వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చిక్కడపల్లి: నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందాడు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఎల్‌ఎన్ రాజు, ఎస్‌ఐ నాగుల్‌మీరా కథనం ప్రకారం.. కొత్తపేట సూర్యానగర్‌కు చెందిన దంతాల రాములు(27) న్యూ ఇయర్ వేడుకలకు గాంధీనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు తిరిగి వస్తుండగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నాగమయ్యకుంట విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద డివైడర్ ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య హర్షిణి, కూతురు శ్రేష్ఠ ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి
దిల్‌సుఖ్‌నగర్: నూతన సంవత్సరం ఆ ఇంట్లో విషాదం నింపింది. స్నేహితులకు శుభాకాంక్షలు చెబుదామని బయలుదేరిన బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మీర్‌పేట ఎస్‌ఐ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మాల్ ప్రాంతానికి చెందిన చెరుకు సత్తయ్య వలసవచ్చి అల్మాస్‌గూడలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నారు. సత్తయ్యకు కొండల్, గిరీష్ ఇద్దరు కుమారులు. గురువారం ఉదయం సైకిల్‌పై ఇద్దరు సోదరులు స్నేహితులను కలిసేందుకు బయలుదేరారు. మల్‌రెడ్డిరంగారెడ్డి కాలనీ మీదుగా వెళ్తుండగా వైఎస్సార్ నగర్ నుంచి అల్మాస్‌గూడ వైపు వెళ్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో గిరీష్ రోడ్డు పక్కకు పడిపోగా, కొండల్ మీది నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొండల్ (12) మృతిచెందాడు. మృతిచెందిన విద్యార్థి జిల్లెలగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న బైక్...
బంజారాహిల్స్: స్నేహితులతో నూతన సంవత్సర వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఫిలింనగర్‌లోని అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన సుమన్ (15), బాలకృష్ణ సోదరులు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్‌నంబర్2లోని షౌకత్‌నగర్‌లో తమ స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లడం ఎందుకని ఉదయమే వస్తామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారుజామున ఐదు గంటలకు బైక్‌పై వస్తుండగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ వెనుకాల కూర్చున్న సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా బాలకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
‘నూతన’ వేడుకల్లో అపశ్రుతి
Published Fri, Jan 2 2015 12:56 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement