కుషాయిగూడ: కంటి ఆపరేషన్ వికటించడంతో ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన బాధితుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా వ్యవహరించి దుర్బాషాలడటంతో భాదితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, ముద్దాపురం గ్రామంలో ఇటీవల మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎం.ఎస్.రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు గ్రామానికి చెందిన పదిమందికి కంటి ఆపరేషన్ అవసరమని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన సావిత్రమ్మ (58) కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఏప్రిల్ -22న ఎంఎస్‌రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆసుపత్రి వైద్యులు కంటి ఆపరేషన్ నిర్వహించి మూడు రోజుల తరువాత డిశార్జు చేసి ఇంటికి పంపించారు. ఈక్రమంలో ఆమె తీవ్రమైన కంటి నొప్పితో బాదపడింది.
విషయాన్ని డాక్టర్లకు చెప్పగా కొద్ది రోజులు నొప్పి ఉంటుందని సర్దిచెప్పి పంపారు. వారం రోజులైన నొప్పి తగ్గక పోవడంతో ఆసుపత్రికి తిరిగి వచ్చింది. పరిక్షించిన డాక్టర్లు ఆమెను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించి అదే నెల 29న తిరిగి కంటి ఆపరేషన్ చేయించారు. ఐదు నెలలు గడిచిన కంటిచూపు రాలేదు. దీంతో భాదితులు ఎంఎస్‌రెడ్డి లయన్స్ ఆసుపత్రికి వెళ్లి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మా పట్ల దురుసుగా వ్యవహారిస్తు దుర్బాషాలడారని తెలిపారు. దీంతో న్యాయం కోసం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే ఆసుపత్రి నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమీషన్‌ను కూడ ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఆసుపత్రి చైర్మన్ పుల్లయ్యను వివరణ కోరగా ఆమె మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే సమస్య తలెత్తిందని తెలిపారు. ఆపరేషన్ జరిగిన తరువాత మా పర్యవేక్షణలో ఉన్న ఆమె విజన్ చక్కగా ఉందని వివరణ ఇచ్చారు.
ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన మహిళ
Published Thu, Sep 17 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement