సేఫ్ అండ్ హ్యాపీ... | Safe and Happy ... | Sakshi
Sakshi News home page

సేఫ్ అండ్ హ్యాపీ...

Published Thu, Dec 31 2015 8:18 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

సేఫ్ అండ్ హ్యాపీ... - Sakshi

సేఫ్ అండ్ హ్యాపీ...

హైదరాబాద్: ‘న్యూ ఇయర్ వేడుకలు స్వేచ్ఛగా..సంతోషంగా జరుపుకోండి. అపశ్రుతులకు తావివ్వొద్దు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం..అందరూ సహకరించండి’ అంటూ నగర పోలీసు విభాగం పిలుపునిస్తోంది. నగర వ్యాప్తంగా గురువారం జరుగనున్న కొత్త సంవత్సర స్వాగత వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఐసిస్ అనుమానితుల అరెస్టు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు వంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీసులతో పాటు అదనపు బలగాలూ విధుల్లో ఉంటాయి.

నగరంలో పరిమితికి మించిన శబ్ధం చేసే డీజేలు తదితరాల వినియోగాన్ని నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు పడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని అధికారులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

హుస్సేన్‌సాగర్ చుట్టూ ‘నో-ఎంట్రీ’...
ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను నిషేధిస్తూ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.
 
దాదాపు అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్...
గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తున్న అధికారులు వాటిపై రాకపోకలకు అనుమతించరు. కేవలం ప్రత్యామ్నాయ మార్గాలు లేని, కింద రైల్వే ట్రాక్స్ ఉన్న బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్ వంటి ఫ్లైఓవర్లపై మాత్రమే రాకపోకలు ఉంటాయి. ఈ సమయంలో నగరంలోకి భారీ వాహనాల రాకపోకల్నీ నిషేధించారు. ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా చేయడంలో భాగంగా డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘటనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

‘ట్రాఫిక్’కు తెల్లవార్లూ నిలువుకాళ్ళ జీతమే..
సాధారణ రోజుల్లో వైన్‌షాపులు రాత్రి 10 గంటల వరకు, బార్లు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి ప్రభుత్వం డిసెంబర్ 31 రోజున వైన్‌షాపులు 12 గంటలు, బార్లు తెల్లవారుజాము 1 గంటల వరకు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక డ్రైవ్‌ను రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్వహించాలని నిర్వహించిన ట్రాఫిక్ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

‘108’ నిర్వహిస్తున్న సంస్థతోనూ ట్రాఫిక్ విభాగం తరఫున సంప్రదింపులు జరుపనున్నారు. గతంలో చోటు చేసుకున్న ఉదంతాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్టులు పెట్టుకుని వాహనాలు నడపాలని అధికారులు కోరుతున్నారు. తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకుని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా మెలిగి కొత్త ఏడాదిలో విషాదాలు, ప్రమాదాలు లేకుండా చేయాలని ట్రాఫిక్ వింగ్ కోరింది.

ఔటర్‌పై రాకపోకల నియంత్రణ
గురువారం ఔటర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించనున్నారు. రాత్రి 11 గ ంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సాధారణ ప్రజల వాహనాలను ఔటర్‌పైకి నిషేధించారు. ఇందు కోసం ఔటర్ జంక్షన్లలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వారి వాహనాలను మాత్రమే రాత్రి వేళ అనుమతిస్తారు.
 
ఈ నిబంధనలు కచ్చితంగా అమలు...
కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావ భావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు.అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు.ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి.న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు ‘పార్టీ’లకు రానివ్వొద్దు.
 
మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా...
న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ద ృష్టిలో పెట్టుకున్న పోలీసులు గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. వీరిపై నిఘా ఉంచి, చెక్ చెప్పేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలు, షీటీమ్స్ మోహరిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి.
 
మళ్లింపులు ఇలా...
వీవీ స్ట్యాచూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు.బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ని ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు.లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ని జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకపూల్, అయోధ మీదుగా మళ్లిస్తారు.
     
ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement