మేడ్చల్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొలతలు తీసుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గిర్మాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం.. గిర్మాపూర్ గ్రామంలోని పంతులు చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కల్లూర్ గ్రామానికి చెందిన మల్లేష్(26) చెరువులో పనిచేసే కార్మికులు, అధికారులకు భోజనాలు తీసుకొచ్చే టాటా మొబైల్ వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఈక్రమంలో గురువారం సాయంత్రం అతడు మేడ్చల్ నుంచి భోజనాలు తీసుకొని చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో ఎంత మట్టి తీశారు, ఇంకా ఎంత తీయాల్సి ఉం ది.. తదితర విషయాలను అధికారులు స్టీల్ స్కేల్‌తో కొలతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మల్లేష్ వెళ్లాడు. కార్మికులు కోరడంతో అతడు స్కేల్ పట్టుకొని కొలతలకు సహకరిస్తున్నాడు.
సైట్ ఇంజినీర్ కొలతలు తీసుకునే క్రమంలో కొద్దిగా వెనక్కు వెళ్లాలని మల్లేష్‌కు సూచిం చాడు. దీంతో మల్లేష్ పట్టుకున్న స్టీల్ స్కేల్ ప్రమాదవశాత్తు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుదాఘాతమై అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంట నే కార్మికులు అతడిని స్థానిక ఘనాపూర్ మెడిసిటి ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో మల్లేష్ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు.
అయ్యో...పాపం..
మల్లేష్‌కు 20 రోజుల క్రితం వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం అతడు స్వగ్రామం నుంచి భార్యను తీసుకొచ్చి మండల పరిధిలోని బండమాదారం గ్రామంలో కాపురం పెట్టాడు. ఇటీవలే పెళ్లి.. అంతలోనే మల్లేష్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మల్లేష్ భార్య రోదించిన తీరు హృదయ విదారకం. కాగా, నిర్వాహకులు మృతుడి కుటుంబానికి పరిహారం అందజేసినట్లు సమాచారం. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘మిషన్ కాకతీయ’లో అపశ్రుతి
Published Sat, May 16 2015 2:19 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement