మందుబాబులపై ‘ముప్పేట దాడి’
డిసెంబర్ 31న విధుల్లో 100 బృందాలు
స్టాటిక్, మొబైల్, డెకాయ్ టీమ్స్ ఏర్పాటు
వెల్లడించిన ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనా«థ్
సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల్లో భాగమైన ‘డిసెంబర్ 31’ని ప్రమాద రహితంగా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టాటిక్, మొబైల్, డెకాయ్ పేరుతో బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ రాత్రి మొత్తం 100 స్పెషల్ టీమ్స్ మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకోవడానికి పని చేస్తాయని ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. సాధారణంగా ప్రతి వారం జరిగే స్పెషల్ డ్రైవ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహిస్తుంటారు. అయితే గతంలో చోటు చేసుకున్న ఘటనలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఒకటే తేదీ తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. రహదారుల్లోని నిర్ణీత ప్రదేశంలో ఉండి తనిఖీలు చేయడానికి స్టాటిక్ టీమ్స్, వాహనంలో ఉపకరణాలతో నగర వ్యాప్తంగా సంచరిస్తూ అనుమానితుల్ని ఆపి తనిఖీలు చేయడానికి మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సిటీలో ఓ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు జరుగుతుంటే ఆ రూట్‌లో వచ్చే మందుబాబులు ఆ విషయం గుర్తించి దారి మళ్ళించుకుపోవడం పరిపాటిగా మారింది.
డిసెంబర్ 31ని సేఫ్ నైట్‌గా మార్చడంలో భాగంగా ఇలాంటి వారి కోసం నగర వ్యాప్తంగా డెకాయ్ బృందాలను మోహరిస్తున్నారు. ఈ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న స్టాటిక్ టీమ్స్ ఉన్న రహదారులకు అటు ఇటు ఉన్న మార్గాలో మాటు వేస్తాయి. తనిఖీలు చేస్తున్నట్లు వాహనచోదకులకు భ్రమ కలిగిస్తూ దారి మళ్ళించి డ్రైవ్ జరిగే ప్రాంతాలకు వెళ్ళేలా చూస్తాయి. తనిఖీ ప్రక్రియ ఆద్యంతం వీడియోగ్రఫీ చేస్తామని, మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని డీసీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వాహనచోదకుల డేటాను ఆధార్ నెంబర్‌తో లింకేజ్ చేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ వివరాలను ఉద్యోగ వెరిఫికేషన్లు చేసే అధికారులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఆయా అధికారులు ఇచ్చే నివేదికల్లో ఈ అంశాన్నీ పొందుపరుస్తారని, ఫలితంగా కొన్ని రకాలైన ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన వివరించారు.
గత ఏడాది చిక్కిన మందుబాబుల్లో కేవలం 2500 మందికే జైలు శిక్షలు పడగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మూడురెట్లు పెరిగి 7500కు చేరడాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకునే చర్యలు ప్రజల భద్రత కోసమే అని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని, మద్యం తాగిన స్థితిలో ఎవరూ వాహనాలు నడపవద్దని రంగనాథ్ కోరారు.
ఆ బాధ్యత యాజమాన్యాలదే..
నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలోని అనేక పబ్స్, బార్స్ సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ వద్ద మద్యం తాగిన కస్టమర్ల బాధ్యత సైతం ఆయా యాజమాన్యాలదే. అలాంటి స్థితిలో ఉన్న వారి భద్రత కోసం వారు వాహనాలు నడపకుండా చూడటం, అవసరమైతే డ్రైవర్లు/క్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం యాజమాన్యాల బాధ్యత. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి పడే శిక్షలతో పాటు ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ ది డే’ విధానం అవలంభించాలని, మద్యం తాగిన వాళ్ళు మామూలు స్థితిలో ఉన్న సహచరుల్ని డ్రైవర్‌గా వినియోగించుకోవడం వంటి అంశాలను ఆయా బార్లు, పబ్స్‌లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. – ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్