Dissonance
-
గుడిలో తొక్కిసలాట
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. వండితురై కరుప్పుస్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే అన్నది భక్తుల నమ్మకం. ఆదివారం పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు. పూజల అనంతరం పిడి కాసుల కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38), పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నమ్మక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్న పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. -
‘మిషన్ కాకతీయ’లో అపశ్రుతి
మేడ్చల్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొలతలు తీసుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గిర్మాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం.. గిర్మాపూర్ గ్రామంలోని పంతులు చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కల్లూర్ గ్రామానికి చెందిన మల్లేష్(26) చెరువులో పనిచేసే కార్మికులు, అధికారులకు భోజనాలు తీసుకొచ్చే టాటా మొబైల్ వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం అతడు మేడ్చల్ నుంచి భోజనాలు తీసుకొని చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో ఎంత మట్టి తీశారు, ఇంకా ఎంత తీయాల్సి ఉం ది.. తదితర విషయాలను అధికారులు స్టీల్ స్కేల్‌తో కొలతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మల్లేష్ వెళ్లాడు. కార్మికులు కోరడంతో అతడు స్కేల్ పట్టుకొని కొలతలకు సహకరిస్తున్నాడు. సైట్ ఇంజినీర్ కొలతలు తీసుకునే క్రమంలో కొద్దిగా వెనక్కు వెళ్లాలని మల్లేష్‌కు సూచిం చాడు. దీంతో మల్లేష్ పట్టుకున్న స్టీల్ స్కేల్ ప్రమాదవశాత్తు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుదాఘాతమై అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంట నే కార్మికులు అతడిని స్థానిక ఘనాపూర్ మెడిసిటి ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో మల్లేష్ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. అయ్యో...పాపం.. మల్లేష్‌కు 20 రోజుల క్రితం వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం అతడు స్వగ్రామం నుంచి భార్యను తీసుకొచ్చి మండల పరిధిలోని బండమాదారం గ్రామంలో కాపురం పెట్టాడు. ఇటీవలే పెళ్లి.. అంతలోనే మల్లేష్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మల్లేష్ భార్య రోదించిన తీరు హృదయ విదారకం. కాగా, నిర్వాహకులు మృతుడి కుటుంబానికి పరిహారం అందజేసినట్లు సమాచారం. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నూతన’ వేడుకల్లో అపశ్రుతి
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి చిక్కడపల్లి: నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందాడు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ఎన్ రాజు, ఎస్ఐ నాగుల్‌మీరా కథనం ప్రకారం.. కొత్తపేట సూర్యానగర్‌కు చెందిన దంతాల రాములు(27) న్యూ ఇయర్ వేడుకలకు గాంధీనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు తిరిగి వస్తుండగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నాగమయ్యకుంట విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద డివైడర్ ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య హర్షిణి, కూతురు శ్రేష్ఠ ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి దిల్సుఖ్నగర్: నూతన సంవత్సరం ఆ ఇంట్లో విషాదం నింపింది. స్నేహితులకు శుభాకాంక్షలు చెబుదామని బయలుదేరిన బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మీర్‌పేట ఎస్ఐ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మాల్ ప్రాంతానికి చెందిన చెరుకు సత్తయ్య వలసవచ్చి అల్మాస్‌గూడలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నారు. సత్తయ్యకు కొండల్, గిరీష్ ఇద్దరు కుమారులు. గురువారం ఉదయం సైకిల్‌పై ఇద్దరు సోదరులు స్నేహితులను కలిసేందుకు బయలుదేరారు. మల్రెడ్డిరంగారెడ్డి కాలనీ మీదుగా వెళ్తుండగా వైఎస్సార్ నగర్ నుంచి అల్మాస్గూడ వైపు వెళ్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో గిరీష్ రోడ్డు పక్కకు పడిపోగా, కొండల్ మీది నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొండల్ (12) మృతిచెందాడు. మృతిచెందిన విద్యార్థి జిల్లెలగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్... బంజారాహిల్స్: స్నేహితులతో నూతన సంవత్సర వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఫిలింనగర్‌లోని అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన సుమన్ (15), బాలకృష్ణ సోదరులు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్‌నంబర్2లోని షౌకత్‌నగర్‌లో తమ స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లడం ఎందుకని ఉదయమే వస్తామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారుజామున ఐదు గంటలకు బైక్‌పై వస్తుండగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ వెనుకాల కూర్చున్న సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా బాలకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.