DCP Ranganath
-
మందుబాబులపై ‘ముప్పేట దాడి’
డిసెంబర్ 31న విధుల్లో 100 బృందాలు స్టాటిక్, మొబైల్, డెకాయ్ టీమ్స్ ఏర్పాటు వెల్లడించిన ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనా«థ్ సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల్లో భాగమైన ‘డిసెంబర్ 31’ని ప్రమాద రహితంగా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టాటిక్, మొబైల్, డెకాయ్ పేరుతో బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ రాత్రి మొత్తం 100 స్పెషల్ టీమ్స్ మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకోవడానికి పని చేస్తాయని ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. సాధారణంగా ప్రతి వారం జరిగే స్పెషల్ డ్రైవ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహిస్తుంటారు. అయితే గతంలో చోటు చేసుకున్న ఘటనలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఒకటే తేదీ తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. రహదారుల్లోని నిర్ణీత ప్రదేశంలో ఉండి తనిఖీలు చేయడానికి స్టాటిక్ టీమ్స్, వాహనంలో ఉపకరణాలతో నగర వ్యాప్తంగా సంచరిస్తూ అనుమానితుల్ని ఆపి తనిఖీలు చేయడానికి మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సిటీలో ఓ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు జరుగుతుంటే ఆ రూట్లో వచ్చే మందుబాబులు ఆ విషయం గుర్తించి దారి మళ్ళించుకుపోవడం పరిపాటిగా మారింది. డిసెంబర్ 31ని సేఫ్ నైట్‌గా మార్చడంలో భాగంగా ఇలాంటి వారి కోసం నగర వ్యాప్తంగా డెకాయ్ బృందాలను మోహరిస్తున్నారు. ఈ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న స్టాటిక్ టీమ్స్ ఉన్న రహదారులకు అటు ఇటు ఉన్న మార్గాలో మాటు వేస్తాయి. తనిఖీలు చేస్తున్నట్లు వాహనచోదకులకు భ్రమ కలిగిస్తూ దారి మళ్ళించి డ్రైవ్ జరిగే ప్రాంతాలకు వెళ్ళేలా చూస్తాయి. తనిఖీ ప్రక్రియ ఆద్యంతం వీడియోగ్రఫీ చేస్తామని, మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని డీసీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వాహనచోదకుల డేటాను ఆధార్ నెంబర్‌తో లింకేజ్ చేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ వివరాలను ఉద్యోగ వెరిఫికేషన్లు చేసే అధికారులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఆయా అధికారులు ఇచ్చే నివేదికల్లో ఈ అంశాన్నీ పొందుపరుస్తారని, ఫలితంగా కొన్ని రకాలైన ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన వివరించారు. గత ఏడాది చిక్కిన మందుబాబుల్లో కేవలం 2500 మందికే జైలు శిక్షలు పడగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మూడురెట్లు పెరిగి 7500కు చేరడాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకునే చర్యలు ప్రజల భద్రత కోసమే అని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని, మద్యం తాగిన స్థితిలో ఎవరూ వాహనాలు నడపవద్దని రంగనాథ్ కోరారు. ఆ బాధ్యత యాజమాన్యాలదే.. నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలోని అనేక పబ్స్, బార్స్ సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ వద్ద మద్యం తాగిన కస్టమర్ల బాధ్యత సైతం ఆయా యాజమాన్యాలదే. అలాంటి స్థితిలో ఉన్న వారి భద్రత కోసం వారు వాహనాలు నడపకుండా చూడటం, అవసరమైతే డ్రైవర్లు/క్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం యాజమాన్యాల బాధ్యత. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి పడే శిక్షలతో పాటు ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ ది డే’ విధానం అవలంభించాలని, మద్యం తాగిన వాళ్ళు మామూలు స్థితిలో ఉన్న సహచరుల్ని డ్రైవర్‌గా వినియోగించుకోవడం వంటి అంశాలను ఆయా బార్లు, పబ్స్‌లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. – ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
‘ఆటో’.. ఇటో... అంటే కుదరదు!
ప్రతి ఆటోకూ మీటర్ ఉండాల్సిందే దాని రీడింగ్ ప్రకారమే కిరాయి తీసుకోవాలి నాన్ ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ అయినా ఉండాలి కౌన్సెలింగ్‌లో స్పష్టం చేసిన డీసీపీ రంగనాథ్ సిటీబ్యూరో: నగరంలో తిరిగే ప్రతి ఆటోకూ మీటర్ ఉండాల్సిందేనని, దాని రీడింగ్ ఆధారంగానే ప్రయాణికుల నుంచి కిరాయి తీసుకోవాలని ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నగరంలో వివిధ రకాలైన ఉల్లంఘనలకు పాల్పడిన 250 మంది ఆటోడ్రైవర్లకు మంగళవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ)లో ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ ఆటోడ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాల్లో అనేక ఫిర్యాదు వస్తున్నాయి. వీటిలో అత్యధికం ఆటోల ఉల్లంఘనలకు సంబంధించివే. ప్రధానంగా మీటర్లు ఉండట్లేదని, ఉన్నా వాటితో సంబంధం లేకుండా చార్జీలు వసూలు చేస్తున్నారని జనం వాపోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్ల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని ఫిర్యాదు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రహదారి భద్రత సిఫార్సుల కమిటీ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం జైలు శిక్ష అవకాశం ఉన్న ఉల్లంఘనలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లి శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఆదేశాల ప్రకారమే తొలివిడతగా కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఆటోడ్రైవర్ల ఉల్లంఘనలు పెరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. క్యాబ్‌లనూ నియంత్రిస్తాం... ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివిధ రకాలైన క్యాబ్ సర్వీసుల కారణంగా తాము నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్లు చేస్తున్న ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్నామని రంగనాథ్ అన్నారు. ఇష్టానుసారంగా రేట్లు వసూలు చేస్తున్న క్యాబ్స్‌ను అదుపు చేయడానికి ఆర్టీఏ అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకోవడానికి కనీసం 8వ తరగతి విద్యార్హత ఉండాలని, నగరంలోని అనేక మంది ఆటోడ్రైవర్లు నిరక్షరాస్యులు, 8వ తరగతి కంటే తక్కువ చదివిన వారు ఉంటున్నారని రంగనాథ్ చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోడ్రైవర్లు తొలుత నాన్-ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకున్నా అంగీకరిస్తున్నామని, రెండుమూడేళ్ల అనుభవం తర్వాత దీని ఆధారంగా ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకునే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ తరహా లెసైన్సులు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తేవాలని, ఆర్టీఏ అధికారుల సహాయంతో మేళాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోల యజమానులుగా ఉన్న డ్రైవర్లూ ఆ వాహనాల తమ పేరిట లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి పరిష్కారంగా చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. ‘అవగాహన’కు ఆలోచనలుంటే స్వాగతం... రహదారి భద్రత, నిబంధనలపై నగరవాసులకు అవగాహన కల్పించడానికి సంబంధించి ఎలాంటి ఆలోచన ఉన్నా తమ వద్దకు వచ్చి పంచుకోవాలని రంగనాథ్ కోరారు. ఇలాంటి ఔత్సాహికులు తీసిన లఘు చిత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అన్ని రకాలైన ప్రచారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరానికి చెందిన ఖలీమ్ రూపొందించిన ‘ఇట్స్ నాట్ జస్ట్’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను రంగనాథ్ ఆవిష్కరించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ 22 నిమిషాల నిడివి కలిగిన ఈ లఘుచిత్రంలో మాజీ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపీనాథ్ యముడి పాత్రలో నటించారు. ఇందులోని ‘రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు... రక్తమోడుతున్నరు’ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డికి అంకితమిచ్చారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ మరణించిన విషయం విదితమే. టీటీఐలో జరిగిన కార్యక్రమంలో అదనపు డీసీపీ సుంకర సత్యనారాయణ, ఏసీపీలు జైపాల్, భద్రేశ్వర్, డాక్టర్ ప్రేమ్కాజల్లతో పాటు నాంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.హరీష్ తదితరులు పాల్గొన్నారు.