kushaiguda police
-
ఆడ నా? మగ నా? పోలీసుల పరేషాన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అర్థం కాక పోలీసులు లబోదిబోమంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. కీలక మలుపులు తిరుగుతున్న కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులో ఈ నెల 3వ తేదీన పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అరెస్టయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్ అడ నా లేదంటే మగ నా అనే విషయం తెలియక పోలీసులు గందరగోళంలో పడ్డారు. కేసు విచారణలో సిరాజ్ హుస్సేన్‌ను మగ మనిషిగా భావించిన పోలీసులు ఆ మేరకు విచారణ చేపట్టారు. కానీ, కేసుకు సంబంధించి డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే టైంలో తాను అడ్డ పిల్ల అని సిరాజ్ హుస్సేన్ చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. మూడు ఏళ్ల కిందట ముంబైలో లింగ మార్పిడి చేయించుకున్నట్లు సిరాజ్ చెప్పడంతో పోలీసులు మరింత డైలమాలో పడ్డారు. తన పేరు సయ్యద్ సిరాజ్ హుస్సేన్ కాదని, షాభిన అస్మి అని వెల్లడించారు. తను కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయినని కూడా పేర్కొన్నారు. దీంతో తలపట్టుకోవడం కుషాయిగూడ పోలీసుల వంతైంది. తాము అరెస్ట్ చేసిన వ్యక్తి ఆడ నా లేక మగ నా తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫొరెన్సిక్ విభాగానికి పోలీసులు లేఖ రాశారు. వైద్యుల నివేదిక ఆధారంగా సదరు నిందిత వ్యక్తి ఆడ నా లేదా మగ అన్నది తేల్చుకుని.. జెండర్ కాలమ్ నింపి కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, నేరస్తులను, నిందితులను చెడుగుడు ఆడుకునే పోలీసులకు ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడని టాక్ మొదలైంది. -
ట్రూకాలర్‌లో డీజీపీ అని పెట్టుకొని..
సాక్షి, హైదరాబాద్ : ట్రూకాలర్ ఈ స్మార్ట్ యాప్ గురించి తెలియని వారుండరు. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే వారి పేరును తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. ఈ యాప్ వాడే వ్యక్తులు తమ పేరును రిజిస్టర్ చేసుకుంటారు. అందరూ వాళ్ల అసులు పేరు లేకపోతే ముద్దుపేరు పెట్టుకుంటారు. కానీ తెలివిమీరిన ఓ వ్యక్తి పెట్టుకున్న పేరు, అతడు చేసిన మోసాలు కటకటాలపాలు చేసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి పారిశ్రామికవాడ, ఫేజ్–5లో బిట్ల వెంకటేశ్వరరావు అనే పారిశ్రామికవేత్తకు ఉజ్వల ఇండస్ట్రీస్ పేరిట పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 2017 డిసెంబరులో సికింద్రాబాద్‌కు చెందిన ఆర్ఈ కేబుల్స్ ప్రతినిధి హితేష్ జైన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. కాగా కంపెనీ వ్యవహరాలన్నీ హితేష్ జైన్ తమ్ముడు జతిన్ జైన్ చూసుకునేవాడు. ఈ క్రమంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పరిశ్రమ యజమాని వెంకటేశ్వరరావు జతిన్జైన్ను నిలదీశాడు. దీనిపై వివాదం ఏర్పడగా వెంకటేశ్వరరావు చర్లపల్లి అసోసియేషన్ ప్రతినిధులను ఆశ్రయించాడు. అసోసియేషన్ ప్రతినిధులు జతిన్ జైన్‌కు ఫోన్ చేశారు. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నేనెవరో మీకు తెలుస్తుంది...ఒక్కసారి ట్రూ కాలర్ చెక్ చేసుకోండి అంటూ బెదిరింపు లకు పాల్పడుతూ ఫోన్ కట్ చేశాడు. తరువాత ట్రూకాలర్‌లో చూడగా డీజీపీ–టీఎస్ అని రావడంతో అసోసియేషన్ ప్రతినిధులు బాధితునితో కలిసి మంగళవారం డీజీపీని కలిశారు. వెంటనే స్పందించిన డీజీపీ, సీపీతో మాట్లాడారు. రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు జతిన్జైన్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ!
సాక్షి, కుషాయిగూడ: ఇంట్లోని వాళ్లు నిద్రిస్తుండగానే దొంగలు లోనికి చొరబడి ఎంచక్కా తమ పని కానిచ్చుకుని వెళ్లిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ ఎ.ఎస్.రావు నగర్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదిమల్లు అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో దొంగలు చాకచక్యంగా ఆ ఇంటి తలుపు గడియ తొలగించి లోపలికి జొరబడ్డారు. పది తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. -
కోడలిపై లైంగిక దాడికి యత్నం.. మూడేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కోడలిపై లైంగిక దాడికి యత్నించిన మామకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 8వ అదనపు సహాయ సెషన్స్ జడ్జీ గురువారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగారెడ్డి కథనం ప్రకారం... కుషాయిగూడ ప్రాంతంలో నివాసముండే హరిప్రసాద్‌రావు తన కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ క్రమంలో 2013 ఆగస్టు 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరిప్రసాద్‌రావు కోడలిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగా హరిప్రసాద్‌రావు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ అదనపు సహాయ సెషన్స్ జడ్జీ ప్రతిమ తీర్పు చెప్పారు. -
ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన మహిళ
కుషాయిగూడ: కంటి ఆపరేషన్ వికటించడంతో ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన బాధితుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా వ్యవహరించి దుర్బాషాలడటంతో భాదితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, ముద్దాపురం గ్రామంలో ఇటీవల మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎం.ఎస్.రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు గ్రామానికి చెందిన పదిమందికి కంటి ఆపరేషన్ అవసరమని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన సావిత్రమ్మ (58) కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఏప్రిల్ -22న ఎంఎస్‌రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆసుపత్రి వైద్యులు కంటి ఆపరేషన్ నిర్వహించి మూడు రోజుల తరువాత డిశార్జు చేసి ఇంటికి పంపించారు. ఈక్రమంలో ఆమె తీవ్రమైన కంటి నొప్పితో బాదపడింది. విషయాన్ని డాక్టర్లకు చెప్పగా కొద్ది రోజులు నొప్పి ఉంటుందని సర్దిచెప్పి పంపారు. వారం రోజులైన నొప్పి తగ్గక పోవడంతో ఆసుపత్రికి తిరిగి వచ్చింది. పరిక్షించిన డాక్టర్లు ఆమెను ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించి అదే నెల 29న తిరిగి కంటి ఆపరేషన్ చేయించారు. ఐదు నెలలు గడిచిన కంటిచూపు రాలేదు. దీంతో భాదితులు ఎంఎస్‌రెడ్డి లయన్స్ ఆసుపత్రికి వెళ్లి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మా పట్ల దురుసుగా వ్యవహారిస్తు దుర్బాషాలడారని తెలిపారు. దీంతో న్యాయం కోసం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రి నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమీషన్‌ను కూడ ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఆసుపత్రి చైర్మన్ పుల్లయ్యను వివరణ కోరగా ఆమె మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే సమస్య తలెత్తిందని తెలిపారు. ఆపరేషన్ జరిగిన తరువాత మా పర్యవేక్షణలో ఉన్న ఆమె విజన్ చక్కగా ఉందని వివరణ ఇచ్చారు. -
వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి
-
వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి. మంగళవారం తాజాగా తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ కూషాయిగూడ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వడ్డీ వ్యాపారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
తల్లిఒడికి కిడ్నాపైన చిన్నారి
నల్లకుంట: న్యూనల్లకుంటలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఏఎస్‌రావునగర్‌లో శనివారం సాయంత్రం కుషాయిగూడ పోలీసులకు దొరికింది. వివరాలు... ఈనెల 6న న్యూనల్లకుంట నరేంద్రపార్క్ లేన్‌లో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కిడ్నాప్ చేసుకెళ్లి.. వారిలో ఇద్దరిని తార్నాకలో వదిలేసి కె.మమత (5)ను తమ వెంటతీసుకెళ్లిన విషయం విదితమే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా.. చిన్నారి మమత శనివారం సాయంత్రం ఏఎస్రావ్నగర్లోని సాయి సుధీర్ కళాశాల సమీపంలో బిక్కుబిక్కు మంటూ ఉండగా ఓ యువకుడు గమనించి కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు వెళ్లి చిన్నారిని స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రుల గురించి ఆరా చేపట్టారు. ఇదే క్రమంలో రాత్రి 9.30కి చిన్నారి మమత కిడ్నాప్ గురించి నల్లకుంట ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. తమ వద్ద ఉన్న చిన్నారి కిడ్నాప్‌కు గురైన మమతగా గుర్తించి కుషాయిగూడ ఎస్సై వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు కుషాయిగూడ వెళ్లి చిన్నారిని రాత్రి 11.15 గంటలకు నల్లకుంట తీసుకొచ్చి తల్లిదండ్రులు కె.నారాయణ, మంజులకు అప్పగించారు. అపహరణకు గురైన కూతురు క్షేమంగా తమ చెంతకు చేరడంతో తల్లిదండులు ఆనందానికి అవధులు లేవు. చిన్నారిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశారు. అమ్మేయడానికే తీసుకెళ్లారా? మమతను కిడ్నాప్ చేసిన మహిళలు ఆమెకు నీటుగా కటింగ్ వేయించి, నెయిల్ పాలీష్ వేసి, కాళ్లకు పట్టా గొలుసులు పెట్టడంతో పాటు కొత్త దుస్తులు తొడిగారు. సాధారణంగా చిన్నారులను నగల కోసం అపహరించి, సొత్తు తీసుకున్నాక వదిలేస్తుంటారు. అయితే, చిన్నారిని ఇలా ముస్తాబు చేయడం బట్టి కిడ్నాపర్లు పాపను ఎవరికైనా అమ్మేయాలనుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి అపహరణలో బంధువులు, తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. కిడ్నాపర్ల కోసం కొనసాగుతున్న వేట... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తార్నాక బవార్చి హోటల్, సురక్ష చిల్డ్రన్స్ ఆస్పత్రి, పద్మావతి ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు మహిళలు చిన్నారులను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఈ ఫుటేజీని హాక్ ఐ, ఫేస్ బుక్‌ల్లో అప్‌లోడ్‌చేశారు. అలాగే, ఏఎస్‌రావ్ నగర్లో చిన్నారిని వదిలి వెళ్లిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లోని వీడియో ఫుటేజీలు సేకరించినట్టు తెలిసింది. వీటి ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. -
స్కూటర్ డిక్కీలోంచి రూ.6.42 లక్షలు చోరీ
హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.6.42 లక్షలు చోరీకి గురయ్యాయి. కుషాయిగూడ పోలీసులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా సాయిప్రియ కాలనీకి చెందిన కె.వెంకటేష్ రీగల్ బార్లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని బావ గణేష్ పౌల్ట్రీ ఫామ్‌కు సంబంధించిన రూ.6.42 లక్షలను బ్యాంకులో వేయమని ఇచ్చాడు. వెంకటేష్ ఏఎస్రావు నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్తుండగా, మార్గమధ్యలో బండి నిలిపి ఓల్డ్ కాప్రా షాపు వద్ద సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకున్నాడు. ఇంతలో డబ్బులు అకౌంట్లో వేయాల్సిన మహ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఫోన్ చేసి, సదరు డబ్బును బ్యాంకులో వేయకుండా తన చేతికే ఇవ్వాలని కోరాడు. అందుకు గణేష్ అంగీకారం కూడా తీసుకున్న వెంకటేష్ రోడ్డుపక్కన స్కూటర్ నిలిపి ఖాసిం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు వచ్చి ఏదో చిరునామా అడిగి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత చూడగా, స్కూటర్ డిక్కీలో పెట్టిన నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయో వెంకటేష్ సరిగ్గా చెప్పలేక పోతున్నాడు. -
పోలీసుల అదుపులో దేవేందర్ గౌడ్ పుత్రరత్నం
టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్‌ను శుక్రవారం కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వీరేందర్ గౌడ్‌ను పోలీసులు కుషాయిగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరేందర్తోపాటు మరికొందరు టీడీపీ నేతలను కూడా పోలీసు స్టేషన్‌కు తరలించిన వారిలో ఉన్నారు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జ్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.