అస్థికల్ని గుర్తిస్తారిలా! | This is the most crucial in the identification of the skeletons | Sakshi
Sakshi News home page

అస్థికల్ని గుర్తిస్తారిలా!

Published Fri, Jun 24 2016 12:07 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

అస్థికల్ని గుర్తిస్తారిలా! - Sakshi

అస్థికల్ని గుర్తిస్తారిలా!

నిర్మాణం ఆధారంగా లింగ నిర్థారణ చేస్తారు
అస్థిపంజరాల గుర్తింపులో ఇదే అత్యంత కీలకం

శాస్త్రీయ పరిభాషలో ఆస్టియాలజీగా ప్రాచుర్యం
దుర్గం చెర్వులో దొరికిన స్కెలిటన్ గుర్తుపట్టారిలా

 

మాదాపూర్‌లోని దుర్గాం చెరువు స్కిల్టన్ స్టేజ్ వద్ద బుధవారం ఓ అస్థిపంజరం లభించింది. దీని తీరుతెన్నుల్ని అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు 35 ఏళ్ల యువతికి చెందినదిగా గుర్తించారు. శరీర భాగాలు పూర్తిగా పాడైపోయి, కేవలం ఎముకలు మాత్రమే మిగిలినా ఈ వివరాలను  తెలుసుకోవడం ఎలా సాధ్యమైంది? అనే అనుమానం మనలో చాలా మందికి వస్తుంది.  అస్థిపంజరాలన్నీ సామాన్యుల కంటికి ఒకేలా కనిపిస్తాయి. అయితే వీటిని అధ్యయనం చేసి అనేక వివరాలు తెలుసుకోవచ్చని చెప్తున్నారు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు. ఈ అధ్యయనాన్ని ఫోరెన్సిక్ పరిభాషలో ‘ఫోరెన్సిక్ ఆస్టియాలజీ’ అని పిలుస్తారట.  ఈ శాస్త్రం ఆధారంగా అస్థిపంజరాల లింగం, వయసు ఎలా గుర్తిస్తారనే అంశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...-సాక్షి, సిటీబ్యూరో

 

లింగ నిర్థారణ...
అస్థిపంజరం పురుషులదా, స్త్రీలదా అని నిర్థారించడంలో పెల్విక్ బోన్ కీలకపాత్ర పోషిస్తుంది. తొడ ఎముకలు, వెన్నుముకలను కలుపుతూ ఉండే చట్ట ప్రాంతంలో గుండ్రంగా ఉండే దాన్నే పెల్విక్ బోన్ అంటారు. ఇది స్త్రీలకు వెడల్పుగా, పురుషులకు కుంచించుకుని ఉంటుంది. దీని వల్లే తొడ ఎముక యాంగిల్ (వంపు) నిర్మాణంలోనూ తేడాలు వస్తాయి. పురుషుల తొడ ఎముక యాంగిల్ తక్కువగా, స్త్రీలకు ఎక్కువగా నిర్మాణమై ఉంటాయి. లింగ నిర్థారణకు ఇవి ప్రాథమికమైనవి. పుర్రె సైతం ఈ గుర్తింపునకు పనికి వస్తుంది. సాధారణంగా ఇదీ స్త్రీలకు చిన్నదిగా, పురుషులకు పెద్దదిగా ఉంటుంది. ఫీమర్ బోన్‌గా పిలిచే తొడ ఎముకను బట్టి ఆడా, మగా అనేది గుర్తించవచ్చు. స్త్రీల తొడ ఎముక సున్నితంగా ఉంటుంది. పురుషుల ఎముకకు కండ పట్టి రఫ్‌గా తయారవుతుంది. దైనందిన జీవితంలో చేసే పనుల్లో ఉన్న వ్యత్యాసం కారణంగానే ఇలా ఉంటాయని ఫోరెన్సిక్ నిపుణులంటున్నారు.

 

వయసు నిర్ధారిస్తారిలా..
అస్థిపంజరం ఏ వయసు వారిదో నిర్థారించడానికి పుర్రె చాలా కీలమైంది. శిశువు గర్భంలో ఉండగా పుర్రె ఏడు భాగాలుగా ఉంటుంది. ప్రసవం సమయంలో అవి అతుక్కుని ఒకటిగా మారతాయి. ఈ అతుకులనే వైద్య పరిభాషలో ‘సూచర్స్’ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ అతుకులు మాసిపోతాయి. అందుకే పసి వాళ్ల తలపై నడినెత్తి భాగం చాలా మెత్తగా ఉం టుంది. కొన్ని నెలలకు అది పూడి గట్టిగా తయారవుతుంది. సూచర్స్ ఉన్న స్థితిని బట్టి వయసు నిర్థారిస్తారు. పుర్రెలో ఉన్న పళ్లు కూడా వయసు నిర్థారణకు ఉపకరిస్తాయి. దీన్ని ‘ఫోరెన్సిక్ ఒడెంటాలజీ’ అంటారు. జ్ఞ్ఞానదంతం రాకపోతే 18 ఏళ్ల లోపుగా నిర్థారిస్తారు. మిగిలిన పళ్ల తీరు తెన్నులు, ఎముకల నిర్మాణం, వాటి పటుత్వం, ఎత్తు కూడా అస్థిపంజరం ఏ వయసు వారిదో గుర్తించడానికి ఉపకరిస్తాయి.

 

ఆఖరి ఆశలు డీఎన్‌ఏ పైనే...
అస్థిపంజరం లభించకుండా కేవలం కొన్ని ఎముకలే దొరికి, అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోతే గుర్తింపు కొద్దిగా ఇబ్బందే. అప్పుడు ఉన్న భాగాలను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపడం ద్వారా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షల్లోనే లింగం, వయసు తదితర వివరాలు బయపడతాయి. లభించిన అస్థిపంజరం ఎవరిదనేది గుర్తించాలన్నా డీఎన్‌ఏ పరీక్షలు తప్పనిసరి. అనుమానితుల సంబంధీకుల నుంచి  రక్తనమూనాల తీసుకోవడం లేదా అనుమానితుల మెడికల్ రికార్డుల ఆధారంగా లభించిన పుర్రెలు, ఎముకలకు డీఎన్‌ఏ టెస్ట్ చేసి అవి ఎవరివో ఓ అవగాహనకు వస్తారు. కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల గుర్తింపులో ఈ విధానాలన్నీ ఎంతో కీలమైనవి.


‘అనుమానం’ ఉంటే సూపర్ ఇంపోసిషన్...
ఓ ప్రాంతంలో లభించిన అస్థిపంజరం ఫలానా వారిదనే అనుమానం ఉండి, డీఎన్‌ఏ పరీక్షలకు అవసరమైన సంబంధీకుల రక్తనమూనాల, మెడికల్ రికార్డులు అందుబాటులో లేకుండా మరింత ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీన్నే ఫోరెన్సిక్ పరిభాషలో స్కల్ సూపర్ ఇంపోసిషన్ అంటారు. మనుషులందరికీ ముఖంలో నుదురు, కళ్లు, చెవులు, ముక్కు, నోరు వంటి భాగాలే ఉంటాయి. అయినప్పటికీ వాటి పరిమాణాల్లో ఉన్న తేడాల కారణంగానే ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. సూపర్ ఇంపొసిషన్ ప్రక్రియలో వీటినే ‘నిర్మిస్తారు’. ప్రత్యేక, అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్ సాయంతో పుర్రెను స్కాన్ చేయడం ద్వారా కంప్యూటర్ సాయంతో దానిపై ఒక్కో పొరను నిర్మించుకు వస్తారు. పుర్రె పరిమాణం, ఆకారాన్ని బట్టి ముఖంలో ఉండే భాగాలకు రూపమిస్తారు. ఫలితంగా అనుమానిత వ్యక్తి దగ్గరి రూపరేఖలు ఉండే పటం తయారవుతుంది. దీని ఆధారంగానే సదరు పుర్రెతో కూడిన అస్థిపంజరం ఫలానా వ్యక్తిదనే నిర్థారణకు వస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement