80 లక్షలు
ఇదీ గ్రేటర్ ఓటర్ల సంఖ్య
జనాభా కంటే అధికం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు... లెక్కలు తేల్చిన వాస్తవం. గత సంవత్సరం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్ జనాభా 78 లక్షలు. వివిధ కారణాలతో ఇటీవల జీహెచ్‌ఎంసీలో 6,30,652 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 80,57,198గా తేలింది. అంటే అప్పటి జనాభా కంటే ఇంకా సుమారు 2.5 లక్షల ఓటర్లు అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి ‘లెక్క’ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు వివరాలిలా ఉన్నాయి.
నియోజకవర్గాల పరంగా చూస్తే... కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6,16,437 మంది ఓటర్లు ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లిలో 5,53,311 మంది, ఎల్‌బీనగర్‌లో 5,36,953 మంది ఉన్నారు. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 1,98,285 మంది ఉన్నారు.తొలగించిన ఓటర్లు కూకట్‌పల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 1,08,972 మంది ఉన్నారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో అత్యల్పంగా 424 మంది మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇళ్లకు తాళాలు, అనర్హులు లేకపోవడం విశేషం. మలక్‌పేట నియోజకవర్గంలోనూ ఇళ్లకు తాళాలు, అనర్హులైన ఓటర్లు (వయసు తక్కువ ఉన్నవారు) లేరు.
త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. వివిధ రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున ఓటరు జాబితాలో లోటుపాట్లకు తావులేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాల నుంచి ఓటర్ల ముసాయిదాలపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి బూత్ స్థాయి అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
బూత్ స్థాయిలో ఓటర్ల నమోదు: శివకుమార్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభమైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు. బుధవారం గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గ కేంద్రాలతో పాటు బూత్‌లెవల్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తు న్న దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై అకారణ ంగా ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి వివరాలను అందజేయాలని శివకుమార్ కోరారు.
టీడీపీ వినతిపత్రం
ఓటర్ల జాబితా నుంచి అకారణంగా చాలా మందిని తొలగించారని ఆరోపిస్తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకులు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్, వనం రమేశ్, మేకల సారంగపాణి తదితరులు భన్వర్‌లాల్‌ను కలిసి జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనలోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పునర్విభజనలో అధికార పార్టీ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.