.10 లక్షలు చెల్లిస్తేచాలని, ర్యాంకు వచ్చిన తర్వాత మిగతా డబ్బు చెల్లించాలని నమ్మించారు. తమకు బాగా నమ్మకమైన, డబ్బు ఇవ్వగలిగిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచి కమీషన్ ముడుతుందన్న ఆశతో దళారులు మొత్తం 72 మంది విద్యార్థులను ఒప్పించగలిగారు. వారి నుంచి అడ్వాన్సుగా దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశారు. మొత్తంగా రూ. 50 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ఒప్పందం కుదిరిన విద్యార్థులను రాజగోపాల్ ముఠా తొలుత హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో ఉంచి కొద్ది రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రాంతాల వారీగా బ్యాచ్‌లుగా విభజించారు. పరీక్షకు రెండురోజుల ముందు విమానాల్లో బెంగళూరు, ముంబై, గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. కొందరిని హైదరాబాద్‌లోని వివిధ రిసార్టుల్లో ఉంచారు. అయితే ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని నిబంధన పెట్టారు. ప్రశ్నపత్రాలు తీసుకొచ్చిన మరో ముఠా అక్కడకు చేరుకుని విద్యార్థులకు వాటిని చూపించింది తప్ప వారి చేతికి ఇవ్వలేదు. మొత్తం రెండు సెట్ల ప్రశ్నలకూ విద్యార్థులకు జవాబులు చెప్పి సిద్ధం చేయించారు. ఎంసెట్-2కు ముందు రోజు వారి వారి పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. తర్వాత అంతా అనుకున్నట్లే అయ్యింది.