
అంతా.. స్కెచ్ ప్రకారమే!
♦ ఒక్కొక్కరికీ.. ఒక్కో హామీ...
♦ నేడు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్కెచ్‌కు దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కకావికలం అవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరినీ గులాబీ గూటికి చేర్చడంలో టీఆర్‌ఎస్ చీఫ్ సక్సెస్ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబీల్లో కావాల్సిన సాధారణ మెజారిటీ ఉన్నా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. టీడీఎల్పీ, వైఎస్సార్‌సీఎల్పీ విలీనం కూడా అయ్యాయి. ఇక 17 మంది పార్లమెంటు సభ్యుల్లో ముగ్గురు మినహా 14 మంది టీఆర్‌ఎస్‌లో ఉన్నట్టే. తాము గెలిచిన 11 ఎంపీలకుతోడు టీడీపీ, వైఎస్సార్‌సీపీల నుంచి ఒక్కొక్కరు గులాబీ గూటీకి చేరగా, బుధవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఆయనతో పాటు దేవర కొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ), మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు(కాంగ్రెస్) టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మరోైవె పు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ‘కాకా’ తనయులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ కూడా కాంగ్రెస్‌కు రాంరాం చెబుతున్నారు. అయితే పార్టీలో చేరుతున్న ఒక్కో నేతకు ఒక్కో రకమైన హామీని కేసీఆర్ ఇస్తున్నారని అంటున్నారు. ఒకరికి మంత్రి పదవి, మరొకరికి డిప్యూటీ సీఎం పదవి, కొందరికి ఇతరత్రా కేబినెట్ హోదా ఉన్న పదవుల తాయిలం చూపుతున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పలు తడవలు సీఎం కేసీఆర్‌తో జరిగిన చర్చల ఫలితమేనని విశ్లేషిస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ నేతల చేరికలకు ఏర్పాట్లు జరిగాయి.