తల్లిఒడికి కిడ్నాపైన చిన్నారి
నల్లకుంట: న్యూనల్లకుంటలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఏఎస్‌రావునగర్‌లో శనివారం సాయంత్రం కుషాయిగూడ పోలీసులకు దొరికింది. వివరాలు... ఈనెల 6న న్యూనల్లకుంట నరేంద్రపార్క్ లేన్‌లో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కిడ్నాప్ చేసుకెళ్లి.. వారిలో ఇద్దరిని తార్నాకలో వదిలేసి కె.మమత (5)ను తమ వెంటతీసుకెళ్లిన విషయం విదితమే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. చిన్నారి మమత శనివారం సాయంత్రం ఏఎస్‌రావ్‌నగర్‌లోని సాయి సుధీర్ కళాశాల సమీపంలో బిక్కుబిక్కు మంటూ ఉండగా ఓ యువకుడు గమనించి కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు వెళ్లి చిన్నారిని స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రుల గురించి ఆరా చేపట్టారు. ఇదే క్రమంలో రాత్రి 9.30కి చిన్నారి మమత కిడ్నాప్ గురించి నల్లకుంట ఇన్‌స్పెక్టర్ జయపాల్‌రెడ్డి టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. తమ వద్ద ఉన్న చిన్నారి కిడ్నాప్‌కు గురైన మమతగా గుర్తించి కుషాయిగూడ ఎస్సై వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానిక పోలీసులు కుషాయిగూడ వెళ్లి చిన్నారిని రాత్రి 11.15 గంటలకు నల్లకుంట తీసుకొచ్చి తల్లిదండ్రులు కె.నారాయణ, మంజులకు అప్పగించారు. అపహరణకు గురైన కూతురు క్షేమంగా తమ చెంతకు చేరడంతో తల్లిదండులు ఆనందానికి అవధులు లేవు. చిన్నారిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశారు.
అమ్మేయడానికే తీసుకెళ్లారా?
మమతను కిడ్నాప్ చేసిన మహిళలు ఆమెకు నీటుగా కటింగ్ వేయించి, నెయిల్ పాలీష్ వేసి, కాళ్లకు పట్టా గొలుసులు పెట్టడంతో పాటు కొత్త దుస్తులు తొడిగారు. సాధారణంగా చిన్నారులను నగల కోసం అపహరించి, సొత్తు తీసుకున్నాక వదిలేస్తుంటారు. అయితే, చిన్నారిని ఇలా ముస్తాబు చేయడం బట్టి కిడ్నాపర్లు పాపను ఎవరికైనా అమ్మేయాలనుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి అపహరణలో బంధువులు, తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
కిడ్నాపర్ల కోసం కొనసాగుతున్న వేట...
చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తార్నాక బవార్చి హోటల్, సురక్ష చిల్డ్రన్స్ ఆస్పత్రి, పద్మావతి ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు మహిళలు చిన్నారులను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఈ ఫుటేజీని హాక్ ఐ, ఫేస్ బుక్‌ల్లో అప్‌లోడ్‌చేశారు. అలాగే, ఏఎస్‌రావ్ నగర్‌లో చిన్నారిని వదిలి వెళ్లిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లోని వీడియో ఫుటేజీలు సేకరించినట్టు తెలిసింది. వీటి ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నారు.