
పాతబస్తీలో భారీ బందోబస్తు
-ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం
-భవానీనగర్‌లో బ్యాగు కలకలం..
-రెయిన్‌బజార్‌లో పట్టుబడిన నలుగురు దుండగులు
హైదరాబాద్ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు పాతబస్తీలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శుక్రవారం పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో నలుగురు అనుమానితులు పట్టుబడటం...వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని విదేశీయులు కావడంతో దక్షిణ మండలం పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు, ఒకరు పాకిస్తాన్, మరొకరు మయన్మార్‌లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో పలు కేసులతో సంబంధం ఉన్న మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. అలాగే భవానీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనుమానాస్పద బ్యాగ్ శుక్రవారం కలకలం రేపింది. ఆ బ్యాగ్లో బాంబు ఉండ వచ్చని స్థానికులు ఆందోళన చెందారు.
దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించిన అది ఖాళీ బ్యాగ్ అని తేల్చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలంలోని చార్మినార్, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ పరిధిలో భద్రతను పటిష్టం చేశారు.
అదనపు బలగాలతో నిఘా ముమ్మరం...
అన్ని ప్రాంతాల్లోనూ అదనపు బలగాలతో నిఘా ముమ్మరం చేశారు. పంద్రాగస్టు వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.