
కోడలిపై లైంగిక దాడికి యత్నం.. మూడేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కోడలిపై లైంగిక దాడికి యత్నించిన మామకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 8వ అదనపు సహాయ సెషన్స్ జడ్జీ గురువారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగారెడ్డి కథనం ప్రకారం... కుషాయిగూడ ప్రాంతంలో నివాసముండే హరిప్రసాద్‌రావు తన కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ఆ క్రమంలో 2013 ఆగస్టు 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరిప్రసాద్‌రావు కోడలిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగా హరిప్రసాద్‌రావు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ అదనపు సహాయ సెషన్స్ జడ్జీ ప్రతిమ తీర్పు చెప్పారు.