30న అసెంబ్లీ! | This Month 30th Telangana Assembly! | Sakshi
Sakshi News home page

30న అసెంబ్లీ!

Published Sat, Aug 27 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

30న అసెంబ్లీ!

30న అసెంబ్లీ!

* అదే రోజున శాసన మండలి భేటీ కూడా..
* ఒకే రోజు సమావేశం.. జీఎస్టీ ఆమోదమే ఎజెండా
* సభలను సమావేశపర్చాలని మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన సీఎం

సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఈనెల 30న శాసనసభ, శాసనమండలిని సమావేశపరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలని శుక్రవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలను కోరారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే.

ఆ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశపరచాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలకు సీఎం విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావడంతో సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి ఏజీ రామకృష్ణారెడ్డిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కోరారు. ఇక ప్రతిపక్షాలు కోరితే వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఖరారవుతుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement